సైన్స్ ప్రయోగాలకు జంతువులను చంపొద్దు
యూనివర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో జీవశాస్త్ర కోర్సుల్లో ప్రయోగాల కోసం జంతువులను ఉపయోగించవద్దని, వాటిని చంపొద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. వివిధ ప్రయోగాలకు జంతువుల స్థానంలో కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన ఐసీటీ ప్రోగ్రాంలను వినియోగించుకోవాలని విద్యాసంస్థలకు సూచించింది.
కప్పలు, వానపాముల వంటి జంతువులను కోసి చేసే విచ్ఛేద(డిసెక్షన్) ప్రయోగాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను తాము అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. INFLIBNET/NMEICT పేరుతో రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ఈ నెల 5వ తేదీన జారీ చేసినట్లు ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ సింగ్ సంధు వెల్లడించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా శాఖలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని వివరించారు.