'నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నా'
'వన్ డైరెక్షన్ బ్యాండ్'.. ఈ పేరు మీరు ముందే విన్నారా.. ప్రపంచంలోని గొప్ప మ్యూజిక్ బ్యాండ్లలో ఇదీ ఒకటి. ఇందులోని సభ్యులంతా యువకులే. వీరు పాడితే అవతలివారు ఎగిరిగంతేయాల్సిందే. ఈ బృందంలోని హ్యారీ స్టైల్స్ అనే బ్యాండ్ బాబు.. ఓ పాఠశాల అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ ప్రేమ సందేశం పంపాడు. అయితే, ఇది స్వార్థంతోనో, మనసుపడో కాదు.. ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాలికకు ధైర్యం నింపేందుకు.
న్యూజెర్సీలోని ఓ హైస్కూల్లో బ్రియన్నా అనే బాలిక చదువుతోంది. ప్రస్తుతం ఆమె ల్యుకేమియాతో బాధపడుతోంది. బ్రియాన్నా హ్యారీ స్టైల్స్‌కు ఫ్యాన్. ఈ విషయం తెలుసుకున్న హ్యారీ కదిలిపోయి స్వయంగా ఓ వీడియోను తయారు చేసి ట్విట్టర్లో ఆ బాలికకు పంపాడు. అందులో చిరిగిన జీన్స్ వేసుకుని ఉన్న హ్యారీ ' హాయ్ బ్రియాన్నా, నిన్ను కలిసినందుకు చాలా సంతోషపడుతున్నాను. నువ్వు నాకు చిన్న ఫ్యాన్వని విన్నాను. కానీ నేను మాత్రం నీకు పెద్ద అభిమానిని. నీ గురించి నేను మొత్తం విన్నాను. నువ్వు చాలా ధైర్యమైన దానివని తెలుసుకున్నాను. నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నాను. నేను త్వరలోనే నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఉండు. ప్రేమతో.. ఐలవ్ యూ.. బై' అని వీడియో రికార్డు చేశాడు.