ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని.. | Youth Worried About Beauty Skin And Cosmetic Surgery | Sakshi
Sakshi News home page

ఎందుకో..ఏమో..! నేనేనా!

Published Wed, Jul 24 2019 11:55 AM | Last Updated on Sat, Jul 27 2019 12:53 PM

Youth Worried About Beauty Skin And Cosmetic Surgery - Sakshi

ఇరవై మూడేళ్ల మాధురి (పేరు మార్చాం)...బీఎస్సీ ఫైనల్‌ చదువుతోంది. అకస్మాత్తుగా కొద్ది రోజుల నుంచి ఆమె ముఖం ఆమెకు నచ్చడం లేదు. అందుకు కారణం తన ముఖం వంకరగా కనిపించడమే. కుడి వైపుతో పోల్చుకుంటే ఎడమవైపు తేడాఉన్నట్లనిపించింది. కుడి వైపు నుంచి, ఎడమవైపు నుంచి రకరకాలుగా ఫొటోలు తీసుకుంది. తన ముఖంలో ఏదో లోపం ఉందని భావించి కాలేజీకి వెళ్లడం మానేసింది. గంటల తరబడి అద్దం ముందు నిలుచుని ముఖాన్నే చూసుకుంటోంది. స్నేహితులు, బంధువులకు దూరంగా ఉంటూఒంటరిగా గడిపేస్తోంది.    తన ముఖంలోని లోపాన్ని సరిదిద్దేందుకు సర్జరీయే పరిష్కారంగా నిర్ణయించుకుంది. ఇది తెలిసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యులను సంప్రదించారు. కానీ సంతృప్తికరమైన పరిష్కారం లభించలేదు. దాంతో ఇటీవల ముంబైలో మరో ప్రముఖ వైద్యుడినికలిశారు.

అతడు యువతిని పరీక్షించి ఆమెలో ఏ లోపం లేదని, మానసిక వైద్యులను కలవాలని సూచించాడు. ఫేస్‌బుక్‌లో తరచూ తన ఫొటోలను అప్‌లోడ్‌ చేసే మాధురి ఇతరులతో తనను తాను పోల్చుకొని ఈ తరహా మానసిక రుగ్మతకు గురైనట్లు నిపుణులు నిర్ధారించారు.
ఇది ఒక్క మాధురి ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. నగరంలో చాలామంది మధ్య తరగతి యువతీ యువకులు ఈ తరహా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముక్కు వంకరగా ఉందని, ముఖంలో మచ్చలు కనిపిస్తున్నాయని, శరీర ఆకృతి సరిగా లేదని,రంగు బాగోలేదని ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు..?..

సాక్షి, సిటీబ్యూరో  :ముక్కు వంకరగా ఉంది. ముఖంలో మచ్చలు కనిపిస్తున్నాయి. శరీర ఆకృతి, రంగూ బాగోలేవు. ఇలాంటి ఆందోళనతో సిటీ యూత్‌ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు  అవసరం లేకపోయినా బొటిక్స్‌ఇంజెక్షన్‌లు చేయించుకుంటున్నట్లు మానసిక వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్స్‌’ (బీడీడీ)గా పిలిచే ఈ తరహా  కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ప్రతి నెలా50 నుంచి 70 వరకు నమోదవుతున్నాయని హైదరాబాద్‌ క్లినికల్‌ సైకియాట్రిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ సతీష్‌ సంగిశెట్టి  తెలిపారు. తమను తాము మరొకరితో పోల్చుకోవడం వల్లే అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి రుగ్మతల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్స్‌’ (బీడీడీ)పై ప్రత్యేక కథనం.  

ఏదో లోపం ఉందని..
ఇప్పుడు యువతను అద్దం ‘భూత’ద్దమై వెంటాడుతోంది. అందమైన ముఖకవళికలను  వికృతంగా చూపిస్తోంది. మచ్చలేని కోటేరులాంటి ముక్కును వంకరలు తిప్పుతోంది. తెల్లటి వర్ఛస్సులో రంగులు మార్చేస్తోంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తోంది. కానీ ఇది ఏ మాత్రం అద్దం తప్పు కాదు. ఆ అద్దంలో తమను తమలా కాకుండా మరొకరిలా చూసుకుంటున్న యువతీ యువకులదే. హీరో, హీరోయిన్‌లతో, మోడల్స్‌తో, లేదంటే  స్నేహితులతో, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాల్లో కనిపించే  ఫొటోలతో పోల్చుకొని తమలో ఏవో లోపాలున్నాయంటూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం మానేసి కెరీర్‌ను సైతం వదులుకుంటున్నారు. డిప్రెషన్‌ బారిన పడి నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు. సర్జరీల కోసం కాస్మటాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు.

ఎందుకిలా...
బీడీడీ కేసుల్లో ఎక్కువ శాతం  శరీరంలో సెరెటోనిన్‌ అనే న్యూరో కెమికల్‌ తగ్గడం వల్ల ఈ తరహా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు. మరికొందరికి మెదడులోని కొన్ని లోపాలు, జన్యుపరమైన సమస్యలతో అసాధారణ లక్షణాలకు గురవుతున్నారు. అబ్బాయిల్లో ఎక్కువ మంది కోటేరులాంటి ముక్కు కోసం ఆందోళనకు గురవుతుండగా, అమ్మాయిల్లో శరీర ఆకృతి, రంగు, ముఖకవళికల్లో మార్పులు ఉన్నాయనే ఆందోళన కనిపిస్తోంది. బొటిక్స్‌కు వెళుతున్నారు.

ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని

సికింద్రాబాద్‌కు చెందిన 12వ తరగతి చదివే అబ్బాయి తన ముక్కు ప్రభాస్‌లా లేదని  ఆందోళనకు గురయ్యాడు. కొద్దిగా సరి చేసుకుంటే అచ్చం ప్రభాస్‌ ముక్కులాగే ఉంటుందని సర్జరీ కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో వారు వైద్య నిపుణులను సంప్రదించారు. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా ముక్కు అలాగే ఉందని, ప్రభాస్‌ లాంటి ముక్కు రాలేదనే ఆందోళన మరింత ఎక్కువైంది. చదువు ముందుకు సాగడం లేదు. ఇది  ఆ అబ్బాయికే కాదు. కుటుంబ సభ్యులందరికీ సమస్యగానే మారింది. అలాగే డిగ్రీ చదువుతున్న 21 ఏళ్ల ఓ అమ్మాయిలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ప్రతి రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లే ఆ అమ్మాయి ఇటీవల కాలేజీ ఎగ్గొట్టి మరీ అద్దం ముందు నిలుచుంటోందని ఆమె తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. తనకు మంచి కలర్‌ లేదని, తాను ఆలియాభట్‌లా లేనని  ఆందోళనకు గురైంది. తనకు చక్కటి శరీర ఆకృతి లేదని, నుదురుపైన హెయిర్‌ తగ్గిందని, బుగ్గలు బాగా లోతుకు పోయాయయని రకరకాల సమస్యలతో తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమె కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు సైకియాట్రిస్టులను ఆశ్రయించారు.  

అనవసర సర్జరీలు వద్దు..
శరీరంపై, ముఖ కవళికలపై రకరకాల ప్రయోగాలు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా ఊహించుకోవడం వల్లే యువత ఇలాంటి మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. కెరీర్‌ పాడు చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా మానసిక సమస్య మాత్రమే. శారీరక లోపం ఏ మాత్రం కాదు. ఏవో లోపాలు ఉన్నాయనుకొని అనవసరమైన సర్జరీలకు వెళ్లినా వారు కోరుకున్న మార్పులు రావడం సాధ్యం కాదని  గుర్తుంచుకోవాలి.  డాక్టర్‌ సంహిత, క్లినికల్‌ సైకాలజిస్ట్‌  

ముక్కుపై మచ్చ ఉందంటూ..
జూబ్లీహిల్స్‌కు చెందిన 27 ఏళ్ల అఖిల్‌ (పేరు మార్చాం) తన 17వ ఏట నుంచి  ముఖం బాగా లేదని బాధపడుతున్నాడు. మొదట్లో  ముఖంలో కొన్ని మచ్చలు ఉన్నాయని డాక్టర్లను సంప్రదించాడు, రకరకాల మందులు వాడాడు. ఈ క్రమంలోనే చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరాడు, అయినా అతని సమస్యకు పరిష్కారం లభించలేదు, ముక్కుపై ఇంకా ఒక మచ్చ మిగిలిపోయిందని, దానిని కవర్‌ చేసుకొనేందుకు తరచూ తెల్లటి పౌడర్‌ను రుద్దుకుంటాడు. ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే ముక్కుపై చేయి అడ్డంగా ఉంచుకుంటాడు. స్నేహితులు, సహోద్యోగులు తనను బాగా ఎగతాళి చేస్తున్నట్లు, తనను చూసి నవ్వుకుంటున్నట్లు ఆందోళనకు గురయ్యాడు. క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు. డిప్రెషన్‌  ఎక్కువైంది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కూడా మానేశాడు. తల్లిదండ్రులు అతన్ని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఇపుడిప్పుడే ఆ లక్షణాల నుంచి బయటపడుతున్నట్లు అతనికి మానసిక చికిత్సను అందజేస్తున్న డాక్టర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement