bramostavalu
-
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్‌లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్‌పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి
-
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపిస్తున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించి శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేందుకు నగర నలు మూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మూడో రోజైన గురువారం స్వామి వారిని ఉదయం సింహవాహనంలో ఊరేగించగా భక్త జనసందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం సుప్రభాతం, తోమాల అర్చన అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. -
వైభవంగా నృసింహుడి ధ్వజారోహణం
మంగళగిరి: నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం ఉత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతలను వాయు వేగంతో వెళ్లి ఆహ్వానించేందుకు భక్తాగ్రేశ్వరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించడం ఉత్సవ ప్రత్యేకత. రాత్రి పొద్దుపోయాక భక్తజన కోటి సమక్షంలో ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో మరో ప్రత్యేకత ఉంది. అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దగా పిలుస్తారు. సంతానం లేని వారు ధ్వజారోహణ ఉత్సవంలో గరుడ ముద్దను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం. గరుడముద్ద ప్రసాదం కోసం మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవం అనంతరం ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టంపచేసి పురవీధులలో విహరింపచేశారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోషియన్ వారు వ్యవహరించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలె వెంకటసాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, రావుల శ్రీనివాసరావు, మోరంపూడి నాగేశ్వరరావు, ఆలేటి నాగలక్ష్మి, వెనిగళ్ళ ఉమాకాంతం, పంచుమరి ప్రసాద్, దీవి అనంతపద్మాచార్యులు పూజలు నిర్వహించగా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి మండెపూడి పానకాలరావు పర్యేక్షించారు.