రాజ్‌భవన్ టు రాష్ట్రపతి భవన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ రాజకీయ ప్రస్థానం
ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిౖకైన రామ్‌నాథ్ కోవింద్ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. పెద్దగా ప్రచారంలో లేని ఆయన వివాదాలకు కూడా దూరం. న్యాయవాది నుంచి రాజ్యసభ ఎంపీ, గవర్నర్, రాష్ట్రపతి అభ్యర్థి వరకు సాగిన ఆయన ప్రస్థానమిదీ..
దళితుల కోసం..
కోవింద్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లా దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1977–79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1980–93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్ 1986లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు.
రాజకీయాల్లో..
ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న కోవింద్ కమలదళానికి అత్యంత విధేయుడు. బీజేపీ వివాదా స్పద హిందుత్వ రాజకీయాలతో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. మతానికంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా ఆకర్షితులయ్యారని సన్నిహితులు చెబుతుంటారు. యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సన్నిహితునిగా పేరుంది. కోవింద్ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్ 1998–2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లి అక్కడ ప్రసంగించారు.
టీవీ చానళ్లకు దూరంగా..
కోవింద్ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారా నికి దూరంగా ఉన్నారు. ఏ చానల్లోనూ కనిపించలేదు. పార్టీ, రాజ్‌నాథ్ పట్ల ఉన్న విధేయత కారణంగా 2014లో బీజేపీ అధికారం చేపట్టాక 2015లో కోవింద్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. రైతు కుటుం బంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి.
ఊహకందని చాణక్యం! మోదీ–షాల రాజకీయం
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి.. అనూహ్య నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానిగా గెలిచిన తర్వాత కేబినెట్ కూర్పు దగ్గరినుంచి రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన వరకూ ప్రతీదీ ఎవరి ఊహకూ అందని నిర్ణయమే. అదే ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమి త్ షాల వ్యూహచతురతకు నిదర్శనం. మూడేళ్లుగా ఈ ద్వయం ‘మీరు అంచనాలు వేసుకోండి. మేం వాటిని పటాపంచలు చేస్తాం’ అని నిరూపిస్తూ దూసుకెళ్తోంది. ఈ జోడి ఇలా నిర్ణయాలు తీసుకోవటం ఇదేం కొత్తకాదు.
గుజరాత్లో సీఎం, హోంమంత్రులుగా ఉన్నప్పటినుంచీ ప్రత్యర్థుల అంచనాలకు ఏమాత్రం అందకుండా.. దెబ్బకొట్టడం వీరికి అలవాటు. మోదీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటినుంచి బాగా పరిచయం ఉన్న ఓ సీనియర్ జర్నలిస్టు.. కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముందు ‘మంత్రి వర్గంలో ఎవరెవరుండొచ్చు?’ అని మోదీని ప్రశ్నించా రు. దీంతో పెద్దగా నవ్విన మోదీ.. ‘మంత్రులకు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు వారిపేరుందో లేదో తెలీదు’ అని బదులిచ్చారు. హరియాణా సీఎంగా ఖట్టర్, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్‌ల ఎంపిక కూడా ఎవరి ఊహకూ అందనివే.
మిషన్ ‘యూపీ 2019’!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంలో యూపీ పాత్ర చాలా కీలకం. ఈ మూడేళ్లలో ప్రజాకర్షక పథకాలు ఎన్ని తెచ్చినా.. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మరేదో కావాలి. ఇది మోదీ, అమిత్ షాలకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా యూపీలాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలను కాపాడుకోవటం అంత సులువేం కాదు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో దళితుల ఓటుబ్యాంకు బలంగా ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీలు కలిసి పోటీచేసే అవకాశాలు కనబడుతుండటంతో రాజకీయ సమీకరణాలకు కమలదళం ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. దీంతో మోదీ–షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన కోవింద్‌ను ఎంపిక చేశారు.
ఇది కూడా 2019లో యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ–ఆరెస్సెస్ అనుసరిస్తున్న వ్యూహమేనని స్పష్టమవుతోంది. అంతేకాదు ఏకమై పుంజుకోవాలనుకుంటున్న యూపీలో ఇది విపక్షాలకు ఎదురుదెబ్బే. దీంతోపాటుగా రోహిత్ వేముల వివాదం, దళితులపై గోరక్షకుల దాడులు వంటివి బీజేపీ దళితులకు వ్యతిరేకమనే ముద్ర వేశాయి. ఈ సమయంలో యూపీతోపాటు దేశవ్యాప్తంగా ఈ ముద్రను తొలగించుకోవటం బీజేపీకి అత్యంత ఆవశ్యకం అందుకే అన్ని సమీకరణాల తర్వాత వ్యూహాత్మకంగానే రామ్‌నాథ్ కోవింద్ పేరు తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.