Buety tips
-
జుట్టు రాలడానికి మందులు కూడా ఓ కారణమే.. ఆ మందులు ఇవే..
మనకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాల కోసం రకరకాల మందులు వాడుతుంటాం. వాటిల్లో కొన్నింటి దుష్ప్రభావాల వల్ల కొందరిలో జుట్టు రాలడం మామూలే. జుట్టు రాల్చే మందులు ►మొటిమలకు వాడేవి,కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు, ►కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ∙నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,. ►రక్తాన్ని పలచబార్చేవి ∙యాంటీకొలెస్ట్రాల్ మందులు ►ఇమ్యునోసప్రెసెంట్స్ ∙కీమోథెరపీ మందులు. ►మూర్చ చికిత్సలో వాడే మందులు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్, ►వేగంగా మూడ్స్ మారిపోతున్నప్పుడు నియంత్రణకు వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు, ►నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు, ►స్టెరాయిడ్స్, ►థైరాయిడ్ మందులు. ఇవి వెంట్రుక జీవితచక్రంలోని వివిధ దశల్లోకి జొరబడి జుట్టును రాలేలా చేస్తాయి. వెంట్రుక దశలు వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి. టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో దాదాపు 100 రోజుల పాటు కొనసాగుతుంది. కనుబొమలు, కనురెప్పల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ చాలాకాలం ఉంటుంది. ఈ దశలో వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ సమయంలో పీకితే వెంట్రుక కింద గసగసాల్లాంటి గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది. కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండి, పెరుగుదల ఏమాత్రం ఉండదు. అనాజెన్ : వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. మనం వాడే మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి జుట్టు రాలేలా చేస్తాయి. టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా ఆరోగ్య సమస్య కోసం మందులు వాడటం మొదలుపెట్టగానే వాటి ప్రభావంతో 2 నుంచి 4 నెలల్లో హెయిర్ ఫాలికిల్ విశ్రాంతిలోకి వెళ్తుంది. దాంతో జుట్టు మొలవడం ఆలస్యం అవుతుంది. అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలుతుంది. ఈ మందులు కేవలం తల మీది జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోయేలా చేస్తాయి. మందుల వల్ల జుట్టు రాలుతుంటే... ►సాధారణంగా మందులు మానేయగానే జుట్టు మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. ►ప్రత్యామ్నాయ మందులు వాడటం. ►జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ►కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం. ఇందులో కీమోథెరపీ ఇచ్చే ముందరా... అలాగే ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇది జుట్టు రాలడాన్ని చాలావరకు నివారిస్తుంది. -
గ్లామర్ గ్రూమింగ్
తెల్లవారుజామునే నిద్రలేవడం, నచ్చిన వ్యాయామం చేయడం, నిర్ణీత వేళల్లో ఆహార విహారాలు, చక్కని మర్యాద పూర్వకమైన మాట తీరు...ఇవన్నీ చేసే యువతీ యువకులు అరుదే. అయితే అందాల పోటీల్లో పాల్గొనే యువతకు ఇవన్నీ తప్పక ఉండి తీరాల్సిన లక్షణాలు. ప్రస్తుతం నగరం వేదికగా బ్యూటీ కాంటెస్ట్‌ల కోసం పలు సంస్థలు నిర్వహిస్తున్న గ్రూమింగ్ తరగతులు యువతను పలు అంశాలలో తీర్చిదిద్దుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.. సాక్షి, సిటీబ్యూరో: అందాల ప్రపంచంలో రాణించడం అంత వీజీ కాదు. ముఖ్యంగా మోడలింగ్‌లో సక్సెస్ కావాలంటే కేవలం రూపు రేఖలు బాగున్నంత మాత్రాన, లుక్ క్లిక్ అయినంత మాత్రాన సరిపోదు. నడక దగ్గర్నుంచి నడవడిక దాకా అన్నీ తీర్చిదిద్దినట్టు ఉండాలి. నవ్వినా, నవ్వించినా మన ప్రవర్తన పండాలి. అన్నీ ఉంటేనే పోటీలో నిలుస్తారు. అందులోనూ కొందరే గెలుస్తారు. గెలవకపోయినా విజేతలే. ఎందుకంటే పోటీ సందర్భంగా నిపుణులు నేర్పిన పాఠాలు యువతీ యువకుల భావి జీవితాన్ని మేలు మలుపు తిప్పుతాయంటున్నారు నిపుణులు. ఉదయించే ఆరోగ్యం... బ్యూటీ/మోడలింగ్ కాంటెస్ట్‌లలో పోటీదారులకు అందించే శిక్షణ నిజంగానే యూత్ మోడల్స్‌గా వారిని మార్చుతుంది అంటారు గ్లామర్ రంగ నిపుణులు. కనీసం వారం రోజుల నుంచి ఆయా పోటీల నిర్వహణ తీరును బట్టి ఈ గ్రూమింగ్ తరగతులు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉదయాన్నే 5 గంటలకే పోటీదారులు నిద్ర నుంచి మేల్కోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి దాదాపు 2 గంటల సమయం స్ట్రెచ్చింగ్, వర్కవుట్, యోగా వంటి వాటికి కేటాయిస్తారు. ఖచ్చితంగా ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తవుతుంది. పిక్చర్ పర్ఫెక్ట్... సాధారణంగా ఉదయం వేళలో..అది కూడా తగిన శారీరక శ్రమ చేసి, ఫ్రెష్ అయిన తర్వాత ఒక విధమైన తాజాదనం ఉట్టిపడుతుంది. ఆ ఫ్రెష్లుక్ని సరిగ్గా పట్టుకోవడానికి బ్రేక్ ఫాస్ట్ అనంతరం ప్రతి రోజూ కనీసం గంట నుంచి 2 గంటల పాటు ఫొటో షూట్ నిర్వహిస్తారు. ఫైనలిస్ట్‌లుగా ఎంపికైన ప్రతి ఒక్కరికీ కొన్ని వందల సంఖ్యలో ఫొటోలు తీస్తారు. తద్వారా తాము ఏ సందర్భంలో, ఎలా ఉంటామో అలాగే తమ రూపురేఖల్లోని బలం/బలహీనతలు ఏమిటి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. తద్వారా వాటిని సవరించుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. వాక్.. ఓకే నీకు నడవడం రాదు అని ఎవరైనా అంటే ఆశ్చర్యపోతాం. మన దృష్టిలో ఏ అవయవలోపం లేకుండా నడవగలుగుతున్న ప్రతి ఒక్కరికీ నడవడం వచ్చినట్టే. అయితే చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకోవడంలో నడక కూడా చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుందనేది చాలా మందికి తెలీదు. అందుకే ఎలా పడితే అలా చేతులు విసురుతూనో, భుజాలు వేలాడేసుకునో, అతిగా ముందుకో, వెనక్కో వంగిపోతూనో నడుస్తూ కూడా బాగానే నడుస్తున్నాం అనుకుంటారు. విభిన్న రకాల ఉత్పత్తులను విభిన్న రకాలుగా ప్రమోట్ చేసే పనిలో రకరకాల వాక్స్ అవసరం. అందుకే ఈ మోడల్స్ గ్రూమింగ్‌లో భాగంగా ఆకట్టుకునేలా నడిచే శైలులను ప్రత్యేకంగా నేర్పిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా దీనికి కేటాయిస్తారు. ఈ నడక మెరుగుపరచుకోవడం అనేది యువత భావి కెరీర్‌కు చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ ఉద్యోగాల్లో నడక తీరు తెన్నులను నిశితంగా పరిశీలిస్తారనేది తెలిసిందే. టాలెంట్ రౌండ్ ప్రాక్టీస్... ప్రతి ఒక్కరిలో తమకు తెలిసినవి తెలియనివి కూడా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ బయటకు వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో ఆటలు, పాటలు, నృత్యాలు, క్విజ్లు...వంటివెన్నో ఉంటాయి. వీటి ద్వారా తమలోని ప్రతిభా సామరŠాధ్యలను సాన బెట్టుకోవడానికి వీలు చిక్కుతుంది. అంతేకాదు తమకే తెలియని ఎన్నో టాలెంట్స్‌ను పసిగట్టడానికి కూడా. ఇవి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని ఈ తరహా గ్రూమింగ్ తరగతుల్లో పాల్గొన్న నగర యువతి షీలా చెప్పారు. వీటితో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ కోసం కొంత సమయం కేటాయిస్తారు. తద్వారా ఇతరులతో సంభాషించే తీరు తెన్నులను మెరుగుపరచుకునే అవకాశం లభిస్తుంది. నడక నుంచి నడత వరకు.. నడక నుంచి నడత దాకా అన్నీ తీర్చిదిద్దడమే మోడలింగ్ పోటీలకు సంబంధించిన గ్రూమింగ్ తరగతుల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం యువతలో ఉన్న పలు రకాల బలహీనతలు, లోపాలను చాలా వరకూ ఇవి సవరిస్తాయి. ఇక్కడ శిక్షణ ద్వారా పొందిన అనుభవ సారం భవిష్యత్తులో ఏ రకమైన కెరీర్‌ను ఎంచుకున్నా యువతీ యవకులకు అద్భుతంగా ఉపకరిస్తుంది. ఇందులో సందేహం లేదు. అందుకే ఈ తరహా పోటీల్లో విజేతలు మాత్రమే కాదు ఫైనలిస్ట్ స్థాయి వరకూ వచ్చిన ప్రతి ఒక్కరూ లాభపడినట్టే అని చెప్పాలి. – జాన్‌పాల్, గ్రూమింగ్తరగతుల నిర్వాహకులు -
కురుల నిగనిగలకు..
కాలుష్యం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలు శిరోజాల అందాన్ని దెబ్బతీస్తాయి. కురుల నిగనిగలను కాపాడుకోవాలంటే.. ♦ రెండు టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. ♦ టీ స్పూన్ ఉల్లిరసంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దూది ఉండతో మిశ్రమాన్ని అద్దుకుంటూ మాడుకు పట్టించాలి. అర గంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. చుండ్రుతో పాటు. వెంట్రుకలు రాలడం సమస్య కూడా తగ్గుతుంది. -
పాలు కారే ముఖ సౌందర్యం కోసం సహజ చిట్కాలు
సరైన పద్ధతులలో సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సులువుగా ఇంట్లో లభించే పదార్థాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన చర్మ రక్షణ సుల ం కావడంతోపాటు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ♦ మీది జిడ్డు చర్మం అయితే అరకప్పు కాచి చల్లార్చిన పాలలో ఒక ఐసుముక్కను వేసి, అది ఆ పాలలో పూర్తిగా కరిగాక పాలలో చిన్న చిన్న దూది ఉండలు వేసి, వాటితో పాలను ముఖానికి పట్టించి, ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఫలితంగా చర్మం పైన ఉండే నూనెలు తొలగి, ముఖచర్మం మృదువుగా... తాజాగా మెరుస్తుంటుంది. ♦ కప్పు పాలలో శుభ్రమైన పలుచటి కాటన్ కర్చీఫ్ లేదా ఏదైనా వస్త్రాన్ని నానబెట్టండి. కాసేపయ్యాక దానిని తీసుకుని కళ్ళు మూసుకొని, ముఖం పైన కప్పుకోండి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగివేయండి. ♦ రెండు మూడు బాగా పండిన టమాటాలను ఉడకబెట్టి, చల్లారాక గుజ్జులా చేయండి. ఆ గుజ్జును కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచండి, దీనిని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రంగా కడగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ♦ చర్మాన్ని ఆరోగ్యంగా త్వరగా ప్రకాశవంతంగా మార్చడానికి ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. తేనె అందులో మొదటిది. అప్పుడప్పుడు ముఖ చర్మానికి తేనె, పసుపు, చందనం కలిపిన మిశ్రమాన్ని రాస్తుండాలి. వాటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా చర్మం పైన ఉండే మచ్చలకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, తేనె చర్మాన్ని మృదువుగా, సున్నితంగా పట్టులా మార్చేస్తుంది. ముఖంపై ఉండే మచ్చల కోసం... ♦ ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నాయా? అయితే ఫ్రిజ్ నుంచి తీసిన తాజా దోసకాయ రసంలో కాటన్ బాల్ లేదా చిన్న నూలు బట్ట ముక్కను ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి. -
మొటిమలు, మచ్చలు మాయం
ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా మొటిమలను, మచ్చలను సులువుగా తగ్గించుకునే ఔషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దామా... జాజికాయ, మిరియాలు, మంచి గంధం... ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. -
బ్యూటీ క్వీన్.. వర్కవుట్‌తో విన్
ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతుంటారు. కదలికల్లో కవ్వింపు ఉంటుంది. అన్నింటా ‘రాణి’ంపు ఉట్టిపడుతుంది. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని వచ్చిన అమ్మాయిల తీరే మారిపోతుంది. దీనికి కారణం కాంటెస్ట్‌లో పాల్గొన్న సమయంలో వారితో చేయించే సాధన. ముఖ్యంగా ఫిట్నెస్–డైట్ రొటీన్ అని చెప్పాలి. నగరానికి చెందిన యువతులకు బ్యూటీ పోటీలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ కాంటెస్ట్‌లలో పాల్గొనే వారికిచ్చే శిక్షణకు సంబంధించి నిపుణులు చెబుతున్న విశేషాలివి... సాక్షి, సిటీబ్యూరో : అటు శరీరాన్ని, ఇటు బాడీ లాంగ్వేజ్‌ని తీర్చిదిద్దడానికి ఫిట్నెస్ అత్యవసరం.దీని కోసం వీరితో చేయించే సాధన క్రమం ఇలా ఉంటుంది. ⇔ మైండ్ అండ్ బాడీ: యువతుల దేహంతో పాటు మైండ్‌ని కూడా తప్పనిసరిగా ట్యూన్ చేస్తారు. దీని కోసం ఫ్రీనెక్ ఎక్సర్సైజ్లు, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. అలాగే పర్వత త్రికోణాసన, అర్ధకటి చక్రాసన, వజ్రాసన తదితర ప్రాధమిక స్థాయి యోగాసనాలు వేయిస్తారు. ⇔ బాడీ బ్యాలెన్స్: శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడమే దీని ఉద్దేశం. ర్యాంప్‌వాక్ చేసేటప్పుడు సరైన విధంగా అడుగులు కదపడానికి పిలాటిస్ వ్యాయామం చేయిస్తారు. అలాగే దృష్టిని ఒకే చోట నిలుపుతూ మాట్లాడడానికి ఏకాగ్రత అవసరం. కాబట్టి యోగాని పిలాటిస్తో కలిపి ప్రత్యేక వర్కవుట్ చేయిస్తారు. ⇔ బాడీ ఎటాక్: సాధన ఊపందుకున్నాక చేయించే ప్రక్రియ ఇది. దీనిలో భాగంగా క్రీడాకారుల శైలి వ్యాయామాలు చేయిస్తారు. కేవలం బాడీ వెయిట్‌తో మాత్రమే చేసే వర్కవుట్స్ దీని స్పెషాలిటీ. వీటికి ఏరోబిక్స్ కూడా జత చేస్తారు. ⇔ బూట్ క్యాంప్: పచ్చని ప్రకృతి, సహజమైన వాతావరణంలో దీనిని చేయిస్తారు. ఇది సర్క్యూట్ స్టైల్ వర్కవుట్. పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్, లంజెస్, కెటిల్ బెల్స్, బాల్ వర్క్‌లతో పాటు స్కిప్పింగ్, రన్నింగ్, కాలిస్థెనిక్స్ వంటివి ఉంటాయి. మరికొందరితో కలిసి చేయాల్సిన వ్యాయామ విధానం ఇది. ⇔ బాడీపంప్: చాలామంది అమ్మాయిలకు తమకు ఫ్యాట్ ఉన్న విషయం తెలియదు. ఈ కాంటెస్ట్‌లలో ఏ మాత్రం ఫ్యాట్ ఉన్నా ఫలితం వ్యతిరేకం కాక తప్పదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగంగా కొవ్వును కరిగించే వ్యాయామశైలి అయిన బాడీపంప్ను చేయిస్తారు. వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రయినింగ్ ఆధారంగా రూపుదిద్దుకున్న వ్యాయమం ఇది. లోయర్‌బాడీ కంటే అప్పర్ బాడీకి కాస్త ఎక్కువగా వెయిట్స్ ఉపయోగిస్తారు. ⇔ లెథల్ లెగ్స్: సరైన టోనింగ్ ఉంటేనే లోయర్ బాడీ లుక్ బాగుంటుంది. అందుకే లోయర్‌బాడీ టోనప్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందింది లెథల్ లెగ్స్. దీనిలో స్క్వాట్స్, లంజెస్, లెగ్ రైజర్స్, లెగ్ కిక్స్ వంటివి ఉంటాయి. ⇔ కూల్‌డౌన్: వ్యాయామాన్ని వార్మప్‌తో ప్రారంభించి తప్పనిసరిగా దేహం కూల్‌డౌన్ కావాలి. దీనికోసం కొన్ని రకాల సెల్ఫ్ స్ట్రెచ్‌లు కనీసం 10సెకన్లు అదే భంగిమలో ఉండేట్టు చేయిస్తారు. శవాసనంతో ఫిట్నెస్ రొటీన్ ముగిసిన తర్వాత వ్యక్తిగత సందేహాలను నివృత్తి చేసేందుకు 15నిమిషాల పాటు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. డైట్..వెరీ స్పెషల్ అందాల పోటీల్లో పాల్గొనే వారికి డైట్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఫ్యాట్లెస్గా అన్ని పోషకాలతో ఉంటుంది. తెల్ల బియ్యంతో వండిన అన్నం అసలు ఉండదు. ఇక అత్యధికంగా వినియోగించేవి కూరగాయలు. డైట్ విషయంలో టైమ్‌టేబుల్ ఏ మాత్రం మిస్సవకుండా జాగ్రత్త పడతారు. రోజుకు కనీసం గంటన్నర పాటు వ్యాయామాలు చేస్తున్నప్పుడు ముఖసౌందర్యం దెబ్బతినకుండా, మేని మెరుపు కోల్పోకుండా జాగ్రత్తగా డైట్‌ని తీర్చిదిద్దుతారు. పోషకాహార నిపుణులు ప్రత్యేకంగా రూపొందించిన వంటకాల మెనూ వీరికి వడ్డిస్తారు. ⇔ బ్రేక్ ఫాస్ట్: పుచ్చకాయ, బొప్పాయి పండు ముక్కలు, కీరదోసకాయ, టమాటా ముక్కలు, వెన్న తీసిన పెరుగు, వీట్ఫ్లేక్స్, కార్న్‌ఫ్లేక్స్, ఎండు ఖర్జూరాలు, బాదం, ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన బీన్స్, ఓట్మీల్, కొతిమీర పచ్చడి, ఊతప్పం, వెజిటబుల్ సాంబార్, బటర్‌మిల్క్, కమలా పండ్లు, పైనాపిల్ జ్యూస్, వీట్‌బ్రెడ్, విభిన్న గింజధాన్యాలతో రూపొందిన మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తదితర సమాహారంగా ఉంటుంది. ⇔ లంచ్: టమాటా సలాడ్స్, క్యారెట్స్ లేకుండా ఇండియన్ గ్రీన్ సలాడ్స్, క్యాబెజీ రెడ్ ఆనియన్ సలాడ్స్, స్టీమ్డ్ అమెరికన్ కార్న్ చాట్, టమాటా సాస్‌తో గ్రిల్డ్ వెజిటబుల్స్, రోటీలు, మేతీ మూంగ్ దాల్, గోధుమ పిండి చపాతీలు ఉంటాయి. ⇔ డిన్నర్: స్టీమ్డ్ చికెన్, పప్పు, గోధుమ బ్రెడ్ రోల్స్, ఉడికించిన బ్రౌన్‌రైస్, చేపలు, పుదీనా పరాటాలు వంటివి రాత్రి డైట్‌కి ఉపయోగిస్తారు. తరచూ వెజ్సూప్లు, కొబ్బరి నీళ్లు, జల్జీరా జ్యూస్‌లు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అందిస్తారు. ఇందులో పూర్తిగా కాకపోయినా కూసింతైనా ఫాలో అవగలిగితే కిరీటం సంగతేమో గానీ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడడం సాధ్యమే. అందుకే బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచినవారు, ఫైనలిస్ట్‌గా మాత్రమే మిగిలినవారు కూడా ఈ కాంటెస్ట్ మా జీవితాన్ని మార్చేసింది అని చెబుతారు. -
చేతులు మృదువుగా...
♦ బ్యూటిప్స్ చలికాలం చాలామంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడిబారడం. ముఖ్యంగా చేతుల చర్మం పొడిబారి పైన ముడతలు పడి కనిపిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా... రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల తేనె కలిపి చేతులకు పాదాలకు రాయాలి. 15 నిమిషాలు ఉంచి శుభ్రపరుచుకోవాలి. గ్లిజరిన్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి ఒక బాటిల్లో పోసి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2-3 సార్లు చేతులకు, పాదాలకు రాసి, మసాజ్ చేసి శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. నిమ్మరసం, కొబ్బరినూనె, గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు చేతులకు, పాదాలకు రాయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది. టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ల తేనె కలిపి చేతులకు లోషన్‌లా రాసుకోవాలి. చేతులను శుభ్రంగా కడిగి, తుడుచుకొని, ఆ తర్వాత వీటిలో ఏదైనా ఒకటి రోజూ రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేతుల చర్మం మృదువుగా మారుతుంది.