‘డీటీసీ’ ప్రమాదాలు తగ్గుముఖం
న్యూఢిల్లీ, డిసెంబర్ : నాలుగు సంవత్సరాల్లో మొదటిసారిగా డీటీసీ బస్సుల వల్ల కలిగే ప్రాణాంతక దుర్ఘటనల సంఖ్య దాదాపు 50 శాతం తగ్గింది. 2013లో డీటీసీ బస్సు దుర్ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరం ఈ సంఖ్య 35కి తగ్గింది. డ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు నిరంతరం అవగాహన తరగతులు నిర్వహించడంతో సత్ఫలితాలు వచ్చాయి. డీటీసీ బస్సులతో సంబంధం ఉన్న రోడ్డు ప్రమాదాల సంఖ్య గత సంసవత్సరం 253 ఉండగా ఈ సంవత్సరం అది 187కి తగ్గింది.
ప్రమాదాల కారణాల వర్గీకరణ
బ్లూ లైన్ బస్సులను నిషేధించిన తరువాత డీటీసీ బస్సులు కిల్లర్ వెహికిల్స్‌గా మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించడం కోసం డీటీసీ, ట్రాఫిక్ పోలీసులు కలిసి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మొదట ప్రమాదాలకు కారణాలను వర్గీకరించారు. డ్రైవరు తప్పిదం, బాధితుడి తప్పిదం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, హిట్ అండ్ రన్ అంటూ వివిధ కేటగిరీలుగా విభజించి ప్రమాదాలకు అధిక కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. వేగంగా వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం, హఠాత్తుగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా మలుపుతిప్పడం వంటివి డ్రైవర్ తప్పిదాల్లో చేర్చి వాటిపై లోతుగా అధ్యయనం చేశారు.
ట్రైనింగ్ స్కూళ్ల ఏర్పాటు
డ్రెవర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడం కోసం ఏడు ట్రైనింగ్ స్కూళ్లను ప్రారంభించారు. నెలన్నర శిక్షణ తరువాతనే డీటీసీ బస్సు డ్రైవర్లు విధులలో చేరడాన్ని తప్పనిసరి చేశారు, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లను వెంటనే శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు. అప్పటికీ డ్రైవర్లు తమ ప్రవర్తనను చక్కదిద్దుకోనట్లయితే వారిపై డిపార్ట్మెంటల్ చర్యలు చేపట్టడం ఆరంభించారు. డ్రైవర్లందరికీ రిఫ్రెషర్ కోర్సు తప్పనిసరి చేశారు. ఈ చర్యల ఫలితంగా ఈ సంవత్సరం దుర్ఘటనల సంఖ్య తగ్గిందని డీటీసీ అధికారులు చెప్పారు.
డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల కొరడా
ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 283 డీటీసీ బస్సులను స్వాధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 1200 డ్రైవర్లు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తూ , 260 మంది డ్రైవర్లు సిగ్నల్ ఉల్లంఘిస్తూ, 249 మంది డ్రైవర్లు తప్పుగా ఓవర్‌టేకింగ్ చేస్తూ పట్టుబడ్డారు. అన్ని రోడ్లపై నిఘా పెట్టి ట్రాపిక్ నియమాలను ఉల్లంఘించిన డ్రైవర్లపై చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా వాహనాలను నడిపి,ప్రమాదాలకు బాధ్యులైన డ్రైవర్లను జైలుకు పంపారు. బస్సులను రెగ్యులర్‌గా తనిఖీ చేస్తూ స్పీడ్ గవర్నర్లు పనిచేయని బస్సులు గుర్తించి వాటిని సరిచేసేలా చర్యలు చేపట్టారు. కొందరు డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా స్పీడ్ గవర్నర్లు పాడుచేస్తున్నారని తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు, డీటీసీ అధికారులు అటువంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడమేకాక 171 బస్సుల పర్మిట్లు రద్దుచేశారు.