బుల్లెట్ రాణి అనుమానాస్పద మృతి..
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బుల్లెట్ రైడర్, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మోటివేటర్ సనాఇక్బాల్(32) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించారు. తనతో వేరుగా ఉంటున్న భర్త అబ్దుల్ నదీమ్‌తో కలసి సనా ప్రయాణిస్తున్న కారు నార్సింగిలోని సన్‌సిటీ వద్ద డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఉదంతంలో సనా తీవ్రగాయాలతో మరణించగా.. నదీమ్ గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే తన కుమార్తెను ఆమె మాజీ భర్తే హత్య చేశాడని సనా తల్లి షాహీన్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబీకులు వచ్చి ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆరోపణలపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఏడాదిగా దూరంగానే..
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సనాఇక్బాల్, అబ్దుల్ నదీమ్(37) హైటెక్ సిటీ ప్రాంతంలోని వేర్వేరు కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కొంతకాలంగా ఇరువురూ దూరంగా ఉంటున్న ప్పటికీ.. వీరి కుమారుడు కొన్ని రోజులు తండ్రి వద్ద.. మరికొన్ని రోజులు తల్లి వద్ద ఉంటు న్నాడు. లేడీ బైక్ రైడర్ అయిన సనా గతంలో దేశవ్యాప్తంగా బైక్‌పై సంచరిస్తూ ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు. నగరం లోనూ అనేక లాంగ్ డ్రైవ్ బైక్ రైడింగ్‌ల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భార్యాభర్తలు వేర్వేరుగా టోలిచౌకి ప్రాంతంలోనే నివసి స్తున్నారు. అప్పుడప్పుడు ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకునే వారు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న నదీమ్ అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సనా ఇంటి వద్దకు వచ్చాడు. అప్పుడే విధుల నుంచి వచ్చిన ఆమె సైతం కుమారుడికి అవసరమైన పాలు ఖరీదు చేయడానికి సోదరితో కలసి బయటకు వచ్చారు.
అక్కడకు వెళ్లిన నదీమ్ లాంగ్‌డ్రైవ్‌కు వెళ్దామంటూ సనాను తీసుకువెళ్లాడు. నదీమ్‌కు చెందిన ఫియట్ కారు (టీఎస్13ఈసీ2142)లో ఇరువు రూ బయలుదేరారు. లాంగ్ డ్రైవ్ కోసం గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లి అప్పా జంక్షన్ వద్ద దిగి రేడియల్ రోడ్డు ద్వారా బండ్లగూడ, పీరంచెరువు దాటి హైదర్షాకోట్ వద్ద ప్రధాన రహదారి మీదికి చేరుకున్నారు. అక్కడి ఆర్మీ స్కూల్ మలుపు వద్ద తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వీరి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దాని మధ్యలో ఉన్న స్తంభాన్ని బలంగా తాకింది. డ్రైవింగ్ సీటులో ఉన్న నదీమ్‌కు గాయాలు కాగా.. ఎడమ వైపు ముందు సీట్లో కూర్చున్న సనా తీవ్రంగా గాయపడింది. ఆమె తల, ఛాతీ భాగాల్లో బలమైన గాయాలయ్యాయి.
ఆ మార్గంలో వెళ్తున్న వాహనచోదకుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వాహనంలో ఇరుక్కుపోయిన ఇరువురినీ బయటకు తీసి ‘108’ద్వారా నానల్‌నగర్‌లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సనా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. నదీమ్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సనా మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
హత్యే అంటున్న కుటుంబీకులు..
సనాది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి షాహీన్ ఆరోపిస్తున్నారు. సనా భర్త నదీమ్‌కు దూరంగా ఉంటోందని, తన కుమారుడితో కలసి జీవిస్తోందని చెప్పారు. టోలిచౌకి ప్రాంతంలోనే తమ ఇంటికి దాదాపు కిలోమీటర్ దూరంలో నదీమ్ నివసిస్తున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. సోమవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన నదీమ్ కుమారుడి విషయం మాట్లాడాలంటూ తీసుకువెళ్లాడని చెప్తున్నారు. తన భర్త వేళకాని వేళలో తమ ఇంటికి వస్తూ వేధిస్తున్నారని, దుర్భాష లాడుతున్నట్లు సనా మేలో హుమాయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసిన పోలీసులు భరోసా కేంద్రంలోనూ కౌన్సెలింగ్ ఇప్పించారు.
అనుమానాస్పదంగా ప్రమాద తీరు..
సాధారణంగా ఏ వాహనమైనా రోడ్డుకు ఎడమ వైపు ప్రయాణిస్తుంది. అలాంట ప్పుడు రెండు రోడ్ల మధ్య ఉండే డివైడర్ వాహనానికి కుడి వైపు ఉంటుంది. కారు డివైడర్‌ను ఢీ కొంటే కుడి వైపు దెబ్బతినాల్సి ఉంది. అయితే సనా, నదీమ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొన్నప్పుడు ఎడమ వైపు పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఎడమ వైపు బలంగా ఢీ కొట్టినట్లు ప్రమాద స్థలిని బట్టి తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తల, ఛాతీ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలే ఆమె ప్రాణాలు తీశాయని పోలీసులు చెప్తున్నారు.
ప్రమాదానికి కారణమైన వాహనం ఎడమ పక్క పూర్తిగా ధ్వంసమైనా.. కుడి వైపు(డ్రైవింగ్ సీటు) కొద్ది మేర ధ్వంసమైంది. కారు ముందు భాగంలో ఎలాంటి డ్యామేజ్ లేకపోవడం అనుమానా లకు తావిస్తోంది. ప్రమాద స్థలి వద్ద వాహనానికి సడన్ బ్రేక్ వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు మంగళవారం సాయంత్రం సీసీ ఫుటేజీల సేకరణ ప్రయ త్నాలు చేపట్టారు. అప్పా నుంచి ప్రమాదం జరిగిన హైదర్షాకోట్ ఆర్మీ పాఠశాల క్రాసింగ్ వరకు దాదాపు 14 కెమెరాల సీసీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తు న్నారు. ఆలివ్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న నదీమ్‌కు పక్కటెముకల వద్ద మాత్ర మే దెబ్బలు తగలటం అనుమానాలకు బలాన్నిస్తోంది. నదీమ్‌ను బుధవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.
రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించారు..
మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో టోలిచౌకిలోని మా ఇంటికి వచ్చి సనాను బలవంతంగా నదీమ్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత గంటకే సన్‌సిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి సనా చనిపోయినట్టుగా తెలిసింది. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన కారు ముందు భాగం అంతా బాగానే ఉంది. సనా కూర్చున్న ఎడమవైపు వాహనం పూర్తిగా దెబ్బతింది. నదీమ్‌కు మాత్రం ఎటువంటి దెబ్బలు తగల్లేదు. ఇదంతా చూస్తే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా కనబడుతోంది. మూడేళ్ల క్రితం వివాహమైన సనాను ఇష్టమొచ్చినట్టు కొడుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో ఏడాది నుంచి దూరంగా ఉంటోంది. అయినా నదీమ్ ఇంటికి తరచూ వస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.– ప్రొఫెసర్ షాహీన్ ఖాన్, సనా తల్లి
సనా మృతి అసలు వెనుక ఏం జరిగింది ?