
పోలీసులపై కలెక్టర్ వర్షిణి ఆగ్రహం
పెద్దపల్లి: రాత్రివేళ పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయబావి వద్దకు వెళ్లిన దళిత దంపతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పోలీస్‌స్టేషన్‌కు తరలించి చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జన్యకాండపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి సీరియస్‌గా ఉన్నారు. బాధితురాలు అరికెల్ల శ్యామల నిన్న కలెక్టర్‌ను కలిసి తనగోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ మహిళ హక్కులకు, పిల్లల హక్కులను భంగం కలిగిందని నిర్ధారణకు వచ్చారు. సోమవారం రాత్రే రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్‌కు లేఖ రాశారు. తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వమని కోరారు.
మహిళా పోలీసులు ఏరీ?
బాధితురాలు జిల్లా కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అర్ధరాత్రి పోలీసు జీపులో తనను, భర్త, పిల్లలను పోలీస్ స్టేషన్‌కు తరలించారని వివరిస్తుండగా.. ఆ సమయంలో మహిళా పోలీసులు ఉన్నారా..? అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేరని శ్యామల సమాధానం ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్చానికి గురయ్యారు. సీపీకి రాసిన లేఖలోనూ పోలీసులు భార్యాభర్తలతోపాటు పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారని వివరించారు. మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళను రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఎలా ఉంచారని పేర్కొన్నారు.
మహిళా హక్కులకు భంగం కలగడంతోపాటు ఇది పిల్లలను మానసికంగా వేధించడమే అని భావించిన కలెక్టర్ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ,ఎస్టీ కమిషన్, పిల్లల సంక్షేమ బోర్డు, కరీంనగర్ జిల్లా పిల్లల సంక్షేమ కమిషన్‌లకు లేఖలు రాశారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోం శాఖ కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. ఈ లేఖలు అధికార వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. పోలీసుశాఖలో గుబులును రేకెత్తిస్తున్నాయి.
ఆ ఎస్‌ఐపై గతంలోనే ఇలాంటి ఫిర్యాదు..
కలెక్టర్ వర్షిణి రామగుండం సీపీకి రాసిన లేఖలో పెద్దపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌పై గతంలోనే ఇలాంటి ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. గోదావరిఖని చెందిన బి.గణేశ్ పెద్దపల్లిలో బస్టాండ్ సమీపంలో రోడ్డును దాటుతుండగా.. ఎస్‌ఐ అదుపులోకి తీసుకొని రాత్రంతా స్టేషన్‌లో ఉంచి, మరుసటి రోజు వదిలేశారని వివరించారు.
దీనిపై గణేశ్ తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై గతనెల 14తేదీన బాధితుడిని డీసీపీ వద్దకు పంపానని, దీనిపై ఏం చర్య తీసుకున్నారో, అసలు ఏం జరిగిందో ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, విచారణ అధికారిగా నియమించిన పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌లో ఉండడంతో గోదావరిఖని ఏసీపీ అపూర్వారావు మంగళవారం బాధితురాలి స్వగ్రామమైన పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.