యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
5 నుంచి శివరాత్రి ఉత్సవాలు, 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి, వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు.
పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు.
8న అఖండ జ్యోతి యాత్ర
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్‌పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment