అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై ప్రత్యేక కమిటీ
డిసెంబర్ 3 నుంచి చైనాలో పర్యటించనున్న బృంద సభ్యులు
సాక్షి, హైదరాబాద్: 125 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికిగాను ప్రత్యేకంగా అధ్యయన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్‌లతో పాటు ఆర్‌అండ్‌బీ సీఈ గణపతిరెడ్డి, జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి గుట్ట ఆర్డ్ డెరైక్టర్లు ఆనందసాయి, లక్ష్మి నారాయణలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది.
అతిపెద్ద బుద్ధుని విగ్రహంతోపాటు పలు విగ్రహాలను చైనాలో విజయవంతంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయా విగ్రహాల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై కమిటీ సభ్యులు అవగాహన పెంచుకోనున్నారు. ఖర్చును సైతం అంచనా వేయడంతో పాటు నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకు.. సర్దుబాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. డిసెంబర్ 3 నుంచి 11 వరకు పర్యటన సాగనుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలో యాదగిరిగుట్టలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యాదగిరిగుట్ట ఆర్ట్ డెరైక్టర్లను కమిటీలో సభ్యులుగా చేర్చింది. పర్యటన అనంతరం వారిచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.