breaks fail
-
చుక్ చుక్ రైలు.. 35 కి.మీ. వెనక్కి
నైనిటాల్ : ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్‌కి వెళుతున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ హఠాత్తుగా వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగకుండా 35 కి.మీ. వెనక్కి ప్రయాణించింది. చివరకు ఖాతిమా స్టేషన్లో ఆగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం బయల్దేరిన రైలు తానక్‌పూర్ చేరుతుందనగా రైల్వే ట్రాక్‌పైనున్న జంతువుని ఢీకొట్టింది. దీంతో రైలు నియంత్రణ కోల్పోవడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనక్కి మళ్లింది. డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే అవి ఫెయిల్ అయ్యాయి. రైల్వే బోగీల మధ్యనున్న ప్రెజర్ పైపులు లీక్ కావడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని భావిస్తున్నారు. తానక్‌పూర్ కొండల మధ్య ఉండడంతో రైలు వెనక్కి పరుగులు తీసిందని చెప్పారు. -
కరీంనగర్లో తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కరీంనగర్లో బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్డుపై బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి సిరిసిల్లకు బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రతిమ మల్టీప్లెక్స్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో బ్రేక్ ఫెయిల్ అయిందని గమనించిన డ్రైవర్ కలెక్టరేట్ రోడ్డు వైపు బస్సు తిప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. వేగంగా ఉన్న బస్సు డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. సిగ్నల్ వద్ద బస్సును స్లో చేసేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా బస్సు ఆగకపోవడంతో కలెక్టర్ వైపు తిప్పి డివైడర్‌ను ఢీ కొట్టినట్లు డ్రైవర్ తెలిపారు. కాగా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులు పాదచారులపై బస్సు దూసుకెళ్లి పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకొని బస్సును పరిశీలించి ఘటనపై విచారణకు ఆదేశించారు. మొత్తానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఘోర ప్రమాదం: వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ రాడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బ్రేక్స్ ఫెయిల్ కావడంతో హైవేపై ఎదురుగా నిలిపివున్న వాహానాలపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే ఓ వీడియోను అక్కడి మీడియాకు అధికారులు విడుదల చేశారు. స్ధానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ట్రక్కు బ్రేక్స్ ఫెయిల్ కావడంతో మొదట ఎదుటి వాహనాలను ఢీ కొట్టింది. ఆ తర్వాత ట్రక్కులోని రాడ్లు గాల్లొకి లేచి మిగిలిన వాహనదారులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ట్రక్కు పూర్తిగా ధ్వంసం అయింది. హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
బ్రేకులు ఫెయిల్, పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
- తప్పిన ప్రమాదం కోడుమూరు: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. త్రుటిలో ప్రమాదం తప్పిన ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. కర్నూలు- 2డిపోకు చెందిన బస్సు 25 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం బళ్లారి వైపు వెళుతోంది. కోడుమూరు పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు మళ్లించాడు. బస్సు పొలాల్లోకి దూసుకుపోయి ఆగింది. అయితే, బస్సు ఢీకొనటంతో ఒక ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఘటన అనంతరం ప్రయాణికులను ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. -
ఘాట్రోడ్లో బస్సు బ్రేకులు ఫెయిల్
డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు 48 మంది ప్రయాణికులు సురక్షితం చింతూరు, మారేడుమిల్లి : డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 48 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చింతూరు– మారేడుమిల్లి ఘాట్రోడ్లో శనివారం రాత్రి ఏడింటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం డిపోకు చెందిన బస్సు రాజమండ్రి నుంచి ఎగువసీలేరు వెళుతోంది. ఘాట్‌రోడ్‌లోని టైగర్ క్యాంపు సమీపంలోకి రాగానే ఆ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపే క్రమంలో కొండను తాకించాడు. దీంతో బస్సు అదుపు తప్పి 20 అడుగుల లోతులోగల వాగులో పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా బస్సు ముందుభాగం వాగులో తగిలి నిలిచిపోవడంతో తామంతా సురక్షితంగా బయట పడినట్టు ప్రయాణికులు తెలిపారు. మారేడుమిల్లి సీఐ అంకబాబు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
లారీ బ్రేకులు ఫెయిల్.. గరివిడిలో గందరగోళం
చీపురుపల్లి: వేగంగా వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిలవడంతో విజయనగరం జిల్లా గరివిడిలో గందరగోళం నెలకొంది. అనంతరం డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ట్రాన్స్‌పోర్టు లోడుతో రాజాం వెళ్తున్న సమయంలో స్థానిక సబ్‌స్టేషన్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ సమయస్పూర్తిని ప్రదర్శించి లారీని రోడ్డు పక్కన ఉన్న దిమ్మపైకి ఎక్కించాడు. దీంతో లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.