‘ఇందిరమ్మ’ అవినీతిని నిర్భయంగా చెప్పాలి
ఖానాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలతోపాటు దళారీ వ్యవస్థను ఉపేక్షించేది లేదని సీబీసీఐడీ వరంగల్ జోన్ డీఎస్పీ బి.రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటి సర్వే అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, హౌసింగ్ అధికారుల సిబ్బందితో ఐదు టీంలుగా పర్యటించి 500 వరకు ఇళ్లపై విచారణ చేశామన్నారు.
ఇళ్లు నిర్మించకుండా బిల్లులు కాజేయడంతోపాటు పాత ఇళ్లపై బిల్లులు తీసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాజేశ్వర్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండానే బిల్లు కాజేయడంతోపాటు అదే ఇల్లును కొనుగోలు చేసిన వ్యక్తిపై కూడా పాత యజమానే బిల్లు కాజేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. ఓ మహిళా వర్క్ఇన్స్పెక్టర్ తాను విధులు నిర్వర్తించిన సమయంలో బొప్పారపు రాజేశ్వర్ అనే వ్యక్తి ఇల్లుపై శాంత అనే మహిళ పేరుపై బినామీ బ్యాంకు ఖాతా తెరిచి ఖాతాదారురాలికి రూ.2 వేలు చెల్లించి.. రూ.38 వేలు స్వాహా చేసినట్లు గుర్తించామన్నారు.
వీవో గ్రూపుల ద్వారా చెల్లించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.50 లక్షలకుపైగా భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు. ఇందులో రూ.25 లక్షలకుపైగా చెల్లింపులు జరిగినట్లు నిర్దారణకు వచ్చామని తెలిపారు. వీవో చెల్లింపుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంటి దొంగల వివరాలను 9440700920 నంబర్‌కు ఫోన్ చేసి ప్రజలు నిర్భయంగా తెలియజేయవచ్చని సూచించారు.