Beauty Tips: హార్మోన్ల అల్లరిది గిల్లకండి! | Why my face is getting pimples? | Sakshi
Sakshi News home page

Beauty Tips: హార్మోన్ల అల్లరిది గిల్లకండి!

Published Tue, Nov 5 2024 12:27 PM | Last Updated on Tue, Nov 5 2024 12:29 PM

Why my face is getting pimples?

యువతుల లుక్స్‌ను ప్రభావితం చేసి వారిని బాధపెట్టేవాటిల్లో మొటిమలు ముఖ్యమైనవి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వారు బాల్యం వీడి కౌమారంలోకి వచ్చే  దశలో ఈ మొటిమలు మొదలవుతుంటాయి. ఆ టైమ్‌లో దేహంలో కొన్ని రకాల కొత్త హార్మోన్ల ఉత్పత్తి మొదలవడం, ఆ టైమ్‌లో చర్మం మీద ఉండే గ్రంథుల్లోంచి ‘సెబమ్‌’ అనే నూనెవంటి పదార్థం స్రవిస్తుంటుంది. ఆ నూనె వంటి పదార్థం గ్రంథుల చివర్లలో పేరుకుపోవడం వల్ల మృతిచెందిన కణాలను బయటకు రాకుండా ఆపడం... దాంతో నూనె గ్రంథి మూసుకుపోవడం వల్ల మొటిమ వస్తుంది. దీన్ని గిల్లినప్పుడు సీబమ్‌ బయటకు వచ్చేసి, అక్కడ చిన్న గుంట మిగిలిపోతుంది. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలను అమితంగా బాధించే ఈ మొటిమలూ... అవి వచ్చేందుకు కారణాలూ, వాటి నివారణా, చికిత్స వంటి అనేక విషయాలను తెలిపే కథనమిది.

సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపిస్తాయని అనుకుంటారు. గానీ అవి ముఖం మీద చెంపలూ, ముక్కు అలాగే భుజాలు, వీపు ఇలా అనేక భాగాల్లో వస్తుంటాయి.  

మొటిమలు... లక్షణాలు:
మొటిమల్లో ప్రధానంగా నాలుగు గ్రేడ్స్‌  ఉంటాయి. అవి... 
గ్రేడ్‌ – 1 : (కొమెడోజెనిక్‌) : ఈ తరహా మొటిమను వైట్‌ హెడ్‌ లేదా బ్లీచ్‌ హెడ్‌  అని పిలుస్తారు. దీని బయటి చివరి భాగం  మూసుకుపోవడం వల్ల అక్కడ ఇది తెల్లరంగులో గడ్డగట్టుకుపోయిన చిన్న బంతి ఆకృతిలో కనిపిస్తుంది. బాల్‌పాయింట్‌ పెన్‌ చివరి టిప్‌ సైజ్‌లో ఈ వైట్‌హెడ్‌ ఉంటుంది. ఒకవేళ మూతి చివరి చర్మకణాలు చనిపోయి నల్లగా మారిపోతే దాన్ని బ్లాక్‌హెడ్‌గా అభివర్ణిస్తారు. 

గ్రేడ్‌ – 2 : (పాపులర్‌ ఆక్నే) : ఈ దశలో మొటిమలో కొద్దిపాటి వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్‌) కనిపిస్తుంది. ఇలా ఇన్‌ఫ్లమేషన్‌ కనిపించే దశను పాపులర్‌ ఆక్నే అంటారు. ఈ దశలో ఇది చిన్నగా ఎర్రగా మరి ఉబ్బినట్లుగా బయటికి తన్నుకొని వచ్చి కనిపిస్తుంది. 

గ్రేడ్‌ – 3 : (పుస్టులార్‌ ఆక్నే): ఈ దశలో ఇన్‌ఫ్లమేషన్‌ చాలా ఎక్కువ. పైగా ఈ దశలో ్రపాపియోనిక్‌ బ్యాక్టీరియా అనే ఒక తరహా బ్యాక్టీరియా ఆ మొటిమకు తోడవుతుంది. ఈ దశలో మొటిమలో ఇన్‌ఫ్లమేషన్‌కు తోడు చీము చేరుతుంది. దాంతో ఎర్రగా  ఉబ్బుకుని వచ్చిన భాగం మీద తెల్లటి చీము కనిపిస్తూ ఉంటుంది. 

గ్రేడ్‌ – 4 : (సిస్టిక్‌ ఆక్నే) : ఒకవేళ పైన పేర్కొన్న పుస్టులార్‌ ఆక్నే మరింత తీవ్రమైనప్పుడు అది చిన్న నాడ్యూల్‌గా (నీటి తిత్తిగా) మారిపోయి, బయటకు తన్నుకు వచ్చినట్లగా కనిపిస్తుంది. ఇందులో ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు, చీము, నొప్పి, నీటిగుల్ల... ఇవన్నీ కలిపి ఉన్నందున మొటిమ తీవ్రంగా మారుతుంది. 
కొన్ని మొటిమల్లో మొదటి గ్రేడ్‌ నుంచి నాలుగో గ్రేడ్‌ వరకూ ఒకే మొటిమలోనే అన్ని దశలూ కనిపించవచ్చు. ఈ తరహా మొటిమలు ముఖం, ఛాతీ, భుజాలు, వీపు... ఇలా అన్ని భాగాల్లో రావచ్చు.

కారణాలు : 
1. బాలలు ఒక్కసారిగా యౌవన (కౌమార) దశలోకి ప్రవేశిస్తుంటారు. దీన్నే ప్యూబర్టీ స్పర్ట్‌గా పేర్కొంటారు. టీనేజీ యువతుల్లో అనేక రకాల హార్మోన్లు స్రవిస్తుండటం, వాటి మధ్య సమతౌల్యత లోపించడం మొదలైతే మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘పాలీసిస్టిక్‌ ఒవేరియస్‌ డిజార్డర్‌’ లేదా పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ ఉన్న అమ్మాయిల్లో ముఖాలపై మొటిమలు చాలా ఎక్కువ. 
2. ఆహారం : చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే (హై గ్లూకోజ్‌) ఆహారాన్ని తీసుకునే వారిలో మొటిమల సమస్య చాలా ఎక్కువ. పాల ఉత్పాదనలతో కూడిన స్వీట్లు, చాక్లెట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాల్ని ఎక్కువగా తీసుకునేవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ తరహా ఆహారాన్ని తగ్గించగానే మొటిమలూ తగ్గుముఖం పడతాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరగకపోవచ్చు. మొటిమలకూ, ఇన్సులిన్‌ మెటబాలిజమ్‌ (ఇన్సులిన్‌ జీవక్రియల తీరు), స్థూలకాయానికీ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. 
3. జన్యుసంబంధమైన కారణాలు : కొందరిలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కేవలం జన్యుసంబంధమైన కారణాలతోనూ మొటిమలు రావచ్చు.  
4. ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 
5. ఇన్ఫెక్షన్‌ ఏజెంట్స్‌ : కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే... ్రపోపియోనీ బ్యాక్టీరియా, స్టెఫాలోకోకస్‌ ఆరియస్, డెమోడెక్స్‌ ఫాలిక్యులోరమ్‌ వంటి ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాతోనూ కొందరిలో మొటిమలు రావచ్చు.

మొటిమలు మరింత  తీవ్రంగా వచ్చేదిలా...  

1. మురికి సెల్‌ఫోన్లు : టీనేజీ పిల్లల్లో మొటిమలు వస్తున్నప్పుడు వారు మురికిగా ఉండే సెల్‌ఫోన్లు వాడుతున్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వయసు పిల్లలు తాము వాడే సెల్‌ఫోన్‌ను, స్క్రీన్‌ను శుభ్రంగా తుడిచి వాడాలి. 
2. హెయిర్‌ స్ప్రే లు వాడటం : టీనేజీ అమ్మాయిలూ, యువతులు హెయిర్‌ స్ప్రేలు, హెయిర్‌ స్టిఫెనర్లు, తలకు రంగులు, స్రెచ్‌లు, జెల్‌లు, క్రీములు వంటి వాటి వాడకం ఎక్కువ. వీటి వల్ల కూడా సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇలా వచ్చే మొటిమలు నుదురు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.  
3. రకరకాల కాస్మటిక్స్‌ వాడటం : కొందరు తాము వాడే కాస్మటిక్స్‌లో కొమిడొజెనిక్‌ ఏజెంట్స్‌ అని పిలిచే లెనోలిన్, వెజిటబుల్‌ ఆయిల్స్, బ్యూటల్‌ స్ట్రియటైట్, లారిల్‌ ఆల్కహాల్, శరీరాన్ని తెల్లబరిచేందుకు ఉపయోగించే కాస్మటిక్స్‌ వాడుతుంటారు. అవి తీవ్రపరిణామాలతో పాటు మొటిమలకు కారణమవుతుంటాయి. అందుకే కొనేముందు అవి ‘నాన్‌ కొమిడోజెనిక్‌ కాస్మటిక్స్‌’ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటిని కొనుగోలు చేయడం మేలు. 
4. ముఖాన్ని అతిగా కడగటం : ముఖం తేటగా కనిపించాలనే ఉద్దేశంతో మాటిమాటికీ కడగటం, స్క్రబ్బింగ్‌ చేయడం, ఆవిరిపట్టించడం (స్టీమింగ్‌), ఫేషియల్స్‌ అతిగా ఉపయోగించడం వంటి పనుల వల్ల మొటిమలు రావడంతో పాటు ముఖానికి నష్టం జరుగుతుంది. 
5. మొటిమలను గిల్లడం, గట్టిగా నొక్కడం వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. ముఖపై చిన్నచిన్న గుంటల్లా పడే అవకాశం ఉంది. ఇన్‌ఫ్లమేషన్‌ వస్తే ముఖం మరింత అందవికారంగా మారవచ్చు. అందుకే మొటిమలు గిల్లడం వంటివి చేయకూడదు. 

నివారణ / చికిత్సలు : 
 ముఖాన్ని మృదువైన (మైల్డ్‌) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్‌ వేసుకోకూడదు. పొడిగా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్‌తో రుద్దుకోవడం, మాటిమాటికీ కడుక్కోవడం చేయకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు.  జిడ్డుగా ఉండే కాస్మటిక్స్‌ వేసుకోకూడదు. ఒకవేళ కాస్మటిక్స్‌ వాడాలనుకుంటే ‘నాన్‌–కొమిడోజెనిక్‌’ తరహావి మాత్రమే వాడాలి. ఈ చర్యలతో మొటిమలు తగ్గకపోతే అప్పుడు మొటిమలను నివారించే మందులను డాక్టర్‌ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్‌ పెరాక్సైడ్‌ / సల్ఫర్‌ / రిజార్సినాల్‌ / శాల్సిలిక్‌ ఆసిడ్‌ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు లేదా పైపొరను దెబ్బతీయవచ్చు. దాంతో ముఖంపై చర్మం ఎర్రబారిపోవచ్చు. 

ఆహారపరమైన జాగ్రత్తలు 
టీనేజ్‌ పిల్లలు తీసుకునే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటివి. అవి... 
 చాక్లెట్లు / కాఫీలు : మొటిమలను ప్రేరేపించే అంశాల్లో చాక్లెట్లు, కాఫీ లోని కెఫిన్‌ చాలా ప్రధానమైనవి. వాటిని పరిమితంగా తీసుకుంటూ ఆహారంలో కొవ్వులు, చక్కెర తగ్గించాలి ∙ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకోవడం అన్నది మొటిమలను చాలావరకు నివారిస్తుంది. 
ఈ తరహా నివారణ చర్యల తర్వాత కూడా మొటిమలు తగ్గకపోతే అప్పుడు  డర్మటాలజిస్ట్‌ను కలవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement