సమస్యలను నేరుగా చెప్పండి
ఆసియా గేమ్స్ విజేతలకు ప్రధాని మోదీ అల్పాహార విందు
న్యూఢిల్లీ: ఇటీవలి ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు మంగళవారం అరుదైన అనుభవాన్ని పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ వారందరినీ అల్పాహార విందుకు ఆహ్వానించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా వారిని సన్మానించడమే కాకుండా విజయాలను కొనియాడారు. దేశానికి రాజకీయవేత్తలు ఎలాగో క్రీడాకారులు కూడా అలాగేనని చెప్పారు. ‘2014 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లతో సంభాషించడం ఆనందాన్నిచ్చింది.
వారు నిజంగా భారత్ గర్వించదగ్గ ఆటగాళ్లు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ విందుకు కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ కూడా హాజరయ్యారు. మంగళ్యాన్ సక్సెస్ లాగే క్రీడాకారుల విజయాలు కూడా అంతటి గౌరవాన్ని పొందుతాయన్నారు. క్రీడాభివృద్ధికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా స్వేచ్ఛగా తనతో ఫోన్లో మాట్లాడవచ్చని ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కోసం సచిన్ టెండూల్కర్, మేరీ కోమ్ చూపించిన శ్రద్ధను ప్రధాని ప్రశంసించారు.
క్రీడాభివృద్ధికి వివిధ దేశాలతో ఒప్పందాలు
దేశంలోని క్రీడాకారులకు మరింత ఆధునిక రీతిలో శిక్షణనిప్పించేందుకు వివిధ దేశాలతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘ఓడిపోతామనే ఆలోచనతో ఏ క్రీడాకారుడు కూడా టోర్నీలకు వెళ్లడు. అయితే వారిలో నైపుణ్యాన్ని వెలికితీసే పరిస్థితులు, కనీస శిక్షణ సదుపాయాలు, మౌలిక వసతులు లేకపోవడంతో ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలు ఈ పరిస్థితులపై దృష్టి పెట్టాయి.
ప్రత్యేక స్పోర్ట్స్ యూనివర్సిటీలను నెలకొల్పాయి. హర్యానాలో ప్రజలు చాలా పటిష్టంగా, ధైర్యంగా ఉంటారు. వారు అలాంటి క్రీడలపైనే దృష్టి పెడితే ఫలితాలు వస్తాయి. అలాగే కేంద్రం కూడా వివిధ దేశాల క్రీడా నిపుణులతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది. ఆసీస్ ప్రధానితో ఇప్పటికే ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించాను’ అని ప్రధాని వివరించారు. దేశంలో క్రీడలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేందుకు ప్రభుత్వం రూ.450 కోట్లు నిధులు అదనంగా విడుదల చేసిందని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు.