లండన్‌లో హైదరాబాద్ యువతి హత్య
తుర్కయాంజాల్ (హైదరాబాద్)/లండన్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తుర్కయాంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి (27) హత్యకు గురైంది. ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఈ దారుణం జరిగింది. బ్రెజిల్ దేశానికి చెందిన యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాగా తేజస్విని స్నేహితురాలు జనగామకు చెందిన అఖిల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలి సింది. ఆమెకు ప్రాణాపాయం లేదని సమాచారం.
రాగానే పెళ్లి జరిపించాలనుకున్నారు..
బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవిల కుమార్తె తేజస్విని మూడేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లింది. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన శ్రీనివాస్‌రెడ్డి పిల్లలు ఇద్దరిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తేజస్వినిని లండన్‌కు, కుమారుడు పవన్‌కుమార్ రెడ్డిని ఆస్ట్రేలియా పంపించాడు. 2022 ఆగస్టులో ఒకసారి ఇంటికి వచ్చిన తేజస్విని సెప్టెంబర్‌లో తిరిగి లండన్ వెళ్లింది.
గత మే నెల చివరి వారంలోనే మరోసారి ఇండియాకు తిరిగిరావాల్సి ఉండగా మరో రెండు నెలలు ఉండి వస్తానని చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా తేజస్విని ప్రతిరోజూ మధ్యా హ్నం రెండు గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసేదని, మంగళవారం కూడా తల్లితో మాట్లాడినట్లు తెలిసింది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడుతున్న తేజస్వినికి ఇంటికి రాగానే పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు.
పెళ్లి సంబంధం కుదిరితే వెంటనే వస్తానని కూడా తేజ స్విని చెప్పింది. ఇంతలోనే హత్యకు గురైంది. ఇందుకు కారణాలపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం అందిన తేజ స్విని మరణవార్త తల్లిదండ్రులను షాక్‌కు గురిచేసింది. తల్లి రమాదేవి స్పృహతప్పి పడిపోగా, తండ్రి బోరు న విలపించాడు.
హత్య ఎప్పుడు జరిగిందో తెలియదని, ఆమె మీద దాడి జరిగిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తొలుత తమకు సమాచా రం అందిందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపాడు. సోదరి మృతి విషయం తెలుసుకున్న పవన్ కుమార్‌రెడ్డి ఆస్ట్రేలియా నుంచి నగరానికి బయలుదేరాడు.
పోలీసుల అదుపులో హంతకుడు!
యూకే మెట్రోపాలిటన్ పోలీసుల కథనం ప్రకారం.. లండన్ వెంబ్లీలోని నీల్డ్ క్రిసెంట్ నివాస సముదాయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించి హంతకుడిగా అనుమానిస్తున్న 23 ఏళ్ల కెవిన్ ఆంటోనియో లారెన్సో డి మొరాయిస్తో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకున్నా, తర్వాత యువతిని వదిలిపెట్టినట్లు వారు తెలిపారు.
హత్యకు గురైన యువతిని అధికారికంగా గుర్తించాల్సి ఉందని, పోస్టుమార్టమ్ నివేదిక తర్వాతే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న మరో యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలినట్లు తెలిపారు. తేజస్విని మరణ వార్తతో తుర్కయంజాల్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తేజస్విని తల్లిదండ్రులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరామర్శించారు.