పోరంబోకు ప్రణాళిక
► రూ.5 కోట్ల శ్మశాన స్థలం కబ్జాకు యత్నం
► పాత్రధారులు అధికార పార్టీనేతలు
► సూత్రధారులు రెవెన్యూ అధికారులు
► హైకోర్టు స్టే ఉన్నా బేఖాతరు
కాసుల వేటలో కొందరు అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై శ్మశాన పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. హైకోర్టులో స్టే ఉన్నా వెనుకాడటం లేదు. ఈ తంతు వెనుక లక్షలాది రూపాయల మతలబు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలోని స్థలాలకు ఐదారేళ్ల నుంచి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దగా విలువ లేని ఇళ్ల స్థలాల ధరలు నేడు ఆకాశాన్నంటుతున్నాయి. సందర్భాన్ని సొమ్ము చేసుకున్న కొంతమంది నాయకులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన స్థలాలను అమ్మేసుకున్నారు. పట్టణంలోని సర్వే నంబరు 1167, 1179, 1180లోని 11.34 ఎకరాల ప్రభుత్వ శ్మశాన పోరంబోకు భూమిపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల కన్ను పడింది. స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రూ.5 కోట్లుపైగా విలువచేసే ఈ భూమికి టెండరు పెట్టారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఓ అధికారి సహకారంతో ఈ భూమిని చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
రికార్డులు తారుమారు
సర్వే నంబరు 1167లో 4.86 ఎకరాలు, సర్వే నంబరు 1179లో 4.89, సర్వే నంబరు 1180లో 1.59 ఎకరాలను వందేళ్ల నుంచి శ్మశాన స్థలంగా వాడుతున్నారు. 1954 ఆర్ఎస్సార్లోనూ ఈ భూమి శ్మశాన పోరంబోకుగా నమోదైవుంది. 2016 మార్చి వరకు కూడా అడంగల్‌లో శ్మశాన పోరంబోకుగానే నమోదై ఉంది. కానీ 2016 జూన్‌లో ఈ శ్మశాన పోరంబోకు కాస్త రికార్డుల్లో పోరంబోకుగా మార్చేశారు. శ్మశాన స్థలాలను కాపాడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేయడంతో ఆ స్థలాన్ని పోరంబోకుగా మార్చేశారు.
కొన్నేళ్ల నుంచి వివాదం
విలువైన ఈ స్థలాన్ని కాజేసేందుకు 20 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూనే ఉన్నారు. గతంలో ఈ భూమికి పెద్దగా విలువ లేకపోవడంతో నేతల కన్ను పడలేదు. కానీ ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో దీన్ని ఎలాగైనా కాజేయాలని అధికార పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాదాల జానకిరాం ఉదయగిరి ఎమ్మెల్యేగా రాష్ట్ర భూగర్భ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని కాజేసేందుకు కొంతమంది ప్రయత్నించగా స్థానికులు ప్రతిఘటించారు. దీంతో ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను, స్థానికులను ఒకచోటకు చేర్చి రెవెన్యూ రికార్డులు పరిశీలించి శ్మశాన స్థలంగా ఉండటంతో అందులో ఎవరికీ ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఆ సమస్య అంతటితో సద్దుమణిగింది. టీడీపీ అధికారంలోకొచ్చిన వెంటనే తహసీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు సహకారంతో పట్టణానికి చెందిన కొంతమంది అధికారపార్టీ నేతలు దీన్ని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ నేతలు ఆ శ్మశాన స్థలం పక్కనే ఉన్న సెటిల్మెంట్లో ఇళ్లస్థలాల లే అవుట్లు వేసి దాని పక్కనే ఉన్న శ్మశాన స్థలంలో 70 సెంట్లు ఆక్రమించి అందులోనూ ప్లాట్లు వేసి విక్రయించారు. ఇందులో సుమారుగా రూ.30 లక్షలకు పైగా ప్రభుత్వ భూమిని అమ్మున్నారనే విమర్శలున్నాయి. ఇంతటితో ఆగక పక్కనే ఉన్న మిగతా మొత్తం స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. అంతే కాకుండా ఈ స్థలాన్ని ఇళ్ల ప్లాట్లుగా మార్చేందుకు అభ్యంతరాలుంటే తెలియజేయాలని రెవెన్యూ అధికారులు పంచాయతీకి ఏ-1 నోటీసు పంపించారు. దీంతో పరిస్థితి మరింత రచ్చకెక్కడంతో పంచాయతీ పాలకవర్గం ఇది శ్మశాన స్థలమైనందున ఇళ్ల పాట్లుగా మార్చేందుకు తీర్మానం ఇవ్వలేమని పంపించారు. కొంతమంది స్థానికులు ఈ విషయమై 2016 జనవరిలో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు.
ఆగని ప్రయత్నాలు
ఇంత రచ్చకెక్కినా గుట్టుచప్పుడు కాకుండా ఈ శ్మశాన భూమికి సంబంధించి 300కుపైగా ఇళ్ల ప్లాట్లుగా విభజించి లేఅవుట్లు తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాత తేదీలతో ఈ పట్టాలను అధికార పార్టీ నేతల చేతుల్లో పెట్టేందుకు రెవెన్యూ కార్యాలయంలో పత్రాలు సిద్ధమైనట్లు తెలిసింది. నెలలోపు ఈ పట్టాలన్నీ అధికార పార్టీ నేతలకు అందించేందుకు రంగం సిద్ధమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వెంకటరామారావు దృష్టికి కొంతమంది నేతలు తీసుకెళ్లినట్లుగా సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి శ్మశాన స్థలాన్ని కాపాడాలని ఉదయగిరి పట్టణవాసులు కోరుతున్నారు.
ఇళ్ల స్థలాలు ఎవరికీ ఇవ్వడం లేదు
పై సర్వే నంబర్లకు సంబంధించిన భూమి హైకోర్టులో స్టేలో ఉంది. ఆ స్థలంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు. గతంలో ఈ స్థలం ప్రభుత్వ అనాదీనంగా ఉంది. అడంగల్‌లో శ్మశానంగా ఎలా మారిందో నాకు తెలియదు. ఈ స్థలానికి సంబంధించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం లేదు. - కుర్రా వెంకటేశ్వర్లు, తహసీల్దారు