చర్మం – లావణ్యం
బ్యూటిప్స్
⇔ వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మలావణ్యం పెరుగుతుంది. చలికి పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్‌మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది.
⇔పొడిచర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది.
⇔కోడిగుడ్డు తెల్లసొనను బాగా చిలికి ముఖానికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇది జిడ్డు, సాధారణ చర్మాలకు బాగా పని చేస్తుంది. పొడిచర్మానికి మంచి ఫలితాలనివ్వదు. కోడిగుడ్డు తెల్లసొన నాచురల్ బ్లీచ్‌గా పనిచేసి చర్మాన్ని తెల్లబరుస్తుంది కాని జిడ్డును తొలగించడం ద్వారా చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది.
⇔ తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్‌మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.