మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక సీఎం దిష్టిబొమ్మ దహనం
మాగనూర్(మహబూబ్నగర్): కృష్ణా నది ఎగువన కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జికం బ్యారేజీ ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీఆర్ఎస్ నాయకులు మహబూబ్నగర్ జిల్లా మాగనూర్ మండలం హిందూపూర్ గ్రామ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మాణం’అనే కథనానికి స్పందించి టీఆర్ఎస్ ఈ ఆందోళనను చేపట్టింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కర్ణాటక జలచౌర్యాన్ని అడ్డుకోకపోవడంతోనే కృష్ణా నదిలో గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కర్ణాటక ఆగడాలను ఇక భరించలేమని, తక్షణమే కేంద్రం స్పందించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే మక్తల్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలు మూతపడుతాయని, వేలాది ఎకరాలు బీళ్లుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.