buety skin
-
Beauty Tips: హార్మోన్ల అల్లరిది గిల్లకండి!
యువతుల లుక్స్‌ను ప్రభావితం చేసి వారిని బాధపెట్టేవాటిల్లో మొటిమలు ముఖ్యమైనవి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వారు బాల్యం వీడి కౌమారంలోకి వచ్చే దశలో ఈ మొటిమలు మొదలవుతుంటాయి. ఆ టైమ్‌లో దేహంలో కొన్ని రకాల కొత్త హార్మోన్ల ఉత్పత్తి మొదలవడం, ఆ టైమ్‌లో చర్మం మీద ఉండే గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనెవంటి పదార్థం స్రవిస్తుంటుంది. ఆ నూనె వంటి పదార్థం గ్రంథుల చివర్లలో పేరుకుపోవడం వల్ల మృతిచెందిన కణాలను బయటకు రాకుండా ఆపడం... దాంతో నూనె గ్రంథి మూసుకుపోవడం వల్ల మొటిమ వస్తుంది. దీన్ని గిల్లినప్పుడు సీబమ్ బయటకు వచ్చేసి, అక్కడ చిన్న గుంట మిగిలిపోతుంది. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలను అమితంగా బాధించే ఈ మొటిమలూ... అవి వచ్చేందుకు కారణాలూ, వాటి నివారణా, చికిత్స వంటి అనేక విషయాలను తెలిపే కథనమిది.సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపిస్తాయని అనుకుంటారు. గానీ అవి ముఖం మీద చెంపలూ, ముక్కు అలాగే భుజాలు, వీపు ఇలా అనేక భాగాల్లో వస్తుంటాయి. మొటిమలు... లక్షణాలు:మొటిమల్లో ప్రధానంగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయి. అవి... గ్రేడ్ – 1 : (కొమెడోజెనిక్) : ఈ తరహా మొటిమను వైట్ హెడ్ లేదా బ్లీచ్ హెడ్ అని పిలుస్తారు. దీని బయటి చివరి భాగం మూసుకుపోవడం వల్ల అక్కడ ఇది తెల్లరంగులో గడ్డగట్టుకుపోయిన చిన్న బంతి ఆకృతిలో కనిపిస్తుంది. బాల్‌పాయింట్ పెన్ చివరి టిప్ సైజ్‌లో ఈ వైట్‌హెడ్ ఉంటుంది. ఒకవేళ మూతి చివరి చర్మకణాలు చనిపోయి నల్లగా మారిపోతే దాన్ని బ్లాక్హెడ్గా అభివర్ణిస్తారు. గ్రేడ్ – 2 : (పాపులర్ ఆక్నే) : ఈ దశలో మొటిమలో కొద్దిపాటి వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కనిపిస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ కనిపించే దశను పాపులర్ ఆక్నే అంటారు. ఈ దశలో ఇది చిన్నగా ఎర్రగా మరి ఉబ్బినట్లుగా బయటికి తన్నుకొని వచ్చి కనిపిస్తుంది. గ్రేడ్ – 3 : (పుస్టులార్ ఆక్నే): ఈ దశలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ. పైగా ఈ దశలో ్రపాపియోనిక్ బ్యాక్టీరియా అనే ఒక తరహా బ్యాక్టీరియా ఆ మొటిమకు తోడవుతుంది. ఈ దశలో మొటిమలో ఇన్ఫ్లమేషన్కు తోడు చీము చేరుతుంది. దాంతో ఎర్రగా ఉబ్బుకుని వచ్చిన భాగం మీద తెల్లటి చీము కనిపిస్తూ ఉంటుంది. గ్రేడ్ – 4 : (సిస్టిక్ ఆక్నే) : ఒకవేళ పైన పేర్కొన్న పుస్టులార్ ఆక్నే మరింత తీవ్రమైనప్పుడు అది చిన్న నాడ్యూల్‌గా (నీటి తిత్తిగా) మారిపోయి, బయటకు తన్నుకు వచ్చినట్లగా కనిపిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్తో పాటు, చీము, నొప్పి, నీటిగుల్ల... ఇవన్నీ కలిపి ఉన్నందున మొటిమ తీవ్రంగా మారుతుంది. కొన్ని మొటిమల్లో మొదటి గ్రేడ్ నుంచి నాలుగో గ్రేడ్ వరకూ ఒకే మొటిమలోనే అన్ని దశలూ కనిపించవచ్చు. ఈ తరహా మొటిమలు ముఖం, ఛాతీ, భుజాలు, వీపు... ఇలా అన్ని భాగాల్లో రావచ్చు.కారణాలు : 1. బాలలు ఒక్కసారిగా యౌవన (కౌమార) దశలోకి ప్రవేశిస్తుంటారు. దీన్నే ప్యూబర్టీ స్పర్ట్గా పేర్కొంటారు. టీనేజీ యువతుల్లో అనేక రకాల హార్మోన్లు స్రవిస్తుండటం, వాటి మధ్య సమతౌల్యత లోపించడం మొదలైతే మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘పాలీసిస్టిక్ ఒవేరియస్ డిజార్డర్’ లేదా పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో ముఖాలపై మొటిమలు చాలా ఎక్కువ. 2. ఆహారం : చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే (హై గ్లూకోజ్) ఆహారాన్ని తీసుకునే వారిలో మొటిమల సమస్య చాలా ఎక్కువ. పాల ఉత్పాదనలతో కూడిన స్వీట్లు, చాక్లెట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాల్ని ఎక్కువగా తీసుకునేవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ తరహా ఆహారాన్ని తగ్గించగానే మొటిమలూ తగ్గుముఖం పడతాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరగకపోవచ్చు. మొటిమలకూ, ఇన్సులిన్ మెటబాలిజమ్ (ఇన్సులిన్ జీవక్రియల తీరు), స్థూలకాయానికీ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. 3. జన్యుసంబంధమైన కారణాలు : కొందరిలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కేవలం జన్యుసంబంధమైన కారణాలతోనూ మొటిమలు రావచ్చు. 4. ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 5. ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ : కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే... ్రపోపియోనీ బ్యాక్టీరియా, స్టెఫాలోకోకస్ ఆరియస్, డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ వంటి ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాతోనూ కొందరిలో మొటిమలు రావచ్చు.మొటిమలు మరింత తీవ్రంగా వచ్చేదిలా... 1. మురికి సెల్ఫోన్లు : టీనేజీ పిల్లల్లో మొటిమలు వస్తున్నప్పుడు వారు మురికిగా ఉండే సెల్ఫోన్లు వాడుతున్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వయసు పిల్లలు తాము వాడే సెల్‌ఫోన్‌ను, స్క్రీన్‌ను శుభ్రంగా తుడిచి వాడాలి. 2. హెయిర్ స్ప్రే లు వాడటం : టీనేజీ అమ్మాయిలూ, యువతులు హెయిర్ స్ప్రేలు, హెయిర్ స్టిఫెనర్లు, తలకు రంగులు, స్రెచ్లు, జెల్లు, క్రీములు వంటి వాటి వాడకం ఎక్కువ. వీటి వల్ల కూడా సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇలా వచ్చే మొటిమలు నుదురు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 3. రకరకాల కాస్మటిక్స్ వాడటం : కొందరు తాము వాడే కాస్మటిక్స్‌లో కొమిడొజెనిక్ ఏజెంట్స్ అని పిలిచే లెనోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యూటల్ స్ట్రియటైట్, లారిల్ ఆల్కహాల్, శరీరాన్ని తెల్లబరిచేందుకు ఉపయోగించే కాస్మటిక్స్ వాడుతుంటారు. అవి తీవ్రపరిణామాలతో పాటు మొటిమలకు కారణమవుతుంటాయి. అందుకే కొనేముందు అవి ‘నాన్ కొమిడోజెనిక్ కాస్మటిక్స్’ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటిని కొనుగోలు చేయడం మేలు. 4. ముఖాన్ని అతిగా కడగటం : ముఖం తేటగా కనిపించాలనే ఉద్దేశంతో మాటిమాటికీ కడగటం, స్క్రబ్బింగ్ చేయడం, ఆవిరిపట్టించడం (స్టీమింగ్), ఫేషియల్స్ అతిగా ఉపయోగించడం వంటి పనుల వల్ల మొటిమలు రావడంతో పాటు ముఖానికి నష్టం జరుగుతుంది. 5. మొటిమలను గిల్లడం, గట్టిగా నొక్కడం వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. ముఖపై చిన్నచిన్న గుంటల్లా పడే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ వస్తే ముఖం మరింత అందవికారంగా మారవచ్చు. అందుకే మొటిమలు గిల్లడం వంటివి చేయకూడదు. నివారణ / చికిత్సలు : ముఖాన్ని మృదువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. పొడిగా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్‌తో రుద్దుకోవడం, మాటిమాటికీ కడుక్కోవడం చేయకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. ఒకవేళ కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్–కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. ఈ చర్యలతో మొటిమలు తగ్గకపోతే అప్పుడు మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు లేదా పైపొరను దెబ్బతీయవచ్చు. దాంతో ముఖంపై చర్మం ఎర్రబారిపోవచ్చు. ఆహారపరమైన జాగ్రత్తలు టీనేజ్ పిల్లలు తీసుకునే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటివి. అవి... చాక్లెట్లు / కాఫీలు : మొటిమలను ప్రేరేపించే అంశాల్లో చాక్లెట్లు, కాఫీ లోని కెఫిన్ చాలా ప్రధానమైనవి. వాటిని పరిమితంగా తీసుకుంటూ ఆహారంలో కొవ్వులు, చక్కెర తగ్గించాలి ∙ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకోవడం అన్నది మొటిమలను చాలావరకు నివారిస్తుంది. ఈ తరహా నివారణ చర్యల తర్వాత కూడా మొటిమలు తగ్గకపోతే అప్పుడు డర్మటాలజిస్ట్‌ను కలవాలి. -
వరల్డ్ ఫేమస్ లగ్జరీ బ్రాండ్‌ను తీసుకొచ్చిన రిలయన్స్
రిలయన్స్ రిటైల్‌కు చెందిన సౌందర్య ఉత్పత్తుల వేదిక ‘తీరా’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అగస్టినస్ బాడర్ కలెక్షన్ ప్రత్యేకంగా తీరా ఆన్‌లైన్‌తోపాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరులోని ఎంపిక చేసిన తీరా స్టోర్లలో అందుబాటులో ఉందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.దేశంలో తీరా స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఈ అగస్టినస్ బాడర్ బ్రాండ్‌ను ప్రపంచ ప్రఖ్యాత స్టెమ్ సెల్, బయోమెడికల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అగస్టినస్ బాడర్ స్థాపించారు. ఈ బ్రాండ్ ఉత్పత్తులతోపాటు వ్యక్తిగత స్కిన్‌కేర్ అవసరాలకు ఏ ఉత్పత్తులను ఎంచుకోవాలన్నదానిపై కస్టమర్లకు ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.యూరోమానిటర్ ఎస్టిమేట్స్ ప్రకారం.. భారతదేశ బ్యూటీ మార్కెట్ 2025 నాటికి 20 బిలియన్ డాలర్లకు పెరగనుంది. అందులోనూ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ 15% వృద్ధి చెందనుంది. దేశంలో స్కిన్‌కేర్ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2022లో 6.53 బిలియన్ డాలర్లు. ఇది 2027 నాటికి 8.84 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ డేటా చెబుతోంది.బ్యూటీ మార్కెట్ వృద్ధి నేపథ్యంలో నైకా, టాటా క్లిక్ ప్యాలెట్, మింత్రా వంటి సంస్థలతో రిలయన్స్ రిటైల్ కంపెనీ తీరా పోటీ పడుతోంది. ఆన్‌లైన్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ డజను ఆఫ్‌లైన్ స్టోర్లను కూడా తీరా ప్రారంభించింది. -
ఆలియాభట్ లాంటి ఫేస్ కావాలని..
ఇరవై మూడేళ్ల మాధురి (పేరు మార్చాం)...బీఎస్సీ ఫైనల్ చదువుతోంది. అకస్మాత్తుగా కొద్ది రోజుల నుంచి ఆమె ముఖం ఆమెకు నచ్చడం లేదు. అందుకు కారణం తన ముఖం వంకరగా కనిపించడమే. కుడి వైపుతో పోల్చుకుంటే ఎడమవైపు తేడాఉన్నట్లనిపించింది. కుడి వైపు నుంచి, ఎడమవైపు నుంచి రకరకాలుగా ఫొటోలు తీసుకుంది. తన ముఖంలో ఏదో లోపం ఉందని భావించి కాలేజీకి వెళ్లడం మానేసింది. గంటల తరబడి అద్దం ముందు నిలుచుని ముఖాన్నే చూసుకుంటోంది. స్నేహితులు, బంధువులకు దూరంగా ఉంటూఒంటరిగా గడిపేస్తోంది. తన ముఖంలోని లోపాన్ని సరిదిద్దేందుకు సర్జరీయే పరిష్కారంగా నిర్ణయించుకుంది. ఇది తెలిసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యులను సంప్రదించారు. కానీ సంతృప్తికరమైన పరిష్కారం లభించలేదు. దాంతో ఇటీవల ముంబైలో మరో ప్రముఖ వైద్యుడినికలిశారు. ♦ అతడు యువతిని పరీక్షించి ఆమెలో ఏ లోపం లేదని, మానసిక వైద్యులను కలవాలని సూచించాడు. ఫేస్బుక్లో తరచూ తన ఫొటోలను అప్లోడ్ చేసే మాధురి ఇతరులతో తనను తాను పోల్చుకొని ఈ తరహా మానసిక రుగ్మతకు గురైనట్లు నిపుణులు నిర్ధారించారు. ♦ ఇది ఒక్క మాధురి ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. నగరంలో చాలామంది మధ్య తరగతి యువతీ యువకులు ఈ తరహా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముక్కు వంకరగా ఉందని, ముఖంలో మచ్చలు కనిపిస్తున్నాయని, శరీర ఆకృతి సరిగా లేదని,రంగు బాగోలేదని ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు..?.. సాక్షి, సిటీబ్యూరో :ముక్కు వంకరగా ఉంది. ముఖంలో మచ్చలు కనిపిస్తున్నాయి. శరీర ఆకృతి, రంగూ బాగోలేవు. ఇలాంటి ఆందోళనతో సిటీ యూత్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు అవసరం లేకపోయినా బొటిక్స్ఇంజెక్షన్లు చేయించుకుంటున్నట్లు మానసిక వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్స్’ (బీడీడీ)గా పిలిచే ఈ తరహా కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ప్రతి నెలా50 నుంచి 70 వరకు నమోదవుతున్నాయని హైదరాబాద్ క్లినికల్ సైకియాట్రిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ సతీష్ సంగిశెట్టి తెలిపారు. తమను తాము మరొకరితో పోల్చుకోవడం వల్లే అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి రుగ్మతల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. ‘బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్స్’ (బీడీడీ)పై ప్రత్యేక కథనం. ఏదో లోపం ఉందని.. ఇప్పుడు యువతను అద్దం ‘భూత’ద్దమై వెంటాడుతోంది. అందమైన ముఖకవళికలను వికృతంగా చూపిస్తోంది. మచ్చలేని కోటేరులాంటి ముక్కును వంకరలు తిప్పుతోంది. తెల్లటి వర్ఛస్సులో రంగులు మార్చేస్తోంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తోంది. కానీ ఇది ఏ మాత్రం అద్దం తప్పు కాదు. ఆ అద్దంలో తమను తమలా కాకుండా మరొకరిలా చూసుకుంటున్న యువతీ యువకులదే. హీరో, హీరోయిన్లతో, మోడల్స్‌తో, లేదంటే స్నేహితులతో, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో కనిపించే ఫొటోలతో పోల్చుకొని తమలో ఏవో లోపాలున్నాయంటూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం మానేసి కెరీర్‌ను సైతం వదులుకుంటున్నారు. డిప్రెషన్ బారిన పడి నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు. సర్జరీల కోసం కాస్మటాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు. ఎందుకిలా... బీడీడీ కేసుల్లో ఎక్కువ శాతం శరీరంలో సెరెటోనిన్ అనే న్యూరో కెమికల్ తగ్గడం వల్ల ఈ తరహా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు. మరికొందరికి మెదడులోని కొన్ని లోపాలు, జన్యుపరమైన సమస్యలతో అసాధారణ లక్షణాలకు గురవుతున్నారు. అబ్బాయిల్లో ఎక్కువ మంది కోటేరులాంటి ముక్కు కోసం ఆందోళనకు గురవుతుండగా, అమ్మాయిల్లో శరీర ఆకృతి, రంగు, ముఖకవళికల్లో మార్పులు ఉన్నాయనే ఆందోళన కనిపిస్తోంది. బొటిక్స్‌కు వెళుతున్నారు. ఆలియాభట్ లాంటి ఫేస్ కావాలని సికింద్రాబాద్‌కు చెందిన 12వ తరగతి చదివే అబ్బాయి తన ముక్కు ప్రభాస్‌లా లేదని ఆందోళనకు గురయ్యాడు. కొద్దిగా సరి చేసుకుంటే అచ్చం ప్రభాస్ ముక్కులాగే ఉంటుందని సర్జరీ కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో వారు వైద్య నిపుణులను సంప్రదించారు. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా ముక్కు అలాగే ఉందని, ప్రభాస్ లాంటి ముక్కు రాలేదనే ఆందోళన మరింత ఎక్కువైంది. చదువు ముందుకు సాగడం లేదు. ఇది ఆ అబ్బాయికే కాదు. కుటుంబ సభ్యులందరికీ సమస్యగానే మారింది. అలాగే డిగ్రీ చదువుతున్న 21 ఏళ్ల ఓ అమ్మాయిలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ప్రతి రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లే ఆ అమ్మాయి ఇటీవల కాలేజీ ఎగ్గొట్టి మరీ అద్దం ముందు నిలుచుంటోందని ఆమె తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. తనకు మంచి కలర్ లేదని, తాను ఆలియాభట్లా లేనని ఆందోళనకు గురైంది. తనకు చక్కటి శరీర ఆకృతి లేదని, నుదురుపైన హెయిర్ తగ్గిందని, బుగ్గలు బాగా లోతుకు పోయాయయని రకరకాల సమస్యలతో తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమె కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు సైకియాట్రిస్టులను ఆశ్రయించారు. అనవసర సర్జరీలు వద్దు.. శరీరంపై, ముఖ కవళికలపై రకరకాల ప్రయోగాలు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా ఊహించుకోవడం వల్లే యువత ఇలాంటి మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. కెరీర్ పాడు చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా మానసిక సమస్య మాత్రమే. శారీరక లోపం ఏ మాత్రం కాదు. ఏవో లోపాలు ఉన్నాయనుకొని అనవసరమైన సర్జరీలకు వెళ్లినా వారు కోరుకున్న మార్పులు రావడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సంహిత, క్లినికల్ సైకాలజిస్ట్ ముక్కుపై మచ్చ ఉందంటూ.. జూబ్లీహిల్స్‌కు చెందిన 27 ఏళ్ల అఖిల్ (పేరు మార్చాం) తన 17వ ఏట నుంచి ముఖం బాగా లేదని బాధపడుతున్నాడు. మొదట్లో ముఖంలో కొన్ని మచ్చలు ఉన్నాయని డాక్టర్లను సంప్రదించాడు, రకరకాల మందులు వాడాడు. ఈ క్రమంలోనే చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరాడు, అయినా అతని సమస్యకు పరిష్కారం లభించలేదు, ముక్కుపై ఇంకా ఒక మచ్చ మిగిలిపోయిందని, దానిని కవర్ చేసుకొనేందుకు తరచూ తెల్లటి పౌడర్‌ను రుద్దుకుంటాడు. ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే ముక్కుపై చేయి అడ్డంగా ఉంచుకుంటాడు. స్నేహితులు, సహోద్యోగులు తనను బాగా ఎగతాళి చేస్తున్నట్లు, తనను చూసి నవ్వుకుంటున్నట్లు ఆందోళనకు గురయ్యాడు. క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు. డిప్రెషన్ ఎక్కువైంది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కూడా మానేశాడు. తల్లిదండ్రులు అతన్ని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఇపుడిప్పుడే ఆ లక్షణాల నుంచి బయటపడుతున్నట్లు అతనికి మానసిక చికిత్సను అందజేస్తున్న డాక్టర్ తెలిపారు. -
చర్మం – లావణ్యం
బ్యూటిప్స్ ⇔ వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మలావణ్యం పెరుగుతుంది. చలికి పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది. ⇔పొడిచర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది. ⇔కోడిగుడ్డు తెల్లసొనను బాగా చిలికి ముఖానికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇది జిడ్డు, సాధారణ చర్మాలకు బాగా పని చేస్తుంది. పొడిచర్మానికి మంచి ఫలితాలనివ్వదు. కోడిగుడ్డు తెల్లసొన నాచురల్ బ్లీచ్‌గా పనిచేసి చర్మాన్ని తెల్లబరుస్తుంది కాని జిడ్డును తొలగించడం ద్వారా చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. ⇔ తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.