ఆయుష్షులోనూ తక్కువ సమానులే!
మెన్టోన్
లోకంలో సమానత్వం ఎక్కడుంది? చట్టాల్లో తప్ప మరెక్కడా అది కనిపించదు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్ప మరెక్కడా అది వినిపించదు. సమానత్వం ఒక దేవతావస్త్రం. మగువల కంటే మగాళ్లు ఎప్పుడూ తక్కువ సమానులే. వివక్ష ఒత్తిడిలో నలిగి నలిగి, కృంగి కృశించి రాలిపోతున్నది మగాళ్లే. యుగయుగాల చరిత్రను తరచి తరచి చూస్తే తేలే వాస్తవం ఇదే! చివరకు ఆయుర్దాయంలోనూ మగాళ్లు తక్కువ సమానులే! ఆదిమ యుగాల నాటి గణాంకాలేవీ లెక్కలకెక్కలేదు. ఇప్పుడు వాటి జోలికి పోలేం. మధ్యయుగం నాటి నుంచి దొరికే ఆధారాలను చూసుకుంటే, మహిళల కంటే పురుషులే అల్పాయుష్కులనేది ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవం.
కుటుంబ పోషణభారం, భార్యా బిడ్డల రక్షణ భారం, శత్రువుల బెడద నుంచి దేశ రక్షణ భారం... తలకు మించిన భారాలన్నీ మగాళ్ల నెత్తిన యుగాలుగా సవారీ చేస్తున్నాయి. యుద్ధాలు, దాడులు, దండయాత్రలలో మరణించిన వారి లెక్కలను పక్కనపెట్టినా, మధ్యయుగంలో మగాళ్ల సగటు ఆయుర్దాయం మహిళల సగటు ఆయుర్దాయం కంటే దాదాపు పదేళ్లు తక్కువే ఉండేది. యూరోపియన్ దేశాల్లో అప్పట్లో పురుషుల సగటు ఆయుర్దాయం 21.7 ఏళ్లు మాత్రమే అయితే, మహిళల సగటు ఆయుర్దాయం 31.1 ఏళ్లుగా ఉండేది. కాస్త హెచ్చుతగ్గులతో మిగిలిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండేది. యుగం మారింది. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచ గమనం పెనువేగం పుంజుకుంది. అయినా, ఆయుర్దాయంలో మగ బతుకుల వెనుకబాటుతనంలో పురోగతి స్వల్పమే. మూడు దశాబ్దాల కిందట పుట్టిన ప్రస్తుత యువతరంలో మహిళలతో పోలిస్తే మగాళ్ల సగటు ఆయుర్దాయం ఆరేళ్లు తక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.