సీఎం గారూ.. నిధులివ్వండి | - | Sakshi
Sakshi News home page

సీఎం గారూ.. నిధులివ్వండి

Published Mon, Mar 11 2024 5:15 AM | Last Updated on Mon, Mar 11 2024 9:09 AM

- - Sakshi

నిధుల లేమితో నిలిచిపోయిన యాదాద్రి అభివృద్ధి పనులు
వసతులు లేక భక్తుల ఇబ్బందులు
నిర్వాసితులకు అందని పరిహారం
నేడు బ్రహ్మోత్సవాలకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆశలు పెట్టుకున్న భక్తులు

సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు.

కొండపైన విశిష్టత కాపాడాలని..
భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్‌, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

వ్యాపారులకు నష్టం..
అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు కొనసాగుతున్నాయి.
శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఈఓ తదితరులు

ప్రారంభం కాని గెస్ట్‌ హౌస్‌లు..
టెంపుల్‌ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్‌ నిరుపయోగంగా ఉంది.

స్థానికులకు ఉపాధి దూరం..
ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది.

సగంలో నిలిచిన పనులు
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి.

ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్‌ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి.


– కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు

ఇవి చదవండి: సికింద్రాబాద్‌–విశాఖ మధ్య వందేభారత్‌–2

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement