మేరీ మమ్మీ
ఫస్ట్ పర్సన్
హిందీలో మేరీ అంటే ‘నా’.. మమ్మీ అంటే అమ్మ..
మేరీ మమ్మీ అంటే నా అమ్మ!
ప్రతి కొడుకుకి ఉండాల్సిన మమ్మీ మేరీ కోమ్!!
తన కొడుకులకు రాసుకున్న ఉత్తరం అనువాదమిది!
మన ఇళ్లల్లో కూడా ‘వాడికేం.. మగాడు’
అన్న మాట తరచూ వింటూంటాం..
అంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి మగపిల్లలకు
ఏం చేసినా చెల్లుతుంది అని చెప్తున్నారన్నమాట!
చెల్లదు .. అని చెప్తుంది మేరీ! ‘నో ’ అంటే ‘నో’!!
డియర్ సన్స్..
ఎందుకో ఈ రోజు మీకు ఈ ఉత్తరం రాయాలనిపించింది. మన దగ్గర అమ్మాయిలకు గౌరవం లేదు. అబ్బాయిలుగా మీకూ ఒక ముక్కు, రెండు కళ్లు, రెండు చెవులు, మెదడు ఉన్నట్టే అమ్మాయిలుగా మాకూ ఉంటాయి. శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే మీ నుంచి మమ్మల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రాన మేం సెకండ్ సిటిజన్స్ కాము కదా! మీలాగే మేమూ మెదడుతో ఆలోచిస్తాం... మనుసుతో ఫీలవుతాం! ఇలాంటి పెద్ద విషయాలను పదేళ్లయినా నిండని మీతో ఎందుకు చెప్తున్నానంటే.. కనీసం ఈ వయసు నుంచయినా అమ్మాయిలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారని.. అమ్మాయిల విషయంలో సున్నితంగా ప్రవర్తించడం అలవడుతుందని!
నాకూ తప్పలేదు..
మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు ఈవ్‌టీజింగ్‌కి, సెక్సువల్ అబ్యూజ్కి, లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. ఎవరో ఆడపిల్లల దాకా ఎందుకు కన్నలూ.. మీ అమ్మనైన నేనూ లైంగిక దాడికి గురయ్యాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు.. ఉదయం ఎనిమిదన్నరకు రిక్షాలో బాక్సింగ్ ట్రైనింగ్‌కి వెళ్తున్నా.. పక్కనుంచి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా నా మీదకు వంగి నా యెదను తడుతూ వెళ్లిపోయాడు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. కోపంతో రగిలిపోయాను. వెంటనే రిక్షాలోంచి దూకి, చెప్పుల్ని తీసి చేత్తో పట్టుకొని వాడిని వెంబడించాను. కాని వాడు తప్పించుకొని పారిపోయాడు. అరే వాడిని పట్టుకోలేకపోయానే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. వాడు దొరికి ఉంటే అప్పటికే నేను నేర్చుకున్న కరాటేను వాడి మీద ప్రాక్టిస్ చేసేదాన్ని. ఇంకోసారి.. ఢిల్లీ, హిస్సార్‌లో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది నాకు, నా ఫ్రెండ్స్‌కి. ట్రైనింగ్ క్యాంప్‌లో ఓ సాయంకాలం.. వాకింగ్ చేస్తుంటే!
ఎందుకు విషయం అవుతోంది?
ఆ సంఘటనల తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి.. మమ్మల్నే మాటలన్నారు. అమ్మాయిలను చూస్తే చాలు.. వాళ్ల వక్షస్థలాన్ని తాకాలని, పిరుదుల మీద తట్టాలని ఎందుకనుకుంటారు ఈ మగవాళ్లు? అమ్మాయిలున్నది అలాంటి వెకిలి ఆనందాలను పంచడానికి కాదు. అమ్మాయిలను బలవంతంగా తాకి అబ్బాయిలు పొందే సంతోషమేంటో నాకిప్పటికీ అర్థంకాదు! అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందంటే చాలు.. వాళ్లు వేసుకున్న బట్టలు ఎందుకు చర్చకొస్తాయి? వాళ్లు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లారనేది ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుంది? ఒరేయ్.. ఈ ప్రపంచం మీకెంత సొంతమో.. మాకూ అంతే కదా? మరి మాకెందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్? స్వేచ్ఛగా బయటకు వెళ్లడానికి అమ్మాయిలెందుకు వెనకాముందు ఆలోచించాలి?
మీకు అర్థం కావాలి..
మీరు పెరుగుతున్నారు. అందులోనూ అబ్బాయిలు.. అందుకే మీకు అర్థంకావాలని చెప్తున్నానురా.. రేప్, అబ్యూజ్, ఈవ్ టీజింగ్, సెక్సువల్ హెరాస్మెంట్.. ఇవన్నీ నేరాలే. వీటికి తీవ్రమైన శిక్షలుంటాయి.. ఉన్నాయి.. ఉండాలి కూడా! కన్నలూ.. ఎప్పుడైనా ఎవరైనా ఆడపిల్లలను ఏడిపించడం మీరు చూస్తే వెంటనే వెళ్లి ఆ అమ్మాయిలకు సాయం చేయండి.. ధైర్యం చెప్పండి.. వాళ్లకు అండగా నిలబడండి.. మీ అమ్మగా మీ నుంచి నేను కోరుతున్నదిదే! రెస్పెక్ట్ విమెన్! అత్యంత విషాదమేంటంటే.. ఈ సమాజంలో సమంగా గౌరవం పొందాల్సిన మేము నిర్లక్ష్యానికి గురికావడం! మన దేశ రాజధాని ఢిల్లీలో.. కొన్ని వందల మంది అమ్మాయిలు రేప్‌కి గురయ్యారు. గురవుతూనే ఉన్నారు. ఎవ్వరూ ఆ అన్యాయాలను ఆపట్లేదు సరికదా కనీసం ప్రశ్నించడం లేదు.
మీరు అలా కాదు..
మనిల్లు వేరు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమనే వాతావరణంలో మీరు పెరుగుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ మీ నాన్నే. ఆయన మీ ఫ్రెండ్స్ అందరి నాన్నల్లాగా నైన్ టు ఫైవ్ జాబ్ చేయరు. బాక్సర్‌గా నా ట్రైనింగ్, జాబ్, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా... ఇంటిపట్టునే ఉండడం నాకు కుదరదు. కాని మా ఇద్దరిలో ఎవరో ఒకరి అటెన్షన్ మీకు తప్పకుండా కావాలి. అందుకే ఆ బాధ్యతను మీ నాన్న తీసుకున్నారు. ఈ విషయంలో మీ నాన్నంటే నాకెంత గౌరవమో మాటల్లో చెప్పలేను. నా కోసం, మీ కోసం, ఈ ఇంటి కోసం ఆయన టైమ్‌ని, కెరీర్‌ని డెడికేట్ చేశారు. నా బలం మీ నాన్నే. ఆయన తోడులేందే నా ప్రయాణంలో ఒక్క అడుగూ ముందుకు సాగలేదు! అయితే త్వరలోనే మీరు బయటవాళ్ల నుంచి నాన్న మీద హౌజ్ హజ్బెండ్ అనే మాటలు వింటారు. ఒక్కటి గుర్తుంచుకోండి.. అలాంటి మాటలను అవమానంగా, అగౌరవంగా భావించాల్సిన పనిలేదు. ఇంటిని చూసుకునే బాధ్యత అమ్మకు మాత్రమే కాదు నాన్నకూ ఉంటుందని గ్రహించండి. రేపొద్దున మీరిలాంటి బాధ్యతను పంచుకోవాల్సి వస్తే నామోషీగా, అమర్యాదగా ఫీలవ్వకూడదు.
అది అవమానం.. అది హేళన..
మీరు నా పక్కనుంచి నడుస్తుంటే కొంతమంది మీ అమ్మను ‘చింకీ’ (చట్టి ముక్కు, చిన్న కళ్లున్న చైనీస్ అనే అర్థంలో) అంటూ కామెంట్ చేయడం వింటారు. ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన చాలామంది అమ్మాయిలు వాళ్ల రూపురేఖలు, వాళ్ల వస్త్రధారణతో చింకీస్గా టార్గెట్ అవుతున్నారు. అది అవమానం. అది హేళన. అది జాత్యాహంకారం. నేను భారతీయురాలినే. మిమ్మల్నీ భారతీయులుగానే పెంచుతున్నా! భారతీయులమైనందుకు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నా. తిరుబాటుదారులున్న రాష్ట్రానికి చెందినవాళ్లం. ఆ హింస నుంచి మిమ్మల్ని కాపాడుకుంటున్నా... రక్షించుకుంటున్నా. ఆ భయాలనుంచి బయటపడే ధైర్యాన్ని మీకు నూరిపోస్తున్నా. ఈ దేశ పౌరులుగా మిగిలిన అందరితో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కు మీకెలా ఉందో మహిళలకూ పురుషులతో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కుంది. మీరు ఈ దేశ భవిష్యత్ పౌరులు. ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. మహిళలను మీరు గౌరవిస్తేనే ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు నిలబడుతాయి.
అదే నిజమైతే..
నా దేశం నాకు ఎంతో పేరు, ప్రతిష్ఠలను ఇచ్చింది. కాని ఎమ్మెస్ ధోని, విరాట్ కొహ్లీలను గుర్తుపట్టినట్టుగా నన్ను గుర్తించరు. అలాగని ‘చింకీ’ అనే కామెంట్‌కీ నేను అర్హురాలిని కాదు కదా..! రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి నన్ను గౌరవించారు. చాలా సంతోషం. స్త్రీ సమస్యలను చర్చించే ఈ అవకాశాన్ని వదులుకోను. మహిళల మీద సాగుతున్న హింస గురించి పార్లమెంట్లో ప్రశ్నిస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అయితే సెక్సువల్ అబ్యూజ్, హెరాస్మెంట్స్ నేరాలే కావనే ముద్ర పడిపోయింది మనలో. అవి నేరాలే అనే విషయం మీకు చెప్పకపోతే.. వాటి గురించి మీకు అవగాహన పెంచకపోతే అమ్మగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే.. ఇవన్నీ చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నా..
శరీరాల మీద హక్కు కేవలం మగవాళ్లకే కాదు.. వాళ్ల శరీరాల మీద హక్కు స్త్రీలకూ ఉంటుంది. వాళ్లు ఒకసారి నో అని చెప్పారంటే ఆ ‘నో’ గౌరవించండి. బలవంతం చేసి వాళ్ల చావులను చూడకండి. రేప్ అనేది సెక్స్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ మిస్ప్లేస్డ్ సెన్స్ ఆఫ్ పవర్ అండ్ రివెంజ్! నన్ను ఇబ్బంది పెట్టినవాడిని చాచి ఒక్కటి ఇవ్వగలను. అది నా బాక్సింగ్ ప్రాక్టిస్నూ పెంచుతుంది. కాని కొట్టేదాకా తెచ్చుకోవడం ఎందుకని? కోరిక చాలా అందమైంది పరస్పర అంగీకారం, ఇష్టం ఉంటే! ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఇళ్లలో చాలా సార్లు వింటాం.. వాళ్లు మగ పిల్లలు.. మగ పిల్లలు మగపిల్లలే అని. అదే నిజం అయితే మగపిల్లలుగా ఈ దేశంలో అమ్మాయి భద్రంగా, గౌరవంగా మసిలే వాతావరణాన్ని కల్పించండి!
ఇట్లు మీ అమ్మ
మేరీ కోమ్