BNMC
-
నేడు భివండీ మేయర్ ఎన్నిక
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక (బీఎన్‌ఎంసీ) మేయర్ , డిప్యూటి మేయర్ పదవుల కోసం గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. మేయర్ బరిలో ఇద్దరు అభ్యర్థులు, డిప్యూటి మేయర్ బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం బీఎన్‌ఎంసీలో కోనార్క్ వికాస్ అగాడి అధికారంలో ఉంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన దరిమిలా శివసేన కార్పొరేటర్ తుషార్ చౌదరి మేయర్ పదవి కోసం పోటీపడుతున్నారు. అధికార పక్షంలో నుంచి కోనార్క్ వికాస్ అగాడి ఘట్‌నేత విలాస్ పాటిల్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇదిలా ఉండగా, డిప్యూటీ మేయర్ పదవి కోసం సమాజ్ వాది పార్టీ తరఫున దిల్షత్ ఖాన్, కాంగ్రెస్ నుంచి ఖాన్ ముక్తార్ మహ్మద్ అలీ, సిద్ధికి అహ్మద్‌హుస్సేన్, అన్సారీ మహ్మద్ హలీమ్, ఖాన్ దిన్ మహ్మద్ షా, మహ్మద్ ఫరేజ్, అన్సారీ సాజిమ్ హుస్సేన్, ఇమ్రాన్ మహ్మద్ ఖాన్ బరిలో ఉన్నారు. కాగా, భివండీ కార్పొరేషన్లో 90 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అధికార పక్షంలో వికాస్ ఆగాడి-10, బీజేపీ-10, రాష్ట్రవాది కాంగ్రెస్-9, సమాజ్‌వాది-16 పార్టీల (మొత్తం 45 మంది) కార్పోరేటర్లు ఉండగా, ప్రతిపక్షంలోని శివసేనకు 18, కాంగ్రెస్‌కు 27 మంది (మొత్తం 45 మంది) కార్పొరేటర్లు ఉన్నారు. గత మేయర్ ఎన్నికల సమయంలో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు గైరాజర్ కావడంతో వికాస్ ఆగాడికి చెందిన ప్రతిభా పాటిల్ విజయం సాధించింది. ప్రస్తుతం గురువారం జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాది పార్టీల్లో చీలకలు ఏర్పడే సూచనలు కనబడుతుండటంతో ఎవరు గెలుపొందుతారో వేచిచూడాల్సిందే. -
బాధ్యతల్ని చేపట్టిన కార్పొరేటర్
భివండీ, న్యూస్‌లైన్: సమాజ్‌వాదీ పార్టీ కార్పొరేటర్ ప్రశాంత్ లాడ్ మంగళవారం భివండీ నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గత నెల 29వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటి చైర్మన్ ఎన్నికలలో ప్రశాంత్ గెలుపొందిన విషయం విదితమే. ఈ సందర్భంగా మాజీ మేయర్, కోణార్క్ వికాస్ ఆఘాడీ నాయకుడు విలాస్ పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ చౌగులే, తుషార్ చౌదరి, శిక్షణ్ మండలి సభాపతి గాజు గాజెంగితో పాటు కార్పొరేషన్ అధికారులు, అభిమానులు ఆయనను అభినందించారు. అనంతరం ప్రశాంత్ లాడ్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. నిధుల కొరత సమస్య కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ విషయమై త్వరలో ఓ సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
బీఎన్‌ఎంసీలో కాంగ్రెస్ గెలుపు
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ వార్డులకు ఆదివారం ఉప ఎన్నికలు నిర్వహించగా, సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. వార్డు నంబరు-5(ఎ) కాంగ్రెస్ మహిళ కార్పొరేటర్ రెహానా సిద్దిఖీ, వార్డు నంబరు-6 (బి) కార్పొరేటర్ నూరుద్దీన్ అన్సారీ పదవులు రద్దు కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వార్డు నంబరు 5 (ఎ) నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి సిద్దిఖీ అంజుమ్అహ్మద్ గెలిచారు. ఆమెకు 2,237 ఓట్లు పోలవగా ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి షేక్ బద్రున్సీసా ముఖ్తార్‌కు 1,401 ఓట్లు వచ్చాయి. దీంతో అంజుమ్ 836 ఓట్ల అధిక్యంతో గెలిచారు. వార్డు నంబరు-6 (బీ)లో కాంగ్రెస్ అభ్యర్థి అన్సారీ దావుద్ ఇబ్రాహింకు 1,562 ఓట్లు పోలవగా ప్రత్యర్ధి అయిన ఎన్సీపీకి చెందిన అన్సారీ ఔరంగాజేబ్‌కు 994 ఓట్లు వచ్చాయి. దీంతో దావూద్ 568 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. -
ఫిర్యాదులు ఇక నేరుగా కమిషనర్ చెంతకే..
భివండీ, న్యూస్‌లైన్: ప్రజల సమస్యలను నేరుగా భివండీ -నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) కమిషనర్ వద్దకు చేరేవిధంగా ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలో ఐదు ప్రభాగ్ సమితులు ఉన్నాయి. ప్రతి ప్రభాగ్లో ప్రత్యేక ఫిర్యాదు నమోదు పుస్తకం (కంప్లైంట్ రిజిస్టర్ బుక్)ను ఏర్పాటు చేశారు. గతంలో నివేదికల ద్వారా సమస్య గురించి కార్పొరేషన్‌కు తెలిపేవారు. అయితే కొత్త పద్ధతి వల్ల కమిషనర్ జీవన్ సోనావణేకి నేరుగా ఫిర్యాదు అందుతుంది. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ జీవన్ స్పష్టం చేశారు. వీధి దీపాలు, మంచి నీరు, మురుగు కాలువలు, చెత్త, దుర్గంధం తదితర సమస్యలపై ఫిర్యాదులను పుస్తకంలో నమోదు చేసి, చిరునామా, మొబైల్ నంబర్ రాయాలి. ఆ తర్వాత సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విధులు నిర్వహించే ఉద్యోగుల హాజరు కోసం బయోమెట్రిక్ పద్ధతిని ఉపయోగించాలని 2011 మార్చి 31న ఆదేశాలు జారీచేసింది. కానీ ఇంతవరకు పట్టణంలోని ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పద్ధతిని పాటించడంలేదనే ఆరోపణలున్నాయి. దీని వల్ల తమ పనులు సకాలంలో పూర్తికావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తగు చర్యలు తీసుకో వాలని విన్నవిస్తున్నారు.