Bompelli
-
మరో ఎస్సైపై వేటు
పెద్దపల్లి ఎస్సైను హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేసిన సీపీ సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా బొంపల్లిలో రాత్రి పూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన దళిత దంపతులను దుర్భాషలాడుతూ, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదిన ఘటనలో మరో ఎస్సైపై వేటు పడింది. ఇప్పటికే ధర్మారం ఎస్సై హరిబాబును హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేసిన రామగుండం సీపీ విక్రంజిత్ దుగ్గల్ ఆదివారం పెద్దపల్లి ఎస్సై తడబోయిన శ్రీనివాస్‌నూ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పెద్దపల్లి తాత్కాలిక ఎస్సైగా మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న బానోతు వెంకన్నను నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ‘ఖాకీ కావరం’పై విచారణ ఖాకీ కావరం అట్రాసిటీ కేసుపై విచారణ షురూ: దళిత దంపతులు అరికెల్ల శ్యామల, దేవేందర్‌పై కలెక్టర్ అళగు వర్షిణి సూచనలు.. బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శ్యామల ఫిర్యాదు మేరకు ధర్మారం, పెద్దపల్లి ఎస్సైలు హరిబాబు, శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కేసుపై విచారణ జరిపేందుకు మంచిర్యాల ఏసీపీ సతీష్‌ను సీపీ దుగ్గల్ నియమించారు. ఇద్దరు ఎస్సై లపై నమోదైన కేసును నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకుగా నూ పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ను బాధ్యతలనుంచి తప్పిస్తున్నట్టు డీసీపీ విజేందర్‌రెడ్డి తెలిపారు. -
పోలీసులపై కలెక్టర్ వర్షిణి ఆగ్రహం
పెద్దపల్లి: రాత్రివేళ పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయబావి వద్దకు వెళ్లిన దళిత దంపతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పోలీస్‌స్టేషన్‌కు తరలించి చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జన్యకాండపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి సీరియస్‌గా ఉన్నారు. బాధితురాలు అరికెల్ల శ్యామల నిన్న కలెక్టర్‌ను కలిసి తనగోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ మహిళ హక్కులకు, పిల్లల హక్కులను భంగం కలిగిందని నిర్ధారణకు వచ్చారు. సోమవారం రాత్రే రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్‌కు లేఖ రాశారు. తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వమని కోరారు. మహిళా పోలీసులు ఏరీ? బాధితురాలు జిల్లా కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అర్ధరాత్రి పోలీసు జీపులో తనను, భర్త, పిల్లలను పోలీస్ స్టేషన్‌కు తరలించారని వివరిస్తుండగా.. ఆ సమయంలో మహిళా పోలీసులు ఉన్నారా..? అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేరని శ్యామల సమాధానం ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్చానికి గురయ్యారు. సీపీకి రాసిన లేఖలోనూ పోలీసులు భార్యాభర్తలతోపాటు పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారని వివరించారు. మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళను రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఎలా ఉంచారని పేర్కొన్నారు. మహిళా హక్కులకు భంగం కలగడంతోపాటు ఇది పిల్లలను మానసికంగా వేధించడమే అని భావించిన కలెక్టర్ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ,ఎస్టీ కమిషన్, పిల్లల సంక్షేమ బోర్డు, కరీంనగర్ జిల్లా పిల్లల సంక్షేమ కమిషన్లకు లేఖలు రాశారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోం శాఖ కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. ఈ లేఖలు అధికార వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. పోలీసుశాఖలో గుబులును రేకెత్తిస్తున్నాయి. ఆ ఎస్ఐపై గతంలోనే ఇలాంటి ఫిర్యాదు.. కలెక్టర్ వర్షిణి రామగుండం సీపీకి రాసిన లేఖలో పెద్దపల్లి ఎస్ఐ శ్రీనివాస్‌పై గతంలోనే ఇలాంటి ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. గోదావరిఖని చెందిన బి.గణేశ్ పెద్దపల్లిలో బస్టాండ్ సమీపంలో రోడ్డును దాటుతుండగా.. ఎస్ఐ అదుపులోకి తీసుకొని రాత్రంతా స్టేషన్లో ఉంచి, మరుసటి రోజు వదిలేశారని వివరించారు. దీనిపై గణేశ్ తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై గతనెల 14తేదీన బాధితుడిని డీసీపీ వద్దకు పంపానని, దీనిపై ఏం చర్య తీసుకున్నారో, అసలు ఏం జరిగిందో ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, విచారణ అధికారిగా నియమించిన పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌లో ఉండడంతో గోదావరిఖని ఏసీపీ అపూర్వారావు మంగళవారం బాధితురాలి స్వగ్రామమైన పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
‘ఖాకీ కావరం’పై విచారణ
-
‘ఖాకీ కావరం’పై విచారణ
స్పందించిన రామగుండం సీపీ సాక్షి, పెద్దపల్లి: రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన దళిత దంపతులను అవమానకర రీతిలో దూషించడంతోపాటు స్టేషన్‌కు తరలించి చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జ న్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా లోని బొంపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ‘ఖాకీ కావరం’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై రామగుండం పోలీసు కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ విచారణకు ఆదేశించారు. పెద్దపల్లి ఏసీపీ, ఐపీఎస్ అధికారి సి.హెచ్.సింధూశర్మను విచార ణాధికారిగా నియమించారు. ఘటనకు కారకుడైన ధర్మారం ఎస్సై హరిబాబును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఖాకీ కావరం దాడి ఘటనపై బాధితురాలు అరికెల్ల శ్యామల తన ముగ్గురు పిల్లలతో కలసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణితోపాటు దుగ్గల్‌ను వేర్వేరుగా కలసి గోడు వెళ్లబోసుకున్నారు. ‘కేసులా ఉన్నావ్’ అంటూ ఎస్సై హరిబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై నిలదీసినందుకు తన భర్త దేవేందర్‌ను చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా మహిళా అధికారి (డీబ్య్లూవో) పద్మావతిని కలెక్టర్ ఆదేశించగా ఏసీపీతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దుగ్గల్ పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలు శ్యామలను పౌరహక్కుల సంఘం నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. బాధ్యులైన ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేయాలని దుగ్గల్‌ను కలసి డిమాండ్ చేశారు. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా బాధిత కుటుంబం, బంధువులు రాస్తారోకో చేసినందుకు 16 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బాధితురాలు శ్యామలను పరామర్శించారు. సీఎం సీరియస్..! ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించినట్టు తెలిసింది. దళిత దంపతులపై దాడి చేసిన పోలీసులపై ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు విభాగంలో ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్‌ను సీఎం ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. -
దళిత దంపతులపై ఎస్సై దాష్టీకం
-
ఖాకీ కావరం
రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన దళిత దంపతులపై ఎస్సై దాష్టీకం - ‘కేసులా ఉన్నావ్.. దుకాణం నడుపుతున్నావా..?’ అంటూ వ్యాఖ్యలు - నిలదీసిన భర్తను చితకబాదిన వైనం - స్టేషన్‌కు తరలింపు.. అక్కడ మరో ఎస్సై దౌర్జన్యం - భర్తను కొట్టొద్దంటూ కాళ్లావేళ్లా పడ్డ భార్య - పక్కకు తోసేయడంతో కిందపడి అస్వస్థతకు గురైన భార్య - పెద్దపల్లి జిల్లాలో దారుణం పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్: వారు దళిత దంపతులు.. రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేం దుకు వెళ్లారు.. పిల్లలు మారాం చేస్తే వారినీ వెంట తీసుకెళ్లారు.. అంతా కలసి సొంత ఆటోలో పొలానికి చేరారు.. భర్త ఆటో దిగి మోటార్ స్టార్ట్ చేసేందుకు వెళ్లాడు.. ఇంతలో గస్తీ కాస్తున్న ఎస్సై అటుగా వచ్చాడు.. వాహనం ఆపి ‘ఇక్కడేం చేస్తున్నావ్..?’అంటూ ఆమెను గద్దించాడు.. పొలానికి నీళ్ల కోసం వచ్చామంది.. అందుకు ఎస్సై.. ‘చాల్లే ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతు న్నావా..’అంటూ నానా దుర్భాషలాడాడు! ఇంతలోనే అక్కడికి వచ్చిన ఆమె భర్త.. ఎస్సై ప్రవర్తనపై నిలదీశాడు. అంతే.. ఆ ఎస్సైకి ఎక్కడలేని కోపమొచ్చింది! నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ఆయన్ను చితకబాదాడు. భార్య కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. జీపులో వారిద్దరినీ తీసుకెళ్లి స్టేషన్లో పడేశాడు. అక్కడ మరో ఎస్సై.. ‘మాకే ఎదురుచెబుతావా..?’అంటూ ఆయన్ను మళ్లీ తీవ్రంగా కొట్టాడు. అడ్డొచ్చిన ఆయన భార్యను నెట్టేయ డంతో ఆమె కింద పడి అస్వస్థతకు గురైంది. ఏ తప్పూ చేయకున్నా దంపతులపై పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు ఎస్సైలు సాగించిన దాష్టీకమిదీ!! ఏం జరిగిందంటే..? బాధితుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన అరికిల్ల మధునయ్యకు ధర్మారం ప్రధాన రోడ్డుకు రెండెకరాల భూమి ఉంది. అందులో వరి పంట వేశాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టి రావాల్సిందిగా మధునయ్య తన కొడుకు దేవేందర్‌కు చెప్పాడు. దీంతో ఆయన తన సొంత ఆటోలో పొలానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. మేమూ వస్తామంటూ పిల్లలు అపర్ణ, సంపూర్ణ, బ్లెస్సీ మారాం చేశారు. పిల్లలతోపాటు దేవేందర్ భార్య శ్యామల కూడా బయల్దేరింది. అంతా కలసి పొలానికి వెళ్లారు. మోటార్‌ను స్టార్ట్ చేసేందుకు దేవేందర్ వెళ్లగా.. భార్యాపిల్లలు ఆటోలో కూర్చున్నారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ధర్మారం ఎస్సై హరిబాబు పోలీస్ వాహనం ఆపి.. ఇక్కడేం చేస్తున్నావంటూ శ్యామలను ప్రశ్నించాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వచ్చామని ఆమె చెప్పినా వినలేదు. (ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల, పక్కనే పిల్లలు) ‘ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతున్నావా..’అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అప్పుడే వచ్చిన దేవేందర్.. ఏం మాట్లాడున్నారంటూ ఎస్సైని నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన ఎస్సై అతడిని కొట్టాడు. ఈ సమయంలో ఎస్సై తన ఒంటిపై దుస్తులను కూడా చించాడని శ్యామల ఆరోపించింది. అనంతరం ఎస్సై వారిద్దరినీ పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనను స్థానిక ఎస్సై శ్రీనివాస్‌కు చెప్పాడు. ‘మాకే ఎదురుచెబుతావా..’అంటూ దేవేందర్‌ను శ్రీనివాస్ స్టేషన్లో మళ్లీ కొట్టారు. తన భర్త ఏ తప్పు చేయలేదని, స్టేషన్లో శ్యామల కేకలు వేయడంతో పోలీసులు ఆమెను నెట్టివేశారు. దీంతో కింద పడి ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు. భార్యాభర్తలపై కేసు: ఎస్సై శ్రీనివాస్ ధర్మారం ఎస్సై హరిబాబుపై అనుచితంగా ప్రవర్తించిన దేవేందర్, శ్యామలపై కేసు నమో దు చేశామని పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపా రు. దేవేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఏం చేస్తున్నారన్నందుకు ఎస్సైపై దౌర్జన్యం చేయడంతో వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. శ్యామలను సోమవారం అరెస్టు చేస్తామన్నారు. కాళ్లావేళ్లా పడ్డా.. తన భర్తను కొట్టొద్దని ఎంత వేడుకున్నా ఎస్సై శ్రీనివాస్ కనికరించలేదని శ్యామల కన్నీటి పర్యంతమైంది. పోలీసుల దెబ్బలకు నడవలేకపోతున్నాడని తెలిపింది. ఆదివారం తన భర్తను చూపించాలని పోలీసులను కోరినా చూపించలేదని వివరించింది. పోలీసుల తీరుకు నిరసనగా బొంపల్లికి చెందిన దళిత మహిళలు, సీఐటీయూ నాయకులు, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నాయకులు స్థానిక సివిల్ ఆస్పత్రి వద్ద రాస్తారోకో చేశారు. బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్, పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చేసిన 16 మందిపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దళిత దంపతులపై అరాచకానికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. (ఎస్సై హరిబాబు, ఎస్సై శ్రీనివాస్) ఎస్సైలపై ఫిర్యాదుల పరంపర పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్ సాయం త్రం 7 గంటలు దాటితే రోడ్లపై యువకులు కనిపిస్తే చితకబాదుతున్నారని పలువురు బాధితులు ఇటీవల ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లిలోని కమాన్ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువకుడు ఎస్సై కోచింగ్ కోసం మిత్రులతో కలసి చర్చిస్తుండగా.. రోడ్డుపై ఏం చేస్తున్నారంటూ లాఠీతో బాదారు. దీంతో ఆ యువకుడు పైఅధికారికి ఫిర్యాదు చేశాడు. మజీద్ చౌరస్తా వద్ద ఓ విద్యార్థి ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతుంటే అకారణంగా కొట్టాడంటూ అతడి తండ్రి డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై హరిబాబు తన కారును సొంతానికి వాడుకుంటూ బెదిరిస్తున్నాడంటూ ధర్మారానికి చెందిన ఎల్లాల మహేందర్‌రెడ్డి ఐదు రోజుల క్రితం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంటే ఎస్సైలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.