అన్ని సేవలు ఒకే యాప్ తో..త్వరలో
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని మిగిల్చేందుకు రైల్వే శాఖ తన యాప్ ను సరికొత్తగా సిద్ధం చేస్తోంది. తన ప్రయాణీకుల అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు మొబైల్ అప్లికేషన్ ను పునరుద్ధరిస్తోంది. టికెట్ బుకింగ్ దగ్గర్నుంచి, భోజనం, క్యాబ్ లతో పాటు పోలీస్, వైద్యం లాంటి అత్యవసర సేవలను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం ఒక సమగ్ర (ఇంటిగ్రేడెట్) మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ ఫేర్ డైరెక్టరేట్ అధికారి ఒకరు తెలిపారు.
టాక్సీ, టికెట్ బుకింగ్ నుంచి మొదలు భోజనం ఆర్దరింగ్, పోర్టర్ సేవలు, రిటైర్ రూం లాడ్జింగ్, బెడ్ రోల్ ఆర్డర్, కోచ్ లో అపరిశుభ్రత పై ఫిర్యాదు, డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్, హోటల్ రిజర్వేషన్లు, వెయిటింగ్ లిస్ట్ రైలు టికెట్ విషయంలో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ తదితర ఇతర సేవలు ఈ యాప్ ద్వారా లభించనున్నాయని ఆయన తెలిపారు.
రైల్వేల కోసం ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఈ యాప్ ను ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే వైద్య సౌకర్యాలను, అత్యవసర విషయంలో పోలీసులకు ప్రయాణీకులు కనెక్ట్ అయ్యేలా మూడు దశల్లో ఈ అప్లికేషన్ విస్తరించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా సంవత్సరానికి సంస్థ డిజిటల్ ఆస్తుల విలువ రూ.500 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నామన్నారు. కాగా రైల్వేల మొత్తం ఆదాయంలో 5 శాతంగా ఉ న్న నాన్ ఫేర్ ఆదాయాన్ని 10 -20 శాతానికి పెంచే లక్ష్యంతో ఉన్నట్టు బడ్జెట్ ప్రసంగంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే.