Bumper Insurance
-
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి...మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. .
Madras High Court: వాహనాలకు సంబంధించిన ఇన్సురెన్సులు చేసేప్పుడు ఇటు కొనుగోలుదారులు, అటు ఇన్సురెన్సు కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వాహనం నడిపే వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరిగా చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఏంటీ మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం 2021 సెప్టెంబరు 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు బంపర్ టు బంపర్ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరికీ వర్తించేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా కాలపరిమితి ఐదేళ్లుగా ఉండాలని నిర్దేశించింది. లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనేప్పుడు మైలేజీ, పవర్, డిజైన్లపై ఉన్న శ్రద్ధ తమపై కూడా పెట్టాలని వాహన కొనుగోలుదారులకు సూచించింది. కొద్దిపాటీ ప్రీమియం కట్టేందుకు నిర్లక్క్ష్యం చేస్తే, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కోర్టు అభిప్రాయపడింది. తీర్పుకు కారణం ఇది తమిళనాడులోని హొగినేకల్లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీనిపై నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం సడయప్పన్ కుటుంబానికి రూ.14,.65 లక్షలు పరిహారం చెల్లించాలని ఇన్సురెన్సు కంపెనీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి థర్డ్ ఫార్టీ బీమా చేశారని.. డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని రుజువులు చూపింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్ ఈరోడ్ ట్రైబ్యునల్ ఆదేశాలను రద్దు చేశారు. అంతేకాకుండా ప్రీమియం, కవరేజీలు తక్కువగా ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులను నిరసించారు. వాహన యజమాని, డ్రైవరుతో పాటు అందులో ప్రయాణించే అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సుని తప్పనిసరి గా చేస్తూ తీర్పు ఇచ్చారు. చదవండి: ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్ -
బొజ్జగణపయ్యకు ‘బీమా’
సాక్షి, ముంబై: నగరంలో ప్రతిష్ఠించనున్న గణేశ్ విగ్రహాలకు బీమా సౌకర్యం కల్పించడానికి నిర్వాహకులు ఉత్సాహం చూపుతున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకొని తొమ్మిది రోజులు పూజలు అందుకోనున్న వినాయకుడికి కోట్ల రూపాయల బీమా చేయడానికి ఉత్సవ మండళ్లు మందుకొచ్చాయి. నగరంలోనే అత్యంత సంపన్నమైన కింగ్స్సర్కిల్లోని జీఎస్బీ వినాయకుడికి బీమా సౌకర్యం కల్పించారు. గణేశ్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో రూ.259 కోట్ల బీమా చేశారు. ఈ వినాయకుడికి వేసే ఆభరణాల విలువ సుమారు రూ.22 కోట్లు. నగరంలోని ఇతర మండళ్లతో పోల్చితే అత్యధికం. నగరంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజాకు కేవలం రూ.51 కోట్ల బీమా చేశారు. కింగ్స్సర్కిల్లోని మండపంలో ఐదు రోజులు మాత్రమే ప్రతిష్టించనున్న వినాయకుడి విగ్రహానికి రోజుకు రూ.51.7 కోట్లు బీమా వర్తిస్తోంది. వినాయకుడి విగ్రహాలకు బీమా సౌకర్యం కల్పించడానికి నేష్నలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. లాల్బాగ్చా రాజా రూ.51 కోట్ల బీమా కోసం రూ.12 లక్షల ప్రీమియంను చెల్లిస్తుంది. జీఎస్బీ మండల్ కూడా కనీసం రూ.50 లక్షల ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పాలసీకాదు.. బీమా కంపెనీ సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ.. సాధారణ పాలసీ మాదిరిగా గణేశ్ మండళ్ల వారు బీమాను లెక్కించ వద్దని అన్నారు. మామూలు పాలసీలు రూ.2 కోట్ల వరకు ఉంటాయి. ప్రీమియం రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. కానీ మండళ్ల వారు వేరే విధంగా బీమా చేసుకుంటారు. అగ్ని ప్రమాదం, ఉగ్రవాద చర్యలు, భక్తుల సంఖ్య, ఇతరాత్ర వాటి కోసం బీమా చేస్తారు. ఈ మండలి 1.75 లక్షల కొబ్బరి కాయలను కొనుగోలు చేయడం కోసం టెండర్లను వేసింది. రూ.31.5 లక్షలకు నిర్ణయించారు. ఒక్కో కొబ్బరి కాయ ధర రూ.18 చొప్పున ధర పలకింది. బయటి మార్కెట్లో వీటి ధర రూ.18.20 వరకు ఉంది. బీమా వర్తింపు ఇలా.. విగ్రహం, బంగారం, మండపం, భక్తులకు అగ్ని ప్రమాదం, ఉగ్రవాదుల దాడులు, అల్లర్ల కారణం నష్టం జరిగినా బీమా వర్తిస్తోంది. చతుర్థి మొదటి రోజే ఈ బీమా ప్రారంభం అవుతోంది. చివరి రోజైన ఐదవ రోజు విగ్రహానికి చెందిన బంగారు అభరణాలను ట్రస్టీలు జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో భద్రపర్చే వరకు బీమా కొనసాగుతోంది. ఈ విగ్రహాన్ని మొదటి రోజే బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఈ ఆభరణాలను అలాగే ఉంచుతామని గణేశ్ ఉత్సవ మండలి సభ్యులు పేర్కొన్నారు. నిమజ్జనానికి కొన్ని గంటల ముందు బంగారు ఆభరణాలను తొలగిస్తారు. వీటిని వచ్చే ఏడాది వరకు భద్రపర్చనున్నట్లు సభ్యులు తెలిపారు.