Britain Scientists
-
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి రెండో పొర నుంచి... రాళ్ల నమూనా!
బ్రిటన్ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయిన మ్యాంటల్ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు! భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే!! భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. అతి పెద్ద ముందడుగు భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తుండటం విశేషం. సేకరణ అంత ఈజీ కాదు...భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 2024 ఏప్రిల్ నుంచి జోయిడిస్ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్ లీసెన్‌బర్గ్ చెప్పారు. ‘‘ప్రవార శిలను పరిశీలించిన మీదట విలువైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలోని ఖనిజ మూలకాలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద సముద్ర జలంతో పలు రకాలుగా ప్రతి చర్య జరుపుతున్నట్టు తేలింది. ఫలితంగా సూక్ష్మజీవజాల ఉనికికి అతి కీలకమైన మీథేన్ వంటి నమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీలైనన్ని ఉష్ణోగ్రతల వద్ద వాటిని విశ్లేషించిన మీదట భూమిపై జీవావిర్భావం తాలూకు రహస్యాలెన్నో విడిపోయే అవకాశముంది’’ అని ఆయన వివరించారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుండెకు బ్యాండ్ ఎయిడ్
గుండెపోటుతో కండరాలకు జరిగిన నష్టాన్ని వేగంగా సరిచేసేందుకు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. ఏదైనా గాయమైతే మనం వాడే బ్యాండ్ ఎయిడ్ మాదిరిగానే.. మూలకణాలతో నిండిన పట్టీలను గుండెకు అతికిస్తే.. గుండెపోటు వల్ల పాడైన గుండె కణజాలానికి వేగంగా మరమ్మతులు చేయొచ్చని చెబుతున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం వల్ల అక్కడున్న కణజాలం నాశనమవుతుంది. ఫలితంగా గుండె సామర్థ్యం తగ్గుతుంది. తగు మోతాదులో రక్తాన్ని శుద్ధి చేయలేకపోతుంది. ఇది కాస్తా గుండె పనిచేయకుండా పోయేందుకు దారితీయొచ్చు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు ఈ వినూత్నమైన హార్ట్ప్యాచ్ను ఆవిష్కరించారు. 3 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు ఉండే ఈ హార్ట్ప్యాచ్లలో ఏకంగా 5 కోట్ల మూలకణాలు ఉంటాయి. ఒకసారి ఈ హార్ట్ప్యాచ్ను గుండెకు అతికిస్తే చాలు. కాలక్రమంలో ఈ మూలకణాలన్నీ గుండెకండరాలుగా మారిపో తాయి. సక్రమంగా కొట్టుకునేందుకు ఉపయోగపడతాయి. జరిగిన నష్టం ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ హార్ట్‌ప్యాచ్‌లను వాడొచ్చని రిచర్డ్ జబౌర్ తెలిపారు. హార్ట్ప్యాచ్లో ఉండే రసాయనాలు గుండె కణాలు తమంతట తాము మరమ్మతు చేసుకునేందుకు, పెరిగేందుకు సాయపడతాయని చెప్పారు. పరిశోధనశాలలో తాము ఈ హార్ట్‌ప్యాచ్‌లను ప్రయోగాత్మకంగా పరీక్షించామని.. మూడు రోజుల్లోనే ఇందులోని మూలకణాలు గుండెమాదిరిగానే కొట్టుకోవడం మొదలవుతుందని.. పూర్తిస్థాయిలో గుండె కణజాలంగా మారేందుకు నెల రోజుల సమయం పడుతుందని రిచర్డ్ వివరించారు. జంతువులపై తాము చేసిన ప్రయోగాల్లోనూ ఇవి సక్రమంగా పనిచేసినట్లు తెలిసిందన్నారు. ఇంకో రెండేళ్లలో మనుషులపై కూడా ఈ హార్ట్‌ప్యాచ్‌లను పరీక్షిస్తామని.. ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత వీటిని విస్తృతంగా వాడుతారని చెబుతున్నారు. మాంచెస్టర్‌లో జరుగుతున్న బ్రిటిష్ కార్డియో వాస్కులర్ సొసైటీ సదస్సులో ఈ హార్ట్ప్యాచ్కు సంబంధించిన వివరాలను ప్రకటించారు. -
సన్నగా ఉంటే.. దీర్ఘాయువు!
నిండు నూరేళ్లూ బతకాలనుకుంటున్నారా? అయితే బరువు పెరగకుండా చూసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండండి అంటున్నారు బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దాదాపు 6 లక్షల మంది జన్యు సమాచారంతో పాటు వారి తల్లిదండ్రుల ఆయుర్ ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ప్రొఫెసర్ జిమ్ విల్సన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకొచ్చింది. ప్రతి అదనపు కేజీ బరువుకు ఆయువు 2 నెలల వరకు తగ్గుతుందని.. అలాగే దీర్ఘాయువుకు సంబంధించిన జన్యువులకు జ్ఞాన సముపార్జనకు మధ్య సంబంధమున్నట్లు తమ పరిశోధనల ద్వారా స్పష్టమైందని జిమ్ చెబుతున్నారు. కొన్ని రకాల అలవాట్లకు జన్యువులు కారణమని ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో జిమ్ బృందం ఆయువును ఎక్కువగా ప్రభావితం చేయగల అలవాట్లను స్పష్టంగా గుర్తించగలిగింది. ధూమపానం, ఊపిరితిత్తుల కేన్సర్ లక్షణాలు ఆయువుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది. -
లాలాజల పరీక్షతోనూ ఆస్తమా నిర్ధారణ
లండన్: సాధారణంగా రోగి ఊపిరితిత్తుల పనితీరు ఆధారంగా ఆస్తమా వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి లాలాజలంపై పరీక్షలు జరిపి కూడా ఆస్తమాను నిర్ధారించవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘ఊపిరితిత్తులు, రక్తం, మూత్ర పరీక్షల సందర్భంగా రోగి కాస్తంత ఇబ్బంది పడతాడు. కొత్త పద్ధతి అన్ని వయసుల వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది’ అని బ్రిటన్‌లోని లంగ్బారో వర్సిటీ, సిటీ హాస్పిటల్ రెస్పిరేటరీ రీసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యవంతుల, రోగుల లాలాజలాలపై వేర్వేరుగా చేపట్టిన లిక్విడ్ క్రొమటోగ్రఫీ–మాస్ స్పెక్రోమెట్రీ పరీక్షల ఫలితాలను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఆస్తమాను నిర్ధారించగలిగారు. ఈ పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రత, అభివృద్ధిని అంచనావేయవచ్చు.