రేవంత్ రాజకీయ సన్యాసం చేస్తారా?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వంద సీట్లు వస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారన్న విషయం అంతటా ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ వంద మార్కు దాటితే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమే కాదు.. ఇక తెలంగాణ గడ్డపై ఎప్పుడూ అడుగు పెట్టబోనని కూడా రేవంత్ రెడ్డి అప్పట్లో ఓ ఎన్నికల సభలో గర్జించారు. టీఆర్ఎస్ మొత్తం వంద స్థానాలు గెలుచుకుని స్పష్టంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు హోదాలో ఉన్న ఆయన.. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టిగానే ప్రచారం చేశారు. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. టీడీపీ-బీజేపీ కూటమి కేవలం నాలుగైదు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. సైకిల్ పార్టీ సొంతంగా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. మిగిలిన మూడు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఇక టీఆర్ఎస్ సొంతంగా వంద స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో తాను చేసిన మంగమ్మ శపథాన్ని రేవంత్ రెడ్డి ఎంతవరకు నెరవేర్చుకుంటారనే విషయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.