బ్లాక్‌బెర్రీ ఫైనల్ స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ డేట్స్ ఫిక్స్
ప్రపంచ ఫోన్ల మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్లాక్‌బెర్రీ, తన ఇన్-హౌజ్‌లో డిజైన్ చేసిన ఆఖరి స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమైంది. ఇన్-హౌజ్‌లో డిజైన్ చేసిన తన మెర్క్యూరీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. చైనీస్ సంస్థ టీసీఎల్ భాగస్వామ్యంలో ఈ డివైజ్‌ను అధికారికంగా ఫిబ్రవరి 25న జరుగబోయే ఈవెంట్లో లాంచ్ చేయనున్నామని కంపెనీ ప్రకటించింది. బార్సిలోనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షో ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందే దీన్ని లాంచ్ చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. బ్లాక్‌బెర్రీ మొబైల్ అకౌంట్లో ఈ లాంచింగ్‌ను రివీల్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న కీబోర్డు ఫోన్‌ను విడుదల చేయనున్నామని, మెర్క్యూరీ పేరుతో దీన్ని లాంచ్ చేస్తున్నామని తెలిపింది.
చైనా టీసీఎల్ కమ్యూనికేషన్ తయారుచేసిన బ్లాక్‌బెర్రీ డివైజ్‌లలో మెర్క్యూరీ మూడోవది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ వీడియోను టీసీఎల్ ఉత్తర అమెరికా అధ్యక్షుడు స్టీవ్ సిస్టుల్లీ విడుదల చేశారు. జనవరి మొదట్లో లాస్వేంగాస్లో జరిగిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ ఫోన్ గురించి బ్లాక్‌బెర్రీ, టీసీఎల్ మొదటిసారి రివీల్ చేశాయి. కానీ మిగతా వివరాలు వేటిని ఇవి ప్రకటించలేదు. కొత్త మెటాలిక్‌తో రాబోతున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టచ్‌స్క్రీన్, క్వార్టీ కీబోర్డు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కీబోర్డు మెసేజ్‌లు, ఈమెయిల్స్ చేసుకోవడానికి ఎంతో సహకరించనుందట. ఈ ట్రేడ్ షోలోనే శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ను కూడా విడుదల చేయనుంది. ఫోన్లు డిజైన్ చేయడం నుంచి తాము వైదొలుగుతామని బ్లాక్‌బెర్రీ సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. సాప్ట్‌వేర్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఇన్-హౌజ్ నుంచి రాబోతున్న ఫైనల్ స్మార్ట్ఫోనని తెలుస్తోంది.