17 ఏళ్లకే పీహెచ్‌డీ, అది కూడా ఆ సబ్జెక్ట్‌లో! | 17 Year Old Girl Gets Doctorate In Business Administration | Sakshi
Sakshi News home page

17 ఏళ్లకే పీహెచ్‌డీ, అది కూడా ఆ సబ్జెక్ట్‌లో!

Published Sun, Mar 21 2021 9:19 AM | Last Updated on Sun, Mar 21 2021 1:22 PM

17 Year Old Girl Gets Doctorate In Business Administration - Sakshi

సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏదీ ఉండదని 17 ఏళ్ల కింబెర్లీ స్ట్రాంబుల్‌ చాటిచెబుతోంది. ఎక్కువమంది కష్టంగా భావించే బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ పొంది చరిత్ర సృష్టించింది.

చదువుకు వయసుతో సంబంధం లేదని ఎంతోమంది నిరూపిస్తుంటే.. అతిపిన్న వయసులో డిగ్రీలు పూర్తిచేసి ఔరా అనిపిస్తున్నారు మరికొందరు. పీహెచ్‌డీ చేయాలంటే.. పది, పన్నెండు తరగతులు, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌ చదవాల్సిందే. ఇవన్నీ చదివి పీహెచ్‌డీ పూర్తి చేసేనాటికి సాధారణంగా చాలామందికి తల నెరుస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ టీనేజర్‌ అమ్మాయి అతి చిన్నవయసులో పీహెచ్‌డీ పూర్తిచేసి అబ్బురపరుస్తోంది. ఎక్కువమంది కష్టంగా భావించే బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ పొంది చరిత్ర సృష్టించింది.

సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏదీ ఉండదని 17 ఏళ్ల కింబెర్లీ స్ట్రాంబుల్‌ చాటిచెబుతోంది. అమెరికాలోని మోంటానాకు చెందిన కింబెర్లీ.. కాలిఫోర్నియా ‘ఇంటర్‌కాంటినెంటల్‌ యూనివర్సిటీ’ లో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ‘బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రపంచ నాయకత్వ ప్రాధాన్యం...’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆమె డాక్టరేట్‌ చేసింది. వివిధ సబ్జెక్టుల్లో డాక్టరేట్‌ పొందిన ప్రపంచ అతిపిన్న వయస్కుల జాబితాలో మూడోవ్యక్తిగా కింబెర్లీ్ల నిలిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత చిన్నవయసులో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ను ఎవరూ పొందకపోవడం గమనార్హం. 

కింబెర్లీ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు నేను చాలా సంతోషంగానూ ప్రశాంతంగానూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. తరువాత ఏం చేయాలి? తరువాత ఏం చేయాలి? అనుకుంటూ ముందుకు సాగి చివరికి డాక్టరేట్‌ పొందాను’’ అని కింబెర్లీ్ల చెప్పింది. ‘‘ప్రస్తుతం నేను చట్టపరమైన అంశాలపై పనిచేస్తున్నాను. వయసు పరంగా చాలా వివక్షకు గురయ్యాను. అయినప్పటికీ నేను ఆర్జించిన జ్ఞానంతో ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని కింబర్లే చెప్పింది. కింబర్లే కాకుండా ఆమె అక్క కూడా 18 ఏళ్లకే మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం తన చెల్లి కూడా చిన్నవయసులో డిగ్రీలు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

‘‘మేము ఎప్పుడూ పిల్లల్ని అలా చదవండి, ఇలా చదవండి అని బలవంతపెట్టలేదు. వాళ్లకు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రోత్సహించాము. కింబెర్లీ్ల ఇష్టంతో చదివి డాక్టరేట్‌ సాధించింది’’ అని ఆమె తండ్రి జార్జ్‌ చెప్పారు. తను పీహెచ్‌డీ పూర్తిచేయడంలో మేమూ ఎంతో కష్టపడ్డామని, ఆమెకు అన్నిరకాలుగా సాయం చేస్తూ.. డాక్టరేట్‌ వచ్చేంతవరకు కృషిచేశామన్నారు.

చదవండి: మోస్టు డేంజరస్‌ రోడ్లు ఎక్కడున్నాయంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement