రాజ్ నాథ్‌ను నిలదీసిన యువతి
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఓ యువతి నిలదీసింది. భోరుమని ఏడుస్తూ పలుమార్లు ప్రశ్నించింది. ఎప్పుడు తామే ఏడుస్తూ ఉండాలా? తమకే ఎందుకు ఈ పరిస్థితి అంటూ విలపించింది. ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ చిన్న విమానం కూలిపోయి ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులతో సహా పదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం వారి అంత్యక్రియలు సందర్భంగా సఫ్దార్ జంగ్ విమానాశ్రయానికి వచ్చి చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చనిపోయినవారిలో కో పైలెట్ శివరెయిన్ కుటుంబానికి చెందిన ఓ యువతి నేరుగా రాజ్ నాథ్పైకి ప్రశ్నలు సంధించింది.
'సర్, ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి? చెప్పండి సర్ ఇలా ఎందుకు? వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు? సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నిన్న కూలిపోయిన విమానం చాలా పాతది. అలా ఇవ్వడం సరికాదు. మీరు సమాధానం చెప్పాలి. నాకు సమాధానం కావాలి' అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ ప్రశ్నించింది.
ఈలోగా ఆమెను అక్కడ ఉన్న కొందరు వెనక్కి లాగారు. అనంతరం చనిపోయిన కో పైలెట్ భార్య మాట్లాడుతూ బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని తన భర్త చెప్పేవారని, ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నామని చెప్పారని అన్నారు. అందుకే గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని చెప్పారు. ఈ విమానం పాతది అవడం వల్లే సమస్య తలెత్తి అది కూలిపోయినట్లు తాను రాజ్ నాథ్ సింగ్ కు చెప్పినట్లు కోపైలెట్ రాజెష్ శివరాన్ మామ ఈ సందర్భంగా పేర్కొన్నారు.