ఆంగ్లో కుకీ యుద్ధం(1917-1919).. ఆ రోజు ఏం జరిగిందంటే..
ఇంఫాల్: మణిపూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మెయిటీ వర్గానికి గిరిజనులుగా గుర్తింపు కల్పించడాన్ని కుకీలు ప్రశ్నించడంతో వివాదానికి బీజం పడింది. అదికాస్తా ఆధిపత్య పోరుగా మారి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసింది.
కొండ ప్రాంతాల్లో నివసించేవారు కుకీలు. పల్లపు ప్రాంతంలో నివసించేవారు మెయిటీలు. వీరిలో కుకీ తెగవారు ఒకసారి దేన్నైనా వ్యతిరేకించడం మొదలుపెడితే వెనకడుగు వేయరని చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు వారు బ్రిటిషర్లకు సైతం ఎదురు తిరిగి చేసిన యుద్ధమే అందుకు ఉదాహారణ.
ఆంగ్లో కుకీ యుద్ధం..
మొదటి ప్రపంచ యుద్ధంలో భారత దేశం పాల్గొనకపోయినా అలనాటి బ్రిటీష్ పాలన కారణంగా వారి ప్రోద్బలంతో కొంత మంది భారత సైనికులు వారికి సహాకారమందించారు. ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం మణిపూర్ మహారాజును పోరాటయోధులు కానీ కొంతమందిని ఇండియన్ లేబర్ కార్ప్స్(ILC)గా ఎంపిక చేసి తమ సైన్యానికి సహకారమందించాలని కోరారు. తదనంతరం ILCలను భారత సైన్యానికి సమానమైన కేడర్ గా పరిగణించారు.
అయితే మహారాజు పిలుపు మేరకు లోయ ప్రాంతంలోని వారు ILCలో చేరారు. వీరు యుద్ధం చేయలేదు కానీ యుద్ధం చేసే సైనికులకు సేవలు చేసేవారు. ఈ బానిస బ్రతుకుకు వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే కుకీలు 1917లో బ్రిటీషర్లలకు ఎదురు తిరిగారు. ఈ తిరుగుబాటు కాస్తా యుద్ధంగా మారి సుమారు రెండేళ్లపాటు 1919 వరకు కొనసాగింది. ఈ రెండేళ్లలో కుకీలు బ్రిటీషర్లకు ఎదురుపడి పోరాడిన సందర్భాలూ ఉన్నాయి, గెరిల్లా తరహా చేసిన దాడులు కూడా ఉన్నాయి.
కొండ ప్రాంతాలపైనా, అటవీ ప్రదేశాలపైనా విపరీతమైన అవగాహన ఉండటంతో అరకొర ఆయుధ సామాగ్రి మాత్రమే ఉన్నా కూడా కుకీలు పటిష్టమైన బ్రిటీషర్లను సమర్ధవంతంగానే ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో తిరుగుబాటుదారుల ధాటికి బ్రిటీషు ప్రభుత్వం కుకీలు ఉండే మణిపూర్ గిరిజన ప్రాంతాన్ని "కల్లోల ప్రాంతం"గా కూడా ప్రకటించింది.
దీర్ఘకాలికంగా సాగిన యుద్ధంలో మెల్లిగా కుకీ తిరుగుబాటుదారుల జనాభా తరుగుతూ వచ్చింది. ఈ యుద్ధంలో అత్యధికులు మరణించగా కుకీలకు నాయకులుగా వ్యవహరించిన వారిని మాత్రం అరెస్టు చేసిన వలసపాలకులు వారిని అండమాన్ జైలుకు తరలించారు. కేవలం ILCలో చేరమన్నందుకే కుకీలు బ్రిటీషర్లకు ఎదురు తిరగలేదు. బ్రిటీషర్లు గిరిజనులను క్రైస్తవ్యం వైపుగా నడిపిస్తారేమోనన్న భయం ఒక కారణమైతే, గిరిజనులపై వారి వివక్ష రెండోది. ఈ కారణాలతోనే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్న తపనతో కుకీలు బ్రిటీషర్లపై యద్ధానికి సిద్ధమయ్యారు.
ఇది కూడా చదవండి: చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం