BSNL Bhavan
-
బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన రాష్ట్ర కార్యాలయాల్లో నిన్న (శుక్రవారం) ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఇందుకు భారీ ఎత్తున ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఇలా వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారి విధుల నిర్వహణకు జనవరి 31 చివరి రోజు. దీంతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో శుక్రవారం ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్నవారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. సంస్థ పరిస్థితి దయనీయంగా మారడం...కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో చాలామంది ఉద్యోగులు వీఆర్ఎస్కు ముందుకొచ్చి అప్లయ్ చేసుకున్నారు. ఏపీలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంఖ్య 8,878మంది ఉండగా, వీరిలో 5,031మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. దీంతో సంస్థలో 3,847మంది ఉద్యోగులు మాత్రమే మిగిలినట్లు అయింది. అర్హత ఉన్నా 1,361మంది వీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. ఉద్యోగం...ఉద్వేగభరితం.. ఎన్నో ఏళ్లుగా తమ మధ్య విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగిని స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తుండటం.. తోటి ఉద్యోగులను భావోద్వేగానికి గురి చేసింది. ఆమెకు వీడ్కోలు పలకడం వారికి భారంగా మారింది. ఎస్డీఈ (పీఆర్)గా పని చేసిన పద్మా శర్మ స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగి డీఎస్ నరేంద్ర..ఆమెతో చివరిసారి కరచాలనం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం శుక్రవారం హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ సాక్షి, హైదరాబాద్ : ఇక నగరంలోని టెలికం ఉద్యోగుల్లో సుమారు 77% మంది వీఆర్ఎస్ తీసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో మొత్తం 3,500 మంది ఉద్యోగులకు గాను అందులో 2,613 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది డీజీఎంలు, 80 ఎజీఎంలు, 100 మంది ఎస్‌డీవోలు, 80 మంది జేటీవోలు ఉన్నారు. మిగతా వారిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారున్నారు.హైదరాబాద్ సర్కిల్ సీజీఎం పరిధిలోకి వచ్చే మరో 284 మంది ఉద్యోగులు సైతం వీఆర్ఎస్ తీసుకున్నారు. దీంతో ఆదర్శనగర్‌లో గల టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) కార్యాలయమైన బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ అయింది. ఉన్నతాధికారుల నుంచి నాల్గోవ తరగతి సిబ్బంది వరకు పదవీ విరమణ చేయడంతో పలు సెక్షన్లు బోసిపోయాయి. -
ఇంటర్నెట్ సేవలు విసర్తణ
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలు విస్తరించడంతో పాటు ల్యాండ్‌లైన్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ పీజీఎం కె.దామోదర్ రావు వెల్లడించారు. బుధవారం ఆదర్శ నగర్ లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలన్నిం టీకి ఇంటర్నెట్ బ్రాడ్ బాండ్ వినియోగించుకునే విధంగా విస్తరణ చర్యలు చేపట్టామని చెప్పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, బిర్లామందిరం, చార్మినార్, తారామతి బారాదరి తదితర జనసమ్మర్ధం గల పర్యాటక ప్రాంతాల్లో వై ఫై సేవలను ప్రారంభించామని చెప్పారు. తొలి 20 నిమిషాలపాటు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించి నట్లు చెప్పారు. నగరంలో మరి కొన్ని వైఫై హాట్స్పాట్లను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ లైన్ల నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడుగంటల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం ఇప్పటికే అమల్లో కి తెచ్చినట్లు చెప్పారు.హైదరాబాద్ టెలికం పరిధిలో సుమారు నాలుగు లక్షల ల్యాండ్ లైన్లు, లక్ష బ్రాడ్ బాండ్లు కనెక్షన్లు, 9.5 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. జాతీయ వ్యాప్తంగా రోమింగ్ ఇన్కమింగ్ చార్జీలను మినహాయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సెకనుకు ఒక్క పైసా చార్జీపై కొత్తగా అమూల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్/ఎస్టీడీల కాల్ఛార్జి సెకనుకు ఒక పైసాగా, రాత్రి 9 నుంచి ఉదయం ఏడు వరకు నిమిషానికి 20 పైసలుగా, రూ.200పైబడిన విలువల కలిగిన టాప్అప్ ఓచర్లకు ఫుల్ టాక్‌టైం వెసులుబాటు ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో జీఎం హెచ్ఆర్ సీతారామారాజు, జీఏం(సీఎం) ఎన్ సత్యనారాయణ, సీఎం(ఎన్ఏస్) ఎన్ రాజశేఖర్, జీఎం(ఎస్‌డబ్ల్యు) రాజహంస, డీజీఎడీ జీఎం వెంకటేశ్, ఏజీఎం అలివేలు తదితరులు పాల్గొన్నారు.