bsf forces
-
జమ్మూకశ్మీర్: బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రత సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా- శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్ముకశ్మీర్ పరిధిలోని బారాముల్లాలో బిఎస్ఎఫ్ భద్రత దళాలపై.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాగా, ఉగ్రవాదులు.. గ్రనైడ్లు, రాకేట్ లాంచర్లతో దాడిచేశారు. దీన్ని భద్రత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాదిని భద్రత సిబ్బంది హతమార్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న(గురువారం) అర్ధరాత్రి భద్రత సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు కాల్పులలో మరణించిన ఉగ్రవాది.. పాకిస్థాన్ కు చెందిన ఉస్మాన్‌గా అధికారులు తెలిపారు. బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఎకె-47 రైఫిల్స్, గ్రనైడ్లు, రాకెట్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రత సిబ్బంది ప్రకటించారు. కాగా, వరుస ఉగ్రదాడులతో ప్రస్తుతం బారాముల్లాలో అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు. -
పంజాబ్‌లో పాక్ డ్రోన్ కూల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఖేమ్ కరన్ సెక్టార్లో కనిపించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ కదలికలతో సరిహద్దు గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ సరిహద్దులోని రటోక్ గ్రామంలో పాక్ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో కూల్చివేశారు. కాగా ఈ డ్రోన్ పాక్ సరిహద్దుల్లో కూలిందా లేక భారత భూభాగంలో పడిపోయిందా అనే వివరాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, భారత జవాన్లు డ్రోన్‌పై కాల్పులకు దిగిన ఘటనను తాను చూశానని రటోక్ సర్పంచ్ లక్బీర్ సింగ్ చెప్పారు. మరోవైపు పంజాబ్ బోర్డర్లోకి సోమవారం తెల్లవారుజామున చొచ్చుకువచ్చిన నాలుగు పాకిస్తాన్ ఎఫ్-16లను వాయుసేన సుఖోయ్-30, మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో తరిమికొట్టాయి. పాక్ యుద్ధ విమానాలు నిఘా డ్రోన్లతో భారత్‌లోకి చొచ్చుకురావడంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత బలగాల మోహరింపును గుర్తించేందుకే వచ్చాయని భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. -
పాక్ డ్రోన్ పరార్
జైపూర్: పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ మిలటరీకి చెందిన డ్రోన్ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజస్తాన్‌లోని హిందుమాల్‌కోట్‌లోకి పాక్ డ్రోన్ రావడంతో బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్ వెనక్కు మళ్లింది. కాగా, నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం పదింటికి అఖ్నూర్ సెక్టార్లో నంద్వాల్‌చౌక్ వద్ద రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ను సైన్యం గుర్తించింది. వెంటనే ఆప్రాంతంలోని వారిని ఖాళీచేయించి ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అలాంటివి ఇంకా ఏమైనా అమర్చారా అనే అనుమానంతో బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు అమర్చిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. -
తీర్పుకు భద్రత ‘స్ట్రాంగ్’
సాక్షి, వనపర్తి క్రైం: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగియడంతో అధికా రులు ఊపిరిపీల్చుకున్నారు. వనపర్తి అసెంబ్లీ ని యోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను వనపర్తి మండలం చిట్యాల గోదాంలోని స్ట్రాంగ్ రూం లకు తరలించారు. వనపర్తి పట్టణం, వనపర్తి మండలం, పెబ్బేరు, గోపాల్పేట, శ్రీరంగాపురం, రేవల్లి, పెద్దమందడి, ఘనపురం మండలాల ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. గోదాం చుట్టూ పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అంతకుముందు పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఆయా కేంద్రాల నుంచి ఈవీఎంలను ఇక్కడి తరలించింది. కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షణ, కలెక్టర్ శ్వేతామహంతి ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 80.83శాతం ఈ సారి పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం ఈవీంలను ప్రత్యేక వాహనాల్లో కేంద్ర బలగాల భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలకు చేర్చారు. సెంట్రల్ ఫోర్స్ బలగాలు, ఇన్చార్జ్ పోలీసులతో ఈవీఎంల భద్రతను కట్టుదిట్టం చేశారు. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల ఈవీఎంలను ఇక్కడే భద్రత పరిచారు. 11న ఓట్ల లెక్కింపు ఈనెల11న ఓట్ల లెక్కింపు జరగనుంది. నియోజకవర్గంలోని ఆయా పొలింగ్ బూత్‌ల ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల భవిష్యత్ తేలనుంది. 200 మంది సివిల్ పోలీసులు, 100 మంది హోంగార్డులు, 45 మంది కేంద్ర బలగాల భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎవరు గెలుస్తారోననే ఉఠ్కంత ఇప్పటినుంచే మొదలైంది. భద్రత మరింత పెంచుతాం చిట్యాల గోదాంలో ఈవీఎంలకు పటిష్ట భద్రత కల్పించాం. కేంద్ర పోలీసు బలగాలు గోదాం చుట్టూ పహారా కాస్తున్నాయి. ఈనెల11న జరిగే ఓట్ల లెక్కింపు రోజున మరింత భద్రత పెంచుతాం. – భాస్కర్, ఏఎస్పీ, వనపర్తి -
‘సైన్యాన్ని వీడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 2017లో స్వచ్ఛంద పదవీవిరమణ, రాజీనామాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల్లో ఎక్కువ మంది సిబ్బంది వైదొలిగారని పేర్కొంది. 2015లో 909 మంది బీఎస్ఎఫ్ నుంచి నిష్ర్కమించగా, 2017లో ఈ సంఖ్య ఏడు రెట్లు అధికంగా 6415కు పెరిగిందని తెలిపింది. సీఆర్పీఎఫ్లో 2015లో 1376 మంది వైదొలగా, 2017లో అత్యధికంగా 5123 మంది వైదొలిగారని వెల్లడించింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమా బల్లోనూ ఇదే ధోరణి కనిపించిందని పేర్కొంది. ఇక అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలోనూ పెద్దసంఖ్యలో సిబ్బంది వైదొలిగారని తెలిపింది. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాలతో పాటు 20 ఏళ్ల సర్వీస్ అనంతరం పెన్షన్ ప్రయోజనాలు పెరగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో స్వచ్ఛంద పదవీవిరమణ లేదా రాజీనామా చేయడానికి మొగ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
‘ఉగ్రవాదమే పాక్ విధానం’
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చివేసిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఉగ్రమూకలకు నిధులు, శిక్షణను అందించి భారత్‌పైకి ఉసిగొల్పుతోందని వ్యాఖ్యానించారు. మతంతో ఉగ్రవాదాన్ని ముడిపెడుతున్న ఆ దేశం ప్రజల్లో చీలికలు తెస్తోందని అన్నారు. ఏ మతం నుంచీ ఉగ్రవాదిని చూడాలని భారత్ కోరుకోదని, ఉగ్రవాదం మానవాళికి శత్రువని బీఎస్ఎఫ్ 52వ రైజింగ్ డే సందర్భంగా భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడారు. పొరుగుదేశంతో సఖ్యతగా మెలిగేందుకు ప్రభుత్వం చొరవ చూపుతున్నా మన భూభాగంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పాక్, బంగ్లా సరిహద్దుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని బీఎస్ఎఫ్ దళాలను వెంకయ్యనాయుడు ప్రశంసించారు. భారత్ అందరితో మెరుగైన సంబంధాలను కాంక్షిస్తూ వసుధైక కుటుంబాన్ని కోరుకుంటుందని చెప్పారు. -
వెనక్కి తగ్గిన పాక్.. ఆగుతున్న కాల్పులు!
అంతర్జాతీయంగా విపరీతమైన ఒత్తిడి వస్తుండటంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గుతోంది. జమ్ము కాశ్మీర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో గత వారం రోజులుగా విపరీతంగా కాల్పులు, బాంబుదాడులకు పాల్పడుతూ పౌర ఆవాస ప్రాంతాల్లో కూడా భయాందోళనలు కలిగిస్తున్న పాకిస్థాన్ విషయంలో భారత్ సహా అన్ని దేశాలు విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి. దీంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ జాతీయ భద్రతా మండలితో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి, తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల వైపు నుంచి కాల్పులు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ దళాలు అంతలా తిరగబడతాయని కూడా పాక్ దళాలు ఊహించలేదు. వాస్తవానికి పాక్ బలగాలకంటే రెట్టింపు సంఖ్యలో సరిహద్దుల్లో భారత సైన్యం ఉంది. తొలుత కొంత ఊరుకున్నా.. ప్రధాని వైపు నుంచి దీటుగా స్పందించాలన్న సంకేతాలు రావడంతో భారీగా విరుచుకుపడ్డారు. ఈ కాల్పులకు భారతదేశమే కారణమని, తాము ముందు కాల్పులు ప్రారంభించలేదని పాక్ చేస్తున్న వాదనలను భారత రక్షణ వర్గాలు తిప్పికొట్టాయి. మరోవైపు ఇరువైపులా పౌరులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక కాల్పులను ఇప్పటికిప్పుడే ఆపేందుకు శుక్రవారం నాటి సమావేశంలో పాక్ ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.