ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం
= ఆటోను, పాదచారులను ఢీకొన్న వైనం
= వీఆర్ఏతో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు
నల్లమాడ: ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ఆటోను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. మంగళవారం సాయంత్రం నల్లమాడ నుంచి చౌటకుంటపల్లికి ప్రయాణికులతో ఆటో బయల్దేరింది. బస్టాండ్ కూడలి సమీపాన బ్రిడ్జిపైకి రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన శ్రీబాలాజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది.
ఆటోలో ప్రయాణిస్తున్న చౌటకుంటపల్లికి చెందిన వీఆర్ఏ సికిందర్, వెంకటనర్సమ్మ, ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనసూయమ్మ, తండాకు చెందిన సాకమ్మ తీవ్రంగా గాయపడ్డారు. సంతకొచ్చి నడుచుకుంటూ వెళుతున్న బాసంవారిపల్లికి చెందిన రామక్క, పెమనకుంటపల్లికి చెందిన ఈశ్వరమ్మలను కూడా ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఎస్ఐ గోపీ తమ సిబ్బందితో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో కలసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన్, సర్పంచ్ రంగలాల్‌నాయక్, పంచాయితీ కార్యదర్శి శంకరనాయుడు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు క్షతగాత్రులను పరామర్శించారు.
మెరుగైన వైద్యం అందించండి: ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైఎస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమీప బంధువులకు చెందిన స్కూల్ బస్సు కావడంతో కేసు తారుమారయ్యే అవకాశముందున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.