ఊరు మెచ్చిన సర్పంచ్! | aarati devi got as good sarpanch in his village | Sakshi
Sakshi News home page

ఊరు మెచ్చిన సర్పంచ్!

Published Tue, Nov 11 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

ఊరు మెచ్చిన సర్పంచ్!

ఊరు మెచ్చిన సర్పంచ్!

ఆరతి దేవి తన నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ‘‘రిస్క్ ఎందుకమ్మా!’’ అన్నవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసిన ఆరతి న్యాయశాస్త్రం  చదివారు. బరంపురంలో ఐడిబిఐలో ఉద్యోగం కూడా చేశారు. 2012 పంచాయతీ ఎన్నికల సమయంలో తన స్వగ్రామం ధున్కపాడ (గంజాం జిల్లా, ఒడిసా)నుంచి సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. విషయం ఆ గ్రామస్థులకు తెలిసి - ‘‘మీకు ఎవరూ పోటీ కాదు. మీరే మా  సర్పంచ్’’ అని ఆరతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ధున్కపాడ తన స్వగ్రామమే అయినా... చదువుల కోసమని బరంపురం, హైదరాబాద్‌లలో ఎక్కువ కాలం ఉన్నారు. స్వగ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే ఆమె లక్ష్యానికి అదేమీ అడ్డంకిగా మారలేదు. కార్పొరేట్ రంగంలో తాను  నేర్చుకున్న మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను గ్రామీణపాలనలో ఉపయోగించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచాయితీకి గోధుమలు వస్తున్నప్పటికీ  చాలామంది పేదలకు అవి అందేవి కావు. ఇలాంటి అవకతవకలు జరగకుండా అర్హులైన అందరికీ గోధుమలు అందేలా ఆమె చర్య తీసుకున్నారు.

‘తిప నుహె దస్తక్ హాత్’ పేరుతో గ్రామ మహిళలను అక్షరాస్యులను చేసే కార్యక్రమాలను చేపట్టారు. దీనివల్ల గ్రామంలోని మహిళలందరూ వేలి ముద్రలకు స్వస్తి పలికి సంతకాలు చేయడమే కాదు... దరఖాస్తులను కూడా తామే స్వయంగా నింపుతున్నారు. గ్రామీణ కళల పునరుజ్జీవనానికి కూడా ఆరతి  కృషి చేస్తున్నారు. చట్టం, న్యాయం, హక్కులకు సంబంధించిన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ‘‘సామాజిక అభివృద్ధికి ఇలాంటివి తప్పనిసరి’’ అంటారు ఆమె. పదివేల జనాభా ఉన్న ధున్కపాడ ఒకప్పుడు రాజకీయంగా సున్నితమైన ప్రాంతం.

నిరక్షరాస్యత, హింస, లింగవివక్షత, మౌలిక వసతుల లేమీ... మొదలైనవి ఎక్కువగా కనిపించేవి. ఆరతి ఆ గ్రామానికి సర్పంచ్ అయిన తరువాత ధున్కపాడ సమస్యాత్మక గ్రామం నుంచి ‘ఆదర్శ గ్రామం’గా మారింది.‘‘జీవితాంతం నా గ్రామ ప్రజలకు సేవ చేస్తూ ఇక్కడే గడపాలనుకుంటున్నాను’’ అంటున్నారు ఆరతి. ఆమె నిబద్ధత ఊరికే పోలేదు. ‘రాజీవ్ గాంధీ లీడర్‌షిప్’ పురస్కారం ఆరతికి దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement