ఇంతకీ మేయర్ ఎవరో!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీని సాధిస్తున్న టీఆర్ఎస్.. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ముందుగా తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించినా, టీఆర్ఎస్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ప్రధానంగా మాత్రం చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. నగరం మొత్తం ఏదోలా తన పేరు వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, అక్కడి నుంచి టీఆర్ఎస్‌కు వచ్చిన సీనియర్ నాయకుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆమెకు కూడా సముచిత స్థానం ఇవ్వచ్చనే వాదన వినిపించింది. దీంతో ప్రధానంగా మేయర్ పదవి కోసం ఎక్కువ పోటీ బొంతు రామ్మోహన్, విజయలక్ష్మిల మధ్యే ఉంటుందని తెలుస్తోంది.
మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. అయితే ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. మాదాపూర్ నుంచి ఆయన, హఫీజ్‌పేట నుంచి ఆయన భార్య పూజిత కార్పొరేటర్లుగా పోటీ చేశారు.
తాము గెలిస్తే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మేయర్ అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా.. జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేసిన విక్రమ్‌గౌడే ఓడిపోయారు.