బొజ్జగణపయ్యకు ‘బీమా’ | Ganpati mandals in Mumbai secure bumper insurance | Sakshi
Sakshi News home page

బొజ్జగణపయ్యకు ‘బీమా’

Published Tue, Aug 26 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

Ganpati mandals in Mumbai secure bumper insurance

సాక్షి, ముంబై: నగరంలో ప్రతిష్ఠించనున్న గణేశ్ విగ్రహాలకు బీమా సౌకర్యం కల్పించడానికి నిర్వాహకులు ఉత్సాహం చూపుతున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకొని తొమ్మిది రోజులు పూజలు అందుకోనున్న వినాయకుడికి కోట్ల రూపాయల బీమా చేయడానికి ఉత్సవ మండళ్లు మందుకొచ్చాయి. నగరంలోనే అత్యంత సంపన్నమైన కింగ్స్‌సర్కిల్‌లోని జీఎస్‌బీ వినాయకుడికి బీమా సౌకర్యం కల్పించారు. గణేశ్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో రూ.259 కోట్ల బీమా చేశారు.

 ఈ వినాయకుడికి వేసే ఆభరణాల విలువ సుమారు రూ.22 కోట్లు.  నగరంలోని ఇతర మండళ్లతో పోల్చితే అత్యధికం. నగరంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన లాల్‌బాగ్‌చా రాజాకు కేవలం రూ.51 కోట్ల బీమా చేశారు. కింగ్స్‌సర్కిల్‌లోని మండపంలో ఐదు రోజులు మాత్రమే ప్రతిష్టించనున్న వినాయకుడి విగ్రహానికి రోజుకు రూ.51.7 కోట్లు బీమా వర్తిస్తోంది. వినాయకుడి విగ్రహాలకు బీమా సౌకర్యం కల్పించడానికి నేష్నలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. లాల్‌బాగ్‌చా రాజా రూ.51 కోట్ల బీమా కోసం రూ.12 లక్షల ప్రీమియంను చెల్లిస్తుంది. జీఎస్‌బీ మండల్ కూడా  కనీసం రూ.50 లక్షల ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది.

 సాధారణ పాలసీకాదు..
 బీమా కంపెనీ సీనియర్ మేనేజర్  మాట్లాడుతూ.. సాధారణ పాలసీ మాదిరిగా గణేశ్ మండళ్ల వారు బీమాను లెక్కించ వద్దని అన్నారు. మామూలు  పాలసీలు రూ.2 కోట్ల వరకు ఉంటాయి. ప్రీమియం రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. కానీ మండళ్ల వారు వేరే విధంగా బీమా చేసుకుంటారు. అగ్ని ప్రమాదం, ఉగ్రవాద చర్యలు, భక్తుల సంఖ్య, ఇతరాత్ర వాటి కోసం బీమా చేస్తారు. ఈ మండలి 1.75 లక్షల కొబ్బరి కాయలను కొనుగోలు చేయడం కోసం టెండర్లను వేసింది. రూ.31.5 లక్షలకు నిర్ణయించారు.  ఒక్కో కొబ్బరి కాయ ధర రూ.18 చొప్పున ధర పలకింది. బయటి మార్కెట్‌లో వీటి ధర రూ.18.20 వరకు ఉంది.

 బీమా వర్తింపు ఇలా..
 విగ్రహం, బంగారం, మండపం, భక్తులకు అగ్ని ప్రమాదం, ఉగ్రవాదుల దాడులు, అల్లర్ల కారణం నష్టం జరిగినా బీమా వర్తిస్తోంది. చతుర్థి మొదటి రోజే ఈ బీమా ప్రారంభం అవుతోంది.  చివరి రోజైన ఐదవ రోజు విగ్రహానికి చెందిన బంగారు అభరణాలను ట్రస్టీలు జాగ్రత్తగా బ్యాంక్ లాకర్‌లో భద్రపర్చే వరకు బీమా కొనసాగుతోంది. ఈ విగ్రహాన్ని మొదటి రోజే  బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఈ ఆభరణాలను అలాగే ఉంచుతామని గణేశ్ ఉత్సవ మండలి సభ్యులు పేర్కొన్నారు. నిమజ్జనానికి కొన్ని గంటల ముందు  బంగారు ఆభరణాలను తొలగిస్తారు. వీటిని వచ్చే ఏడాది వరకు భద్రపర్చనున్నట్లు సభ్యులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement