bullet train technology
-
భారత్‌కు షింకన్సెన్ రైళ్లు
టోక్యో: భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఊపందుకుంటోంది. ట్రయల్ రన్, తనిఖీ తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ షింకన్సెన్ రైళ్లను భారత్‌కు జపాన్ కానుకగా ఇవ్వనుంది. నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రయల్ రన్ కోసం వాటిని వినియోగించనున్నారు. వీటిలో ఒకటి ఇ5 సిరీస్‌కు, మరోటి ఇ3 సిరీస్‌కు చెందినవి. ఈ రైళ్లను 2026 మొదట్లో భారత్‌కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకు చెందిన ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే దేశంలో తొలి హైస్పీడ్ రైలు మార్గం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయ్యాక అధిక ఉష్ణోగ్రతలు, ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకన్సెన్ రైళ్లను ఉపయోగిస్తారు. అంతకు అవసరమైన తనిఖీ పరికరాలను బిగించిన మీదట జపాన్ వాటిని భారత్‌కు అప్పగించనుంది. హైస్పీడ్ టెక్నాలజీ షింకన్సెన్ జపాన్ హైస్పీడ్ రైల్వే టెక్నాలజీ. ఈ10 అందులో నెక్ట్స్ జనరేషన్ మోడల్. 2030 నాటికి ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో ఈ అత్యాధునిక ఈ10 మోడల్ షింకన్సెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత్ యోచిస్తోంది. ‘మేకిన్ ఇండియా’కింద ఈ రైళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు 2016లో నాటి జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ త్వరలో భారత్‌కు బదిలీ చేస్తుంది. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆర్ఆర్టిఎస్, వందేభారత్ వంటి దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్ రైళ్లను భారత్ ఉపయోగిస్తోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో ఈ5 సిరీస్ షింకన్సెన్ రైళ్లను నడపాలని తొలుత భావించింది. కానీ అధిక ఖర్చులు, జాప్యం కారణంగా ఆ ప్రతిపాదనలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని తొలగించడమే గాక భారత్‌కు ఏకంగా అత్యాధునిక ఇ10 సిరీస్ రైళ్లను అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. అదే సమయంలో ఇ5, ఇ3 సిరీస్‌లకు చెందిన ఒక్కో రైలును ట్రయల్స్ తదితర అవసరాల నిమిత్తం పూర్తి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మోదీ త్వరలో జరపనున్న జపాన్ పర్యటనలో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదురుతుందని సమాచారం. -
India Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి
భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. గుజరాత్లో జరుగుతున్న ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’కు హాజరై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 నాటికి పూర్తవుతుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 35కి.మీ దూరం సిద్ధం అవుతుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు బాగానే జరుగుతున్నాయని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కచ్చితంగా ఏ సమయంలోపు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ కూడా దాదాపు పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే.. దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
ఐఐటీలో 'బుల్లెట్' కోర్సు
కొల్కతా: ఖరగ్‌పూర్ ఐఐటీలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రొఫెసర్ సుబ్రన్షు రాయ్ శుక్రవారం కొల్‌కత్తాలో వెల్లడించారు. ఏ ఏడాది చివరి నాటికి ఈ కోర్సు రూపకల్పన పూర్తి అవుతుందని... ఆ వెంటనే కోర్సును ప్రారంభిస్తామని చెప్పారు. అందుకు భవనాల నిర్మాణం కోసం రైల్వే పరిశధన కేంద్రం (సీఆర్ఆర్) రూ. 20 కోట్లు కేటాయించిందని తెలిపారు. మరో ఆరు నెలలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రైల్వే రంగంలో నాలుగు కీలక అంశాలపై కూడా పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రైల్వేలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాయ్ విశదీకరించారు. ఇప్పటికే క్యాంపస్‌లోని ఐఐటీయన్లు హైస్పీడ్ ట్రైన్ బోగిలో టెక్నాలజీపై పని చేస్తున్నారని తెలిపారు. అలాగే రైల్వే టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధి కోసం రైల్వే శాఖ మరో రూ. 20 కోట్లు మంజురు చేసిందని రాయ్ వెల్లడించారు.