ఈవెంట్
బోయి భీమన్న జయంతి సభ
కవిసంధ్య ఆధ్వర్యంలో నేడు యానాంలోని బి.ఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్నం 3:30కు బోయి భీమన్న జయంతి సభ జరగనుంది. దాట్ల దేవదానం రాజు, శిఖామణి, డి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, కె.విజయలక్ష్మి, ముమ్మిడి నాగప్రసాద్, మద్దాళి సత్యనారాయణ పాల్గొంటారు.
తెలుగు భాషా చైతన్యోద్యమం ఆవిష్కరణ
తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో- ఎ.రవీంద్రబాబు రచన ‘తెలుగు భాషా చైతన్యోద్యమం’ పుస్తకావిష్కరణ నేడు సాయంత్రం 5 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్లో జరగనుంది. జి.ఎస్.వరదాచారి, ఎస్.వి.సత్యనారాయణ, దేవులపల్లి ప్రభాకరరావు పాల్గొంటారు.
కవిత్వం అంటే ఏమిటి? ప్రసంగం
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో, ‘నెలా నెలా వెన్నెల’ కార్యక్రమంలో సెప్టెంబర్ 21న సాయంత్రం 6:30కు ‘కవిత్వం అంటే ఏమిటి?’ అంశంపై ద్వానా శాస్త్రి ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్ శర్మ, వంశీ రామరాజు, కళావేంకట దీక్షితులు, తెన్నేటి సుధాదేవి పాల్గొంటారు.
జాషువా పద్యానికి పట్టాభిషేకం
మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో- జాషువా 121వ జయంతి సందర్భంగా గుంటూరులో ‘జాషువా పద్యానికి పట్టాభిషేకం’ పేరుతో వారోత్సవాలు జరగనున్నాయని డొక్కా మాణిక్యవరప్రసాద రావు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 22న ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగిసే ఈ కార్యక్రమాల్లో- జాషువా సాహిత్యంపై చర్చ, ‘వంద గొంతులు ఒక్కటై జాషువా కోసం’ పుస్తకావిష్కరణ, ‘క్రీస్తు చరిత్ర’, ‘జాషువా సాహిత్యంలో స్త్రీమూర్తులు’, ‘జాషువా సాహిత్యంలో సామాజికత’ అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. కొలకలూరి ఇనాక్, కె.శ్రీనివాస్ సన్మానం అందుకుంటారు. కొణిజేటి రోశయ్య, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గజల్ శ్రీనివాస్ పాల్గొంటారు.
వాజ్పేయి కవిత్వానువాదం ఆవిష్కరణ
అటల్ బిహారీ వాజ్పేయి కవిత్వానికి జలజం సత్యనారాయణ అనుసృజన ‘శిఖరం’ ఆవిష్కరణ సెప్టెంబర్ 24న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్లో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. జూలూరి గౌరీశంకర్, మామిడి హరికృష్ణ, ఎం.వేదకుమార్, ఎస్.రఘు పాల్గొంటారు. నిర్వహణ: ధ్వని ప్రచురణలు.
ప్రాతినిధ్య కథ 2015 ఆవిష్కరణ
సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో- సామాన్య, ముసునూరు ప్రమీల సంపాదకులుగా తెస్తున్న ‘ప్రాతినిధ్య 2015’ ఆవిష్కరణ సెప్టెంబర్ 25న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, లక్డీకాపూల్లోని బెస్ట్ వెస్టర్న్ అశోకా హోటల్లో జరగనుంది. ఆవిష్కర్త: గౌతమ్ ఘోష్. బి.నరసింగరావ్, గీతాంజలి, గుర్రాల శ్రీనివాసులు, అస్లాం హసన్ పాల్గొంటారు.
దేశీయ పటాల ప్రదర్శన - కథాగానం
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని దళిత-ఆదివాసీ అధ్యయన అనువాద కేంద్రం నేతృత్వంలో, సెప్టెంబర్ 26-28 తేదీల్లో, యూనివర్సిటీలోని డి.ఎస్.టి. ఆడిటోరియంలో, ‘దేశీయ పటాల ప్రదర్శన- కథాగానం’ పేరుతో మూడు రోజుల జాతీయ సదస్సు జరగనుందని నిర్వాహకులు వి.కృష్ణ తెలియజేస్తున్నారు. ఇందులో 12 ఉపకులాల పటాల ప్రదర్శకులు తమ తమ ఉపకులాలకు సంబంధించిన పటాలు ప్రదర్శిస్తూ కథాగానం చేస్తారు.