ఆసుపత్రికి చేర్చే దిక్కులేక మృత్యుఒడికి..
బ్రాహ్మణచెరువు (పెనుమంట్ర) : మోటారు సైకిల్‌తో చెట్టును ఢీకొన్న ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యువకుడ్ని ఎవరూ గమనించలేదు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ఆస్పత్రికి చేర్చే దిక్కులేకపోయింది. దీంతో యువకుడు మృత్యుఒడికి చేరాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్(30) గురువారం రాత్రి బ్రాహ్మణచెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును మోటారు సైకిల్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలపాలైన గణేష్‌ను ఎవరూ గమనించకపోవడంతో తెల్లవారేసరికి ఘటనస్థలంలో మృతి చెందాడు. అవివాహితుడైన గణేష్ ఇటీవలనే విదేశాల నుంచి ఇక్కడకు వచ్చాడని అతని బంధువులు తెలిపారు. పెనుమంట్ర ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.