శివార్లలోనూ క్లీన్ స్వీప్!
జీహెచ్ఎంసీలో ఉన్న మొత్తం 150 డివిజన్లలో కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాలు కూడా అత్యంత కీలకంగా మారాయి. నిజానికి శివార్లలో.. అంటే, ఆంధ్రప్రాంత ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని, అక్కడ తాము పాగా వేసి తగినన్ని స్థానాలు సంపాదించుకోవచ్చని ఇటు టీడీపీ-బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా భావించింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను ఎంతోకొంత ఆదరిస్తారనే టీడీపీ నేతలు భావించారు. కానీ.. ఆ ప్రాంతాల ప్రజలు కూడా టీఆర్ఎస్‌నే ఆదరించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉండగా.. మొత్తం 11 చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట్, లింగోజిగూడ, గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపేట.. ఈ అన్ని డివిజన్లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీలతోనే గెలిచారు. మరో వైపు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని 10 డివిజన్లలోకూడా టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఈ ప్రాంతాల ప్రజలంతా గులాబి పార్టీకే పట్టం గట్టారు.