రచయితల మాస్టారు
‘మాస్టారు’ అన్న మాట వినగానే సాధారణంగా పాఠశాలల్లో చదువు చెప్పే అధ్యాపకుడే చాలామందికి గుర్తుకు వస్తారు. కానీ ఈ మాస్టారు అలా కాదు. మూడున్నర దశాబ్దాలు పైగా విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆ రోజుల్లోనే విద్యార్థుల్లో సాహిత్యంపై అంతర్లీనంగా ఎంతోకొంత అభిరుచి ఉందని గుర్తించారు. కానీ దానిని ప్రోత్సహించే వేదికలే లేవని ఆవేదన చెందారు. ఆ ఆవేదన నుంచే.. అటువంటి వేదికకు ఊపిరి పోశారు. దానిద్వారా ఔత్సాహిక రచయితలకు శిక్షణ ఇస్తూ.. సాహితీ క్షేత్రంలో మేలురకాల విత్తుల రూపకల్పనకు కృషి చేస్తున్నారు. ‘రచయితల మాస్టారు’గా మారి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
రాజమండ్రి కల్చరల్ :కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో శేషమ్మ, వేంకట రమణయ్య దంపతులకు బులుసు వేంకట సత్యనారాయణమూర్తి (బీవీఎస్ మూర్తి) 1946 మార్చి 24న జన్మించా రు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన ఎంఏ పూర్తి చేసిన తరువాత ‘కన్నడ, ఆంధ్ర భారతాలపై తులనాత్మక పరిశీలన’ అనే అంశంపై కర్నాటక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. ఎందరో మహామహోపాధ్యాయులకు నిలయమైన రాజమహేంద్రిలో ప్రతిష్టాత్మక గౌతమీ ఓరియంటల్ కళాశాలలో తెలుగు రీడరుగా పని చేశారు. 2004లో విశ్రాంత ఉద్యోగిగా మారారు. పాఠాలు చెబుతున్న రోజుల్లో అనేకమంది విద్యార్థుల్లో తెలుగు భాషపట్ల మక్కువ, సాహిత్యంపట్ల అభినివేశం ఉన్నాయని ఆయన గమనించారు.
అయితే అందులో తప్పొప్పులు చెప్పి, వారిని ప్రోత్సహించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి ఒక వేదిక కావాలని భావించారు. ఈ యోచన నుంచే.. 1992లో తెలుగు భాషా వికాసం కోసం స్థాపించిన ‘కళాగౌతమి’ సంస్థకు అనుబంధంగా.. 2004లో ‘రచయితల సమితి’ ఏర్పాటు చేశారు. ‘అంతరించిపోనున్న ప్రపంచ భాషల్లో తెలుగు ఒకటి’ అన్న యునెస్కో ప్రకటన ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అమ్మ భాషను పరిరక్షించుకోవడానికి కళాగౌతమి, ‘రచయితల సమితి’ ద్వారా కృషి ప్రారంభించారు. ప్రతి నెలా రెండో ఆదివారం ‘రచయితల సమితి’ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి అన్ని వయస్సులవారూ ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలు నగరంలోని ఔత్సాహిక సాహితీవేత్తలకు శిక్షణ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి.
విభిన్న సాహితీ ప్రక్రియల్లో శిక్షణ
రచయితల సమితి ద్వారా విభిన్న సాహితీ ప్రక్రియల్లో ఔత్సాహిక యువతను మూర్తి ప్రోత్సహించనారంభించారు. పద్యం, గేయం, కథ, కథానిక, నాటకం, వ్యాసం.. ఇలా రకరకాల ప్రక్రియల్లో తమ రచనలు వినిపించాలని కోరేవారు. దీంతోపాటు ఛందస్సు, ప్రసంగించడంపై శిక్షణ తరగతులు ప్రారంభించారు. మొదట్లో ఐదారుగురు మాత్రమే ఉత్సుకత చూపేవారు. క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. యువతతోపాటు పెద్దలూ రావడం ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ, పురుషులు.. ఇలా అందరూ ఈ వేదికపైకి ఉత్సాహంగా రావడం ప్రారంభించారు. సిద్ధాంతాలు, మతాలకు అతీతంగా అనేకమంది రాసాగారు. సభల్లో మాట్లాడటానికి వారిని సిద్ధం చేయడానికి కూడా ఇదే తొలి వేదిక అయింది.
పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వోద్యోగం చేసి, రాజమండ్రిలో విశ్రాంత జీవితం గడుపుతున్న బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి ఇక్కడే ఛందస్సు నేర్చుకుని ‘చటచటలు’ అనే శతకాన్ని రచించారు. ఇక్కడే అన్నప్రాశన జరిగాక, గూటం స్వామి ‘స్వామి శతకం’ రచించారు. ఇటీవలే విజయవంతంగా తొలి అష్టావధానం పూర్తి చేసిన తాతా సందీప్ తొలి సాహితీ వేదిక కూడా ఇదే అయింది. సీఏ విద్యార్థిని రామచంద్రుని మౌనిక ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికీ హాజరవుతూ స్వీయ రచనలు వినిపించడంతోపాటు ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసి, అందరి మెప్పూ పొందుతోంది. ప్రముఖ గేయ రచయిత మల్లెమొగ్గల గోపాలరావు కోడలు, శేషుకుమారి ఇక్కడే సాహితీ నడకలు నేర్చుకుంటున్నారు. మధ్యవయస్కురాలైన దేవులపల్లి లక్ష్మీకాంతం రచనలు వినిపించడం, చిన్నచిన్న ప్రసంగాలు చేయడానికి ఈ వేదికపైనే అక్షరాభ్యాసం జరిగింది. ఆకాశవాణి రాజ్యమేలుతున్న రోజుల్లో వచ్చిన ‘బాలానందం’ నాటి తరాన్ని ఎంతగా ఆకర్షించేదో, మూర్తి మాస్టారు స్థాపించిన ‘రచయితల సమితి’ సమావేశాలు కూడా అంతటి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని పలువురు సాహితీవేత్తలు అంటారు.