ప్రజల సమస్యలను నేరుగా భివండీ -నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) కమిషనర్ వద్దకు చేరేవిధంగా ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించారు.
భివండీ, న్యూస్‌లైన్: ప్రజల సమస్యలను నేరుగా భివండీ -నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) కమిషనర్ వద్దకు చేరేవిధంగా ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలో ఐదు ప్రభాగ్ సమితులు ఉన్నాయి. ప్రతి ప్రభాగ్‌లో ప్రత్యేక ఫిర్యాదు నమోదు పుస్తకం (కంప్లైంట్ రిజిస్టర్ బుక్)ను ఏర్పాటు చేశారు. గతంలో నివేదికల ద్వారా సమస్య గురించి కార్పొరేషన్‌కు తెలిపేవారు.
అయితే కొత్త పద్ధతి వల్ల కమిషనర్ జీవన్ సోనావణేకి నేరుగా ఫిర్యాదు అందుతుంది. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ జీవన్ స్పష్టం చేశారు. వీధి దీపాలు, మంచి నీరు, మురుగు కాలువలు, చెత్త, దుర్గంధం తదితర సమస్యలపై ఫిర్యాదులను పుస్తకంలో నమోదు చేసి, చిరునామా, మొబైల్ నంబర్ రాయాలి.
ఆ తర్వాత సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విధులు నిర్వహించే ఉద్యోగుల హాజరు కోసం బయోమెట్రిక్ పద్ధతిని ఉపయోగించాలని 2011 మార్చి 31న ఆదేశాలు జారీచేసింది. కానీ ఇంతవరకు పట్టణంలోని ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పద్ధతిని పాటించడంలేదనే ఆరోపణలున్నాయి. దీని వల్ల తమ పనులు సకాలంలో పూర్తికావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తగు చర్యలు తీసుకో వాలని విన్నవిస్తున్నారు.