Business Administration
-
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్‌కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్‌లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్‌నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్‌నర్ ఇంటికి వెళ్తున్న వివేక్‌కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్‌పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. -
17 ఏళ్లకే పీహెచ్డీ, అది కూడా ఆ సబ్జెక్ట్‌లో!
చదువుకు వయసుతో సంబంధం లేదని ఎంతోమంది నిరూపిస్తుంటే.. అతిపిన్న వయసులో డిగ్రీలు పూర్తిచేసి ఔరా అనిపిస్తున్నారు మరికొందరు. పీహెచ్డీ చేయాలంటే.. పది, పన్నెండు తరగతులు, డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చదవాల్సిందే. ఇవన్నీ చదివి పీహెచ్డీ పూర్తి చేసేనాటికి సాధారణంగా చాలామందికి తల నెరుస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ టీనేజర్ అమ్మాయి అతి చిన్నవయసులో పీహెచ్డీ పూర్తిచేసి అబ్బురపరుస్తోంది. ఎక్కువమంది కష్టంగా భావించే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ పొంది చరిత్ర సృష్టించింది. సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏదీ ఉండదని 17 ఏళ్ల కింబెర్లీ స్ట్రాంబుల్ చాటిచెబుతోంది. అమెరికాలోని మోంటానాకు చెందిన కింబెర్లీ.. కాలిఫోర్నియా ‘ఇంటర్కాంటినెంటల్ యూనివర్సిటీ’ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ పూర్తిచేసి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రపంచ నాయకత్వ ప్రాధాన్యం...’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆమె డాక్టరేట్ చేసింది. వివిధ సబ్జెక్టుల్లో డాక్టరేట్ పొందిన ప్రపంచ అతిపిన్న వయస్కుల జాబితాలో మూడోవ్యక్తిగా కింబెర్లీ్ల నిలిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత చిన్నవయసులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ను ఎవరూ పొందకపోవడం గమనార్హం. కింబెర్లీ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు నేను చాలా సంతోషంగానూ ప్రశాంతంగానూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. తరువాత ఏం చేయాలి? తరువాత ఏం చేయాలి? అనుకుంటూ ముందుకు సాగి చివరికి డాక్టరేట్ పొందాను’’ అని కింబెర్లీ్ల చెప్పింది. ‘‘ప్రస్తుతం నేను చట్టపరమైన అంశాలపై పనిచేస్తున్నాను. వయసు పరంగా చాలా వివక్షకు గురయ్యాను. అయినప్పటికీ నేను ఆర్జించిన జ్ఞానంతో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని కింబర్లే చెప్పింది. కింబర్లే కాకుండా ఆమె అక్క కూడా 18 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం తన చెల్లి కూడా చిన్నవయసులో డిగ్రీలు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ‘‘మేము ఎప్పుడూ పిల్లల్ని అలా చదవండి, ఇలా చదవండి అని బలవంతపెట్టలేదు. వాళ్లకు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రోత్సహించాము. కింబెర్లీ్ల ఇష్టంతో చదివి డాక్టరేట్ సాధించింది’’ అని ఆమె తండ్రి జార్జ్ చెప్పారు. తను పీహెచ్డీ పూర్తిచేయడంలో మేమూ ఎంతో కష్టపడ్డామని, ఆమెకు అన్నిరకాలుగా సాయం చేస్తూ.. డాక్టరేట్ వచ్చేంతవరకు కృషిచేశామన్నారు. చదవండి: మోస్టు డేంజరస్ రోడ్లు ఎక్కడున్నాయంటే? -
ఊరు మెచ్చిన సర్పంచ్!
ఆరతి దేవి తన నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ‘‘రిస్క్ ఎందుకమ్మా!’’ అన్నవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసిన ఆరతి న్యాయశాస్త్రం చదివారు. బరంపురంలో ఐడిబిఐలో ఉద్యోగం కూడా చేశారు. 2012 పంచాయతీ ఎన్నికల సమయంలో తన స్వగ్రామం ధున్కపాడ (గంజాం జిల్లా, ఒడిసా)నుంచి సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. విషయం ఆ గ్రామస్థులకు తెలిసి - ‘‘మీకు ఎవరూ పోటీ కాదు. మీరే మా సర్పంచ్’’ అని ఆరతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధున్కపాడ తన స్వగ్రామమే అయినా... చదువుల కోసమని బరంపురం, హైదరాబాద్‌లలో ఎక్కువ కాలం ఉన్నారు. స్వగ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే ఆమె లక్ష్యానికి అదేమీ అడ్డంకిగా మారలేదు. కార్పొరేట్ రంగంలో తాను నేర్చుకున్న మేనేజ్మెంట్ స్కిల్స్‌ను గ్రామీణపాలనలో ఉపయోగించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచాయితీకి గోధుమలు వస్తున్నప్పటికీ చాలామంది పేదలకు అవి అందేవి కావు. ఇలాంటి అవకతవకలు జరగకుండా అర్హులైన అందరికీ గోధుమలు అందేలా ఆమె చర్య తీసుకున్నారు. ‘తిప నుహె దస్తక్ హాత్’ పేరుతో గ్రామ మహిళలను అక్షరాస్యులను చేసే కార్యక్రమాలను చేపట్టారు. దీనివల్ల గ్రామంలోని మహిళలందరూ వేలి ముద్రలకు స్వస్తి పలికి సంతకాలు చేయడమే కాదు... దరఖాస్తులను కూడా తామే స్వయంగా నింపుతున్నారు. గ్రామీణ కళల పునరుజ్జీవనానికి కూడా ఆరతి కృషి చేస్తున్నారు. చట్టం, న్యాయం, హక్కులకు సంబంధించిన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ‘‘సామాజిక అభివృద్ధికి ఇలాంటివి తప్పనిసరి’’ అంటారు ఆమె. పదివేల జనాభా ఉన్న ధున్కపాడ ఒకప్పుడు రాజకీయంగా సున్నితమైన ప్రాంతం. నిరక్షరాస్యత, హింస, లింగవివక్షత, మౌలిక వసతుల లేమీ... మొదలైనవి ఎక్కువగా కనిపించేవి. ఆరతి ఆ గ్రామానికి సర్పంచ్ అయిన తరువాత ధున్కపాడ సమస్యాత్మక గ్రామం నుంచి ‘ఆదర్శ గ్రామం’గా మారింది.‘‘జీవితాంతం నా గ్రామ ప్రజలకు సేవ చేస్తూ ఇక్కడే గడపాలనుకుంటున్నాను’’ అంటున్నారు ఆరతి. ఆమె నిబద్ధత ఊరికే పోలేదు. ‘రాజీవ్ గాంధీ లీడర్షిప్’ పురస్కారం ఆరతికి దక్కింది.