కూలి డబ్బులు అడిగినందుకు.. కార్మికులపై దాడి
సాక్షి, వరంగల్ : తమ కూలీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకు అనుచరులతో కలిసి యజమాని కార్మికులపై దాడి చేయించిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామంలో ఒడిశాకు చెందిన కొంతమంది కూలీలు ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తమ కూలీ డబ్బులు చెల్లించాలని యాజమాని శ్రీనివాస్‌ను కోరారు. దీంతో కోపోద్రుక్తుడైన యజమాని, తన అనుచరులతో కలిసి కార్మికులపై దాడికి తెగబడ్డాడు.
కాగా వెంటనే కార్మికులందరు మామూనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని యజమాని శ్రీనివాస్ నాయుడుపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు మండల తహశీల్దార్ కిరణ్ కుమార్, సీఐ సార్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన కార్మికుల వివరాలను సేకరించారు, అనంతరం యజమానిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.