బొమ్మలబాయి
ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను.
ఇది నేను బతికిన ఇరవై సంవత్సరాల కవిత్వం. రాజకీయ, సామాజిక వైయక్తిక ఆధ్యాత్మిక సృజనాత్మక సుడులతో... దిగులుతో, పొగిలిపోతూ ప్రత్యేక అస్తిత్వం కోసం అంగలారుస్తూ పోటెత్తుతూ నన్ను క్షణవరతం ముంచేసిన కవిత్వం. రెండు దశాబ్దాల/ నిద్రపోనివ్వని రాత్రుల/జంగమ జాతరల/ రంది రగడల కవిత్వం. ఈ వాక్యాలతో, ముచ్చట్లతో నాకు నాతో నాలోని మన నేనుతో తొట్టెలూగాను. ఈ తొట్టెలకు భూమి కేంద్రం నా ఊరు నా తెలంగాణ నా హైదరాబాద్. ఈ వాక్యాల కట్టడాల అంతస్సుల్లో మల్లా కొత్త జన్మనెత్తాలన్న ప్రాకృతిక వాంఛను నేను అనుభవిస్తున్నాను. ఔటర్ ఇన్నర్ రింగురోడ్ల కింద కుమిలే/ మసలే పంట పొలాల ఆకుపచ్చని రక్తాల వాసనను నేను అనుభవిస్తున్నాను.
పుస్తకాల్లో- నాకు నచ్చిన వాక్యాలు తగిలినపుడు జ్వరమొచ్చి నీరసపడిపోయి వాటి మత్తులో గంటల తరబడి ట్రాన్స్‌లో ఊగిపోయిన సందర్భాలు చాలా వున్నాయి. నేను ప్రాథమికంగా పాఠకుడిని. పాఠకత్వంలో ఉన్న ఆనందం నాకు దేంట్లోనూ దొరకలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిగా ఊగిపోవడం తప్ప ఏమి చెయ్యలేనివాణ్ని... కవిత్వం పాఠకుడిని మత్తులోకి జీవనలాలసలోకి, దైన్యధైర్యంలోకి, తెగింపులోకి తీసుకుపోతుంది. అదే దాని శక్తి. అది మనలో రేపే తిరుగుబాటు అంతరిక భౌతిక సరిహద్దుల్ని దాటేస్తుంది. కొత్త మరణాల్లోకి అటు నుంచి కొత్త పుట్టుకల్లోకి జీవిని తీసుకుపోతుంది. కవిత్వం ద్వారా నేను చూసిన వాన మబ్బుల సౌందర్యంతో పాటు పంట సాళ్ళ పగుళ్ళ బతుకు భయ బీభత్స సౌందర్యం కూడా వుంది. తెలుపు నలుపులోని వర్ణ సమ్మేళనాల రసాయనిక చిత్చర్య వుంది. శబ్దభూమిలోని నిశ్శబ్ద రుద్రభూమి ఆనవాలు వుంది.
కవిత్వం రాసేటోడికి వాని వునికి వానికి తెలిసిరావాలె కదా. మన ఇళ్ళు వాకిలి మన ఇంటోళ్ళ బతుకూ, బరువూ బలుపు, ఎత చిత, కులం/ పొలం జలం/ పొయ్యికాడి దేవతా, తలపోతలోని గ్రామదేవుడూ, దయ్యం దాని శిగమూ తెలిసిరావాలె కదా. మన అమ్మలక్కల చీకటి గదుల అర్రల, చెప్పుకోని చింతల, వారి మాటల పనిముట్ల మూటలు మనం మోయాలె కదా. మనలో ఎప్పటికి పోరగాని తనమే తలనూపాలె కదా...
ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను.
సిద్ధార్థ
(బొమ్మలబాయి- సిద్ధార్థ కవిత్వం; ప్రచురణ: మట్టి ముద్రణలు. సిద్ధార్థ ఫోన్: 9603318460)