bontu ram mohan
-
కంటికి రెప్ప ఎంత ముఖ్యమో...
మనిషి కంటికి రెప్ప ఎంత ముఖ్యమో ప్రతి ఇంటికి మొక్క అంత ముఖ్యమని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నారాయణగూడలోని కేశవమెమోరియల్ విద్యాసంస్థల్లో సోమవారం స్థానిక కార్పొరేటర్ జడల హేమలత సమక్షంలో హరితహారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విచ్చేసి మొక్కలు నాటారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ దేశం మనకు ఏం చేసిందనేది కాకుండా మనం దేశానికి ఏం చేశామన్నది ప్రాముఖ్యమన్నారు. అమెరికా, కెనడా దేశాల్లో ప్రతి విద్యార్థి 4వేల మొక్కలు నాటుతున్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మీరంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులను కోరారు. -
5కే రన్‌ను ప్రారంభించిన నగర మేయర్
స్వచ్ఛతలో దేశంలో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని మొదటి స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. స్వచ్ఛ సాగర్ పేరుతో నెక్లెస్‌రోడ్‌పై ఏర్పాటు చేసిన రన్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ రోజు 5కే, 10కే రన్ లు, సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ జండా ఊపి రన్‌ను ప్రారంభించగా.. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను స్వచ్ఛంగా పచ్చదనంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు. -
ఇంతకీ మేయర్ ఎవరో!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీని సాధిస్తున్న టీఆర్ఎస్.. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ముందుగా తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించినా, టీఆర్ఎస్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ప్రధానంగా మాత్రం చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. నగరం మొత్తం ఏదోలా తన పేరు వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, అక్కడి నుంచి టీఆర్ఎస్కు వచ్చిన సీనియర్ నాయకుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆమెకు కూడా సముచిత స్థానం ఇవ్వచ్చనే వాదన వినిపించింది. దీంతో ప్రధానంగా మేయర్ పదవి కోసం ఎక్కువ పోటీ బొంతు రామ్మోహన్, విజయలక్ష్మిల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. అయితే ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. మాదాపూర్ నుంచి ఆయన, హఫీజ్‌పేట నుంచి ఆయన భార్య పూజిత కార్పొరేటర్లుగా పోటీ చేశారు. తాము గెలిస్తే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మేయర్ అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా.. జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేసిన విక్రమ్‌గౌడే ఓడిపోయారు.