ఇంటర్నెట్ సేవలు విసర్తణ
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలు విస్తరించడంతో పాటు ల్యాండ్‌లైన్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం కె.దామోదర్ రావు వెల్లడించారు. బుధవారం ఆదర్శ నగర్ లోని బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలన్నిం టీకి ఇంటర్నెట్ బ్రాడ్ బాండ్ వినియోగించుకునే విధంగా విస్తరణ చర్యలు చేపట్టామని చెప్పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, బిర్లామందిరం, చార్మినార్, తారామతి బారాదరి తదితర జనసమ్మర్ధం గల పర్యాటక ప్రాంతాల్లో వై ఫై సేవలను ప్రారంభించామని చెప్పారు.
తొలి 20 నిమిషాలపాటు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించి నట్లు చెప్పారు. నగరంలో మరి కొన్ని వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ లైన్ల నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడుగంటల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం ఇప్పటికే అమల్లో కి తెచ్చినట్లు చెప్పారు.హైదరాబాద్ టెలికం పరిధిలో సుమారు నాలుగు లక్షల ల్యాండ్ లైన్లు, లక్ష బ్రాడ్ బాండ్లు కనెక్షన్లు, 9.5 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు.
జాతీయ వ్యాప్తంగా రోమింగ్ ఇన్‌కమింగ్ చార్జీలను మినహాయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సెకనుకు ఒక్క పైసా చార్జీపై కొత్తగా అమూల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్/ఎస్టీడీల కాల్‌ఛార్జి సెకనుకు ఒక పైసాగా, రాత్రి 9 నుంచి ఉదయం ఏడు వరకు నిమిషానికి 20 పైసలుగా, రూ.200పైబడిన విలువల కలిగిన టాప్‌అప్ ఓచర్లకు ఫుల్ టాక్‌టైం వెసులుబాటు ఉంటుందన్నారు.
విలేకరుల సమావేశంలో జీఎం హెచ్‌ఆర్ సీతారామారాజు, జీఏం(సీఎం) ఎన్ సత్యనారాయణ, సీఎం(ఎన్‌ఏస్) ఎన్ రాజశేఖర్, జీఎం(ఎస్‌డబ్ల్యు) రాజహంస, డీజీఎడీ జీఎం వెంకటేశ్, ఏజీఎం అలివేలు తదితరులు పాల్గొన్నారు.